శ్రీనగర్ విమానాశ్రయంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పరిమితి మించి లగేజ్ తీసుకుపోతున్న ఓ ఆర్మీ అధికారిని స్పైస్‌జెట్ (Spicejet) విమాన సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కోపంతో ఊగిపోయిన సదరు ఆర్మీ అధికారి విమాన సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జూలై 26న జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళ్లే స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణించేందుకు పరిమిత లగేజీ బరువు ఏడు కిలోలు కాగా.. ఆ అధికారి 16 కిలోల లగేజీ తీసుకువచ్చారు. దీనికి అదనపు ఛార్జీ చెల్లించాలని సిబ్బంది అడిగారు. దానికి నిరాకరించిన ఆర్మీ అధికారి భద్రత ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి.. బోర్డింగ్ ప్రక్రియ పూర్తి చేయకుండానే ఏరో బ్రిడ్జ్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఆ అధికారిని గేట్ దగ్గరకు పంపించారు.
దీంతో కోపంతో అక్కడున్న క్యూ స్టాండ్‌తో ఆ అధికారి స్పైస్‌జెట్ (Spicejet) గ్రౌండ్ సిబ్బందిపై దాడి చేశాడు. ఒక ఉద్యోగి స్పృహ కోల్పోయినప్పటికీ.. కొట్టడం మాత్రం ఆపలేదు. అడ్డుకునేందుకు వచ్చిన మరో ముగ్గురు సిబ్బందిపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో నలుగురుకి సిబ్బందికి గాయాలు కాగా.. ఒక వ్యక్తి వెన్నుమూక విరిగినట్టు స్పైస్‌జెట్ పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ అధికారిపై హత్యాయత్నంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఆర్మీ.. పోలీసులు విచారణలో సహకరిస్తామని తెలిపింది.