Sunday, August 3, 2025

కమలానికి ఆటుపోట్లు… ఇసికి ఓటు పాట్లు

- Advertisement -
- Advertisement -

దేశంలో మూడోసారి బొటాబొటీ స్థానాలతో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ చుట్టూ సమస్యలు ముసురుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక విషయంలో జరుగుతున్న జాప్యం ఒకవైపు, ఆ పార్టీ మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌తో దూరం పెరిగినట్టు వస్తున్న వార్తలు మరోవైపు, రాష్ట్రాలలో పార్టీలో నాయకుల మధ్య అంతర్గత విభేదాలు బహిరంగం కావడం, వాటి మీద కేంద్ర నాయకత్వానికి పట్టు సడలిపోవడం, ఎన్నికల్లో అక్రమాలు చేసి అధికారంలోకి రావడం కోసం ఎన్నికల సంఘాన్ని దురుపయోగం చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నాయకత్వంలోని ‘ఇండియా’ కూటమి చేస్తున్న ఆరోపణలు కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జాతీయ స్థాయిలో పార్టీ అధ్యక్షుడి ఎంపికలో జరుగుతున్న జాప్యం. భారతీయ జనతా పార్టీ నియమావళి ప్రకారం అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వ్యక్తి మూడు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. అదే వ్యక్తికి రెండవసారి కొనసాగింపు ఇచ్చే వెసులుబాటు ఉంది పార్టీ నియమావళిలో. అదే పద్ధతిలో ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న అమిత్ షా 2014 నుంచి 2020 వరకు అధ్యక్షుడిగా కొనసాగారు. తర్వాత అధ్యక్షుడైన జెపి నడ్డా 2020 నుంచి ప్రస్తుతం వరకు కొనసాగుతూనే ఉన్నారు. నిజానికి 2023 తోటే ఆయన పదవీకాలం పూర్తయింది.

నియమావళిలో ఇచ్చిన వెసులుబాటు కారణంగా ఆయన మరో మూడేళ్ళ పాటు కొనసాగడానికి వీలున్నా అది అధికారికంగా ప్రకటిం చకుండా నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్టు అభిప్రాయం కలిగించారు. ఎందుకు కొత్త అధ్యక్షుణ్ణి ఎంపిక చేసుకోలేకపోతున్నారు అనే అంశం మాత్రం పార్టీ లోపల వెలుపల చర్చనీయాంశంగా మారింది ఇటీవల కాలంలో. ఇదే సమయంలో ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్‌ఖడ్ హఠాత్తుగా అనారోగ్య కారణాలతో రాజీనామా చేయడం వెనుక ఉన్న అసలు కారణాలను గురించిన ఊహాగానాలు భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగానే కొనసాగాయి.ఇక అంతర్గత విభేదాల విషయానికొస్తే ఇందులో తెలంగాణను గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారం కోసం తెలంగాణ రాష్ట్రం మీద దృష్టి సారించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి పదేళ్లకాలంలో 2023లో జరిగిన శాసనసభలో ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు, 2024 లో జరిగిన లోకసభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకొని, ఆ తర్వాత కొద్ది రోజులకే రెండు శాసనమండలి స్థానాలను కూడా గెలుచుకొని ఇటీవలి కాలంలో లేని విధంగా బలాన్ని పెంచుకున్నదనడంలో సందేహం లేదు.

పదేళ్ళు అధికారంలో ఉండి ఓటమి పాలైన భారత రాష్ట్ర సమితి స్థానాన్ని బిజెపి ఆక్రమించవచ్చునని వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొనే పార్టీ బిజెపి అని ఒక అభిప్రాయం ఏర్పడుతున్న క్రమంలో పార్టీ అంతఃకలహాలు బయటపడడం ఆ వెనువెంటనే జరిగిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక తీరు చూసినవారు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ విషయంలో గతంలో ఉండిన పట్టుదల తగ్గిందా లేక పార్టీ మీద పట్టు సడలిందా అనే సందేహం కలగక మానదు. ఇతర రాజకీయ పక్షాలవలే కాకుండా భారతీయ జనతా పార్టీలో నాయకత్వానికి పార్టీ మీద ఉండే సహజమైన పట్టు సడలుతున్నదని తెలంగాణ పరిణామాలు చెబుతున్నాయి.
ఇష్టానుసారంగా నాయకులు పార్టీ క్రమశిక్షణ రేఖ దాటి మాట్లాడటం అనేది కాంగ్రెస్ పార్టీ సొంతం. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం అవసరానికి మించి పొంగిపొరులుతూ ఉంటుంది. ముఖ్యమంత్రినైనా, ప్రధానమంత్రినైనా విమర్శించి పార్టీలో కొనసాగవచ్చు. టికెట్ రానందుకు నిరసనగా గాంధీభవన్ తగలబెట్టడానికి ప్రయత్నించి కూడా పదవులు పొందవచ్చునని గతంలో కాంగ్రెస్ నిరూపించింది.

ఇప్పటివరకు బిజెపి ఇట్లా లేదు ఎంత పెద్ద నాయకులైనా సరే కట్టు తప్పితే సహించేది లేదనే ఆ పార్టీ రుజువు చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? తాజా ఉదంతమే తీసుకుంటే పార్టీ సీనియర్ నాయకుడు, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ మరో సీనియర్ నాయకుడు, పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని కేంద్రంలోని పెద్దలు ఆపలేకపోతున్నారనేది స్పష్టంగా కనిపిస్తున్నది. నూతనంగా రాష్ట్ర అధ్యక్ష పదవి స్వీకరించిన రామచంద్రరావు కూడా ఈ విషయంలో తానేమీ చేయలేక కేంద్ర నాయకత్వానికి విన్నవించుకున్నట్లు తెలిసింది. ఇద్దరు నాయకుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎటువంటివైనా, వాటిలో నిజానిజాలు ఎట్లా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిణామాలు అన్నిటి కారణంగా భారతీయ జనతా పార్టీలో ఊపు తగ్గిపోతున్నదని జనంలో జరుగుతున్న చర్చ. ఇందుకు మరో ఉదాహరణ రాజాసింగ్ రాజీనామా ఉదంతం. ఆయన పార్టీకి చేసిన రాజీనామా అయితే ఆమోదించారు. కానీ ఆయన శాసన సభ్యత్వం సంగతి ఎటూ తేల్చలేదు. ఇప్పటికింకా ఆయన ఇంటి ముందు కమలం గుర్తులు కనిపిస్తూ ఉంటాయి.

అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న క్రమంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో నెలకొన్న పరిస్థితి ఆ పార్టీని బలహీనపరిచే విధంగా ఉందని అనుకోవాలి. ఎనిమిది శాసనసభ స్థానాలు, ఎనిమిది లోకసభ స్థానాలు, రెండు శాసనమండలి స్థానాలు కలిగిన బిజెపి నాయకులు పొరపొచ్చాలు బయటకు రాకుండా చూసుకొని ఐక్యంగా పనిచేసి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి ఉండేవారా లేదా ఇప్పటిదాకా సాధించిన ఫలితాలు ఆయా సమయాలలో నెలకొన్న పరిస్థితుల కారణంగా అంది వచ్చిన తాత్కాలిక విజయాలా అన్న చర్చ జరుగుతున్నది. ఏ రాజకీయ పక్షం అయినా అటువంటి తాత్కాలిక విజయాలను ఓటు బ్యాంకుగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఈ విజయాలను ఆధారం చేసుకుని మరింత బలపడేందుకు, పార్టీ నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆ ప్రయత్నం చేస్తున్నట్టు కనపడదు.

2028 శాసన సభ ఎన్నికల నాటికి పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కూటమిలోని మిత్రపక్షాల సాయంతో లేదా తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీగా ఇంకా ప్రజాభిమానం ఉన్న బిఆర్‌ఎస్‌తోనో కలిసి అధికారంలోకి రావచ్చుననే ఆలోచనలో కేంద్రంలోని బిజెపి పెద్దలు ఉన్నట్టు కనిపిస్తున్నది. ఇక భారతీయ జనతా పార్టీ కోసం ఎన్నికల సంఘం ఓట్లు చోరీ చేస్తున్నదని, అందుకు తగిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, అణుబాంబు లాంటి ఆ ఆధారాల్ని బయట పెట్టినప్పుడు ఆ విస్ఫోటనం ఫలితంగా ఎన్నికల సంఘానికి దేశంలో తలదాచుకునే తావు లేకుండా పోతుందని తాజాగా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు దేశమంతటా చర్చనీయాంశం అయ్యాయి.
ఎన్నికల సంఘం ఎవరి కోసం పనిచేయాలి? అది రాజ్యాంగానికి లోబడి పని చేసే ఒక స్వతంత్ర సంస్థ. ఏ రాజకీయ పక్షానికి అనుకూలంగా గాని, వ్యతిరేకంగా గాని ఉండవలసిన అవసరం లేదు. ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ఉపయోగించుకునే ప్రక్రియను సజావుగా జరిపించి మెజారిటీ ప్రజల అభిమతం ప్రకారం ప్రభుత్వాల ఏర్పాటు కోసం పని చేయాల్సిన యంత్రాంగం ఎన్నికల సంఘం. ఎన్నికలు ఏ పద్ధతిలో జరుగుతాయి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా జరుగుతాయా లేక బ్యాలెట్ పత్రం ఉపయోగించడం ద్వారా జరుగుతాయా అన్న విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి పట్టుదల ఉండాల్సిన అవసరం లేదు, భేషజాలకు పోవాల్సిన అవసరం కూడా లేదు.

ఫలానా ప్రక్రియ ద్వారా ఎన్నికలు జరిగితేనే సక్రమమైన ఫలితం వస్తుందని, తద్వారా మెజారిటీ ప్రజలు కోరుకునే రాజకీయ పక్షం అధికారంలోకి వస్తుందని ప్రజలు నమ్ముతున్నప్పుడు, దానికి వెసులుబాటు కలిగించే విధంగా తన పని పద్ధతిని నిర్వచించుకోవాల్సిన ఎన్నికల సంఘం తాను కూడా ఒక రాజకీయపక్షం వలే వాదించే పరిస్థితి ఏర్పడటం శోచనీయం. జాతీయ రాజకీయ పక్షం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాకుండా పలు ప్రాంతీయ పక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు కూడా ఇటీవల కాలంలో ఎన్నికలు జరుగుతున్న పద్ధతి మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 2023లో మధ్యప్రదేశ్ లో జరిగిన శాసనసభ ఎన్నికలు, 2024లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన శాసనసభ ఎన్నికలు, అట్లాగే అదే ఏడాది జరిగిన లోకసభ ఎన్నికలు, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా కూడా అక్కడ బరిలో నిలిచిన రాజకీయ పక్షాలు పలు ఆధారాలతో ఎన్నిక సక్రమంగా జరగలేదని చెప్పే ప్రయత్నం చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం దానిని తీవ్రంగా పరిగణించవలసింది పోయి తాను కూడా ఒక రాజకీయ పక్షంవలే వాదించిన పద్ధతి చూస్తే ఎవరికైనా సందేహం కలుగుతుంది.

ఓటర్ల జాబితాల విషయంలో కూడా పలు అనుమానాలు వ్యక్తం కావడం, త్వరలో బీహార్‌లో జరగనున్న ఎన్నికల సందర్భంగా కొన్ని లక్షల ఓట్లు తొలగించారన్న ఆరోపణలు ఎన్నికల సంఘం విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేసులో ఉన్నాడని ప్రచారంలో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్ తన పేరు కూడా ముసాయిదా ఓటర్ జాబితాలో లేదని ఫిర్యాదు చేసే పరిస్థితి. మళ్లీ మళ్లీ చెప్పాల్సిందేమిటంటే ఎన్నికల సంఘం అనేది ప్రజలు తమను పరిపాలించవలసిన రాజకీయ పక్షాన్ని కేంద్రంలో, రాష్ట్రాలలో ఎంపిక చేసుకునేందుకు జరిగే ఒక కార్యక్రమానికి సంధానకర్త మాత్రమే. సవాళ్లు ప్రతి సవాళ్లలోకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారానే ఎన్నికలు జరగాలని పట్టుదల కేంద్ర ఎన్నికల సంఘానికి ఉండాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజకీయ పక్షాలు కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌ల మీద వస్తున్న సందేహాల విషయంలో అందరినీ మెప్పించే రీతిలో వ్యవహరించడం లేదు. 2024లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి దాకా అధికారంలో ఉండిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల శాసనసభలో 11 స్థానాలకు పడిపోవడం, రెండు మూడు నియోజకవర్గాల నుండి స్పష్టంగా ఆధారాలతో కూడిన ఫిర్యాదుల్ని కోర్టుల దాకా తీసుకుపోయినా ఫలితం లేకపోయింది.

ఇదంతా కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షం కోసం ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా అవకతవకలకు పాల్పడుతున్నదన్న ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది. ఈ ఆరోపణలు రాజకీయ పక్షాలు చేస్తున్నాయి గాని ప్రజలు కాదు అని అధికారంలో ఉన్నవారు, ఎన్నికల సంఘం కూడా మాట్లాడవచ్చు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఎన్నికల సరళి పట్ల సందేహాలు, అభ్యంతరాలు ఉన్న విషయం మాత్రం స్పష్టం. అటువంటి సమయంలో ఈ సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానిది. కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షాలు కూడా ఇవిఎంల ద్వారానే ఎన్నికలు జరపాలని పట్టుదలకు పోనవసరం లేదు. ఇప్పటికింకా ప్రపంచంలోని పలు దేశాల్లో పేపర్ బ్యాలెట్‌ని ఉపయోగిస్తున్న విషయం మరువకూడదు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, అమెరికా దేశాల్లో ఇవిఎంలను నిషేధించిన విషయం తెలిసిందే. పలు విషయాల్లో మనం ఈ దేశాలతో పోల్చుకున్నప్పుడు ఎన్నికలు పేపర్ బాలట్ ద్వారా జరిపి విధానాన్ని ఎందుకు అనుసరించకూడదు? దొంగ ఓట్లు, రిగ్గింగ్, పోలింగ్ బూత్‌ల ఆక్రమణ వంటి అక్రమాలు అంతరించాయి అనుకుంటే అవేవీ అవసరం లేకుండా ఇవిఎంల ద్వారా మాయ చేయ్యవచ్చునన్న భయాందోళనలను తొలగించవలసిన బాధ్యత ఎవరిది?

amar devulapalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News