బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ నయవంచన పెంచిన 42శాతంలో
10శాతం ముస్లింలకే కేంద్రంపై బట్టకాల్చివేయడం
సరికాదు : కేంద్రమంత్రి కిషన్రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్
అమలు చేయండి సిఎంకు ఎంపి ఈటల డిమాండ్
42శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు జరపాలి : ఎంపి
ఆర్. కృష్ణయ్య బిసి హక్కుల కోసం బిజెపి ఓబిసి మోర్చా ధర్నా
మన తెలంగాణ/విద్యానగర్: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే బిసిలకు ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్లను రెండేళ్లు గడిచినా ఎందుకు అమలు చేయడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బలహీన వర్గాల రిజర్వేషన్ సమస్యను పరిష్కరించకుండా చేతకానితనంతో కేంద్ర ప్రభుత్వంపై బట్టకాల్చి వేసే ప్రయత్నం చే యడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి, బిసిల హక్కులు కాపాడాలని కోరుతూ బిజెపి ఒబిసి మోర్చా ఆద్వర్యంలో శనివారం ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద భారీ ధర్నా జరిగింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ ధర్నాలో కిషన్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ చెబుతున్న 42శాతం రిజర్వేషన్లు బిసిలకు మే లు చేసేవి కావని, మతపరంగా, ఓట్లపరంగా రాజకీయా ల కోసం ముస్లింలకు మేలు చేస్తాయని చెప్పారు. స్థానిక సంస్థలలో 34శాతం కోటా బిసిలకు ఇచ్చిన రాష్ట్రం ఇద ని, వీటిని బిఆర్ఎస్ పాలకులు 23 శాతానికి కుదించార ని గుర్తు చేశారు. బిఆర్ఎస్ హయాంలో 12 శాతం మతపరమైన రిజర్వేషన్లు తేవడానికి అనేక ప్రయత్నాలు జరిగాయని, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసే నాటి సిఎం కెసిఆర్ శాసనసభలోనే ముస్లిం కోటాను ప్రకటించారని గుర్తు చేశారు.
హైదరాబాద్లోని 150 డివిజన్లలో 33 శాతం డివిజన్లను గతంలో బిసిలకు కేటాయించే పరిస్థితి ఉండేదనీ, కానీ కెసిఆర్ ఆ రిజర్వేషన్లను తగ్గించారని ఆ రోపించారు. అసలు బిసిల రిజర్వేషన్లు తగ్గాయా, లేక పెరిగాయా అనేది సిఎం రేవంత్ చెప్పాలన్నారు. ప్రస్తు తం ప్రభుత్వం చెబుతున్న 42 శాతం కోటాలో 10 శా తం ముస్లింలను తీసివేస్తే, బిసిలకు మిగిలేది 32 శాతమే కదా అన్న సందేహాన్ని వెలిబుచ్చారు. మీరు 42 శాతం రిజర్వేషన్ అని ఆడంబరంగా చెబుతున్నారు సరే, కానీ గతంలో బిసిలకు ఉన్న రిజర్వేషన్ల కంటే మీరు 2 శాతం తక్కువే ఇస్తున్నారనే వాస్తవాన్ని గుర్తించాలన్నారు. కాం గ్రెస్ చేసిన చట్టం బిసిలకు మేలు చేసేది కాకుండా నష్టం చేసేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల జ నాభా పెరిగిందని సర్వేలో చూపెట్టిన కాంగ్రెస్, బిసిల జ నాభా మాత్రం తగ్గించి చూపించారన్న కిషన్ రెడ్డి అసలు సర్వే సైతం సరిగ్గా జరగలేదని అన్నారు. కాంగ్రెస్కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42కు 42 శాతం రిజర్వేషన్లు బిసిలకే ఇవ్వాలని, ఇందులో నుంచి ముస్లింకు ఇస్తామంటే తాము ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు.
బిసిల కు న్యాయం జరగాలంటే కచ్చితంగా 42 శాతం వాటా వారికే ఇవ్వాలని, అలా కాకుండా దొడ్డిదారిలో మోసం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసే ప్రయత్నం సరికాదని, మీరు బిసిలకు ఇస్తానన్న 42 శాతం రిజర్వేషన్లు ముందు ఇవ్వాలని డిమాండ్ చేశా రు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వరుసగా11 ఏండ్లపాటు ఒక బిసిని ప్రధానిని చేసిన ఘనత బిజెపిదని, కేంద్రంలో 28మంది బిసిలను మంత్రులను చేశామన్న ఆయన.. కాంగ్రెస్ ఒక్కసారైనా బిసికి ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చిందా అని ప్రశ్నించారు. అనంతరం ఎంపి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముం దు కామారెడ్డి వేదికగా చేసిన బిసి డిక్లరేషన్ ఎందుకు అమలు చేయడం లేదన్నారు. బిఆర్ఎస్ పాలనలో బిసి రిజర్వేషన్లు 23 శాతానికి పడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ నిమ్మకునీరెత్తినట్లు చూసింది తప్ప, రిజర్వేషన్ల కోసం పోరాటం చేయలేదన్నారు. బిసిల కళ్లలో కారం కొట్టేందుకు రేవంత్ రెడ్డి అబద్ధాలతో కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 42 శాతం బిసి రిజర్వేషన్ల అంశంలో మొసలికన్నీళ్లు కారుస్తున్నారని, ఇప్పటికే సిఎం తన ఓటమిని అంగీకరించారని వ్యాఖ్యానించారు.
రేవంత్ సర్కారును నిలదీయగల సత్తా బిజెపికి మాత్రమే ఉందన్నారు. 2023 ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి రైతు, యువ, మహిళా డిక్లరేషన్ల పేరిట 6 గ్యారంటీలు, 66 హామీలు ఇచ్చారని, ఆ సమయంలోనే బిజెపి తరఫున తాను ప్రశ్నించానని తెలిపారు. మాట ఇస్తే తప్పం, మడమ తిప్పం అనేది నిజంగా కాంగ్రెస్ సిద్ధాంతమే అయితే ఆరు నెలల్లో 42 శాతం బిసి కోటాతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఈటల సవాల్ విసిరారు. రాజ్యసభ సభ్యుడు అర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బిసిలు మళ్ళీ మోసపోయామనే భావనలో ఉన్నారని వ్యాఖ్యానించారు. కనీసం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నారని, బిఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లతో వెంటనే స్థానిక ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. బిసి యువతకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు లేవని, కల్లుగీత, మత్స్యకార, రజక ఫెడరేషన్లకు నిధులు ఇవ్వకపోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. పలువురు బిజెపి ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, అదిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ధర్నాలో పాల్గొన్నారు.