Sunday, August 3, 2025

కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర అటవీ, ప ర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు పై ఆదేశాలు జారీ చే సింది. సినీనటి సమంత విడాకులకు మాజీ మం త్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆరే కారణమని మం త్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేసిన వి షయం తెలిసిందే. అలాగే కేటీఆర్‌కు డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ తదితర వ్యవహారాలతో సంబంధం ఉందంటూ మంత్రి సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖపై కెటిఆర్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం కెటిఆర్ పరువు నష్టం దావాను బిఎన్‌ఎస్ సెక్షన్ 356 కింద పరిగణలోకి తీసుకోవాలని కోర్టు నిర్ణయించింది. బిఎన్‌ఎస్ సెక్షన్ 222 r/w 223 ప్రకారం నేరాన్ని స్వీకరించాలని కోర్టు నిర్ణయించింది. కెటిఆర్ తరపున న్యాయవాది సిద్దార్ద్ పోగుల తన వాదనలు వినిపించారు. కొండ సురేఖ చేసిన ఆరోపణలు నిరాధారంగా ఉన్నాయని కోర్టుకు తెలిపారు.

ఈ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు, సమర్పించిన పత్రాలు, ఫిర్యాదును పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేయడానికి తగిన ఆధారాలు ఉన్నట్లు కోర్టు గుర్తించిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో కొండ సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ నెల 21వ తేదీలోపు నోటీసులు జారీ చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. హైకోర్టు ఆదేశం ప్రకారం కోర్టుకు ఈ అధికారం ఉందని కోర్టు పేర్కొంది. కాగా, మంత్రి కొండ సురేఖ తరపున న్యాయవాది పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సురేఖ చేసిన వ్యాఖ్యలు మీడియాలో ముందే వచ్చాయన్న వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. కెటిఆర్ చేసిన ఫిర్యాదు ఊహాగానాల ఆధారంగా ఉందని, సరైన సమాచారం లేదని, ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ పరిధి తదితర అంశాలపై తెలిపిన అభ్యంతరాలను కోర్టు తిరస్కరించింది. పెన్ డ్రైవ్ 65–B సర్టిఫికేట్ అవసరం అనే వాదన ఈ దశలో అప్రస్తుతమని, విచారణ సమయంలో ఈ అంశాన్ని పరిశీలిస్తామని కోర్టు స్పష్టం చేసింది.

ఈ కేసులు నాకు కొత్త కాదు: కొండా సురేఖ
ఈ కేసులు, కొట్లాటలు తనకు కొత్త కాదని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. బిఆర్‌ఎస్ నేత కెటిఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించిన నేపథ్యంలో మంత్రి స్పందిస్తూ, ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కేసుకు సంబంధించి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకు వెళ్లాలని స్పష్టం చేసిందని . తనకు ఈ దేశ న్యాయ వ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉందని ఆమె పేర్కొన్నారు. తనకు, తన జీవితమే ఒక పోరాటమన్నారు. ఏ కేసులో అయినా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం సర్వసాధారణమని ఆమె తెలిపారు.

ఇది జరిగి రెండు రోజులు అయ్యిందని, అయితే, కొంతమంది పాత్రికేయ మిత్రులు, జర్నలిస్టు సోదరులు కొండా సురేఖ కేసులో సంచలనం, బిగ్ బ్రేకింగ్ అంటూ వార్తలు రాయడంలో వారి ఉత్సాహం చూస్తుంటే తనకు చాలా సంభ్రమాశ్చర్యమనిపిస్తోందని ఆమె చెప్పారు. కొండా సురేఖ పేరు వినపడగానే కొందరికి చాలా ఉత్సాహం వస్తుందని ఆమె పేర్కొన్నారు. కొంతమంది రిపోర్టర్లు, తన కేసులో కోర్టు తీర్పు ఇచ్చిందని మీడియా, సోషల్ మీడియాల్లో రాస్తున్నారు. ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆమె తెలిపారు. చివరగా తాను చెప్పేది ఒక్కటేనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని కొండా సురేఖ ప్రకటనలో పేర్కొన్నారు.

సత్యమేవ జయతే: కెటిఆర్ ట్విట్
కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం దావాలో నాంపల్లి కోర్టు క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో కెటిఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. సత్యమేవ జయతే అంటే పోస్ట్ చేశారు. వెంటనే కాకపోయినా చివరికి నిజం ఎప్పుడూ బయటపడుతుందన్నారు. అధికారం మీ అర్థంలేని దుష్ప్రచారాల నుంచి వ్యక్తిత్వ దుర్వినియోగం నుంచి మిమ్మల్ని విముక్తి చేయదని తెలిపారు. అధికారం ప్రజల జీవితాలను మలినాలతో లాడగానికి మీకు హక్కు ఇవ్వదని చెప్పారు. అధికారంలో ఉండటం అనేది ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం, పుకార్లు పుట్టించడానికి, ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోసేందుకు కాదని హితవు పలికారు. రాజకీయాల పేరుతో విషం చిమ్మి తప్పించుకోగలమని భావించే ప్రతి ఒక్కరికీ ఇది ఒక పాఠంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇది సుదీర్ఘ యుద్దమని, సగం దూరంలోనే ఉన్నామని, పోరాడుతూనే ఉంటా అంటూ కెటిఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News