Sunday, August 3, 2025

ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు..రూ.10 లక్షల జరిమానా

- Advertisement -
- Advertisement -

ఇంట్లో పని మనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో హాసన మాజీ ఎంపీ 34 ఏళ్ల ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు పడింది. బెంగళూరు లోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసింది. ఇటీవల విచారణను పూర్తి చేసిన న్యాయమూర్తి సంతోశ్ గజానన హెగ్డే .. రేవణ్ణను శుక్రవారం దోషిగా తేల్చగా, తాజాగా శనివారం ఈ శిక్షతోపాటు రూ.10 లక్షల జరిమానా ప్రకటించారు. అంతకు ముందు ఇదే కేసులో తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని మాజీ ఎంపీ వేడుకున్నాడు. ఆ సమయంలో బిగ్గరగా ఏడ్చాడు. తానేమీ తప్పు చేయలేదని, తాను రాజకీయాల్లో వేగంగా ఎదగడమే తాను చేసిన తప్పని సమర్ధించుకున్నాడు . తాను బీఇ మెకానికల్ విద్యార్థినని, ఎప్పుడూ మెరిట్‌పై ప్యాసయ్యే వాడినని కోర్టుకు చెప్పుకున్నాడు. “ అనేకమంది మహిళలపై తాను అత్యాచారం చేశానని వారు చెబుతున్నారు. ఆ మహిళలకు సంబంధించి ఎవరూ ముందుకు వచ్చి తమకు తాము ఫిర్యాదు చేయలేదు.

గత ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆరు రోజులు ముందుగా వారు వచ్చారు. ప్రాసిక్యూషన్ వైపు వారిని తమ ప్రయోజనం కోసం ముందుకు తీసుకొచ్చి వారిచే ఫిర్యాదు చేయించారు” అని రేవణ్ణ కోర్టు ముందు వివరించాడు. ఈ కేసులో బాధితురాలు తన భర్తతోసహా ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. కొన్ని వీడియోలు వైరల్ కావడంతో ఆమె ఫిర్యాదు చేసింది. ” అని ఆరోపించాడు. కోర్టు తీర్పును తాను శిరసావహిస్తానని చెప్పాడు. “ నాకు కుటుంబం ఉంది. ఇప్పటికి ఆరు నెలలుగా నా తల్లిని , తండ్రిని చూడలేదు. దయచేసి నాకు తక్కువ శిక్ష విధించండి. ” అని కోర్టును వేడుకున్నాడు. ఆగస్టు 1న తీర్పు ప్రకటించిన తరువాత కూడా ప్రజ్వల్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. న్యాయస్థానం నుంచి బయటకు వచ్చిన అనంతరం వెక్కివెక్కి ఏడ్చాడు. కేఆర్ నగర్‌కు చెందిన మహిళ 2024 ఏప్రిల్ 28న హొళెనరసీపుర ఠాణాలో ప్రజ్వల్ రేవణ్ణపై ఫిర్యాదు చేయడంతో ఆయనపై అత్యాచారం కేసు నమోదు చేసింది. గన్నిగడ ఫాంహౌస్‌లో తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు (47) తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో 378(2) కె, 376(2)(ఎన్) 354ఎ,354 బి, 354 సి, తదితర వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. 2024 సెప్టెంబర్‌లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్ ) ఈ కేసు దర్యాప్తుపై 113 సాక్షాలతో 1632 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. దీంతో మొత్తం నాలుగు వేర్వేరు అత్యాచార కేసులు ప్రజ్వల్‌పై నమోదయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగా 14 నెలలుగా ప్రజ్వల్ కారాగారంలో విచారణ ఖైదీగా ఉండగా, తాజాగా శిక్ష ఖరారైంది. మాజీ ప్రధాని, జెడి(ఎస్)సంస్థాగత అధినేత హెచ్‌డి దేవెగౌడ మనుమడు ప్రజ్వల్ రేవణ్ణ. వీడియోలు అమర్చిన పెన్‌డ్రైవ్స్ రేవణ్ణ అత్యాచార సంఘటనలను బయటపెట్టాయి. ఈ కేసుకు సంబంధించి జర్మనీ నుంచి రేవణ్ణ బెంగళూరుకు గత ఏడాది మార్చి 31న చేరుకోగానే సిట్ అరెస్టు చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి ఎంపీగా ఆయన గెలుపొందలేక పోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News