కాళేశ్వరం ప్రాజెక్టు తప్పిదాలకు కారకులు వీరే
జస్టిస్ ఘోష్ కమిషన్ సిఫారసు
కమిషన్ నివేదికపై అధ్యయన కమిటీ ప్రభుత్వానికి వెల్లడి
అధ్యయన కమిటీతో సిఎస్ సమావేశం
నేడు కెబినెట్‌లో కమిషన్ సిఫారసుపై చర్చ
కెబినెట్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనున్న మంత్రి ఉత్తమ్
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పిదాలకు గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కారణమని సుప్రీం కోర్టు మాజీన్యాయమూర్తి, జస్టీస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిషన్ తేల్చింది. వీరిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు చేయాలని కమిషన్ సిఫారసు చేసినట్టు కమిషన్ నివేదికపై అధ్యయనం చేసిన కమిటి ప్రభుత్వానికి వెల్లడించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ అందజేసిన నివేదికపై ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ ఆదివారం సాయంత్రం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో సమావేశమైంది.
జస్టీస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో వెల్లడించిన సారాంశాన్ని అధ్యయనం చేసిన కమిటీ సభ్యులు నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, న్యాయశాఖ కార్యదర్శి ఆర్ తిరుపతిరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు వివరించారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలతోనే ప్రాజెక్టు నిర్మాణం జరిగినట్టు కమిషన్ పేర్కొన్నట్టు అధ్యయన కమిటి వెల్లడించింది. నాణ్యతా లోపాలను పట్టించుకోకుండా, నీటిపారుదలశాఖ అధికారులు పంపించిన అంచనాలను ఆర్థికశాఖ గుడ్డిగా ఆమోదించిందని, ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ అధికారులపై వత్తిడి తెచ్చినట్టు కమిషన్ పేర్కొన్నట్టు అధ్యయన కమిటి వివరించినట్టు తెలిసింది. ఆర్థికశాఖ తన కనీస బాధ్యతలను కూడా నెరవేర్చలేదని కమిషన్ ఎత్తి చూపినట్టు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పిదాలకు పై ముగ్గురే ప్రధాన కారకులు అని కమిషన్ పేర్కొనడంతో పాటు వారి ప్రమేయానికి సంబంధించిన పత్రాలు, ఇంజనీరింగ్ అధికారులు కమిషన్‌కు ఇచ్చిన వాంగ్మూలాలను నివేదికలో జత పరచినట్టు అధ్యయన కమిటి వెల్లడించినట్టు తెలిసింది.
నేడు కెబినెట్ ముందుకు కమిషన్ నివేదిక
కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి అందజేసిన నివేదికపై చర్చించడానికి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మంత్రిమండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నది. కమిషన్ ఇచ్చిన నివేదిక, దీనిపై అధ్యయనం చేసిన కమిటి వెల్లడించిన జిస్ట్‌పై నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రి మండలికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ తప్పిదాలకు బాధ్యులుగా కమిషన్ తేల్చిన బాధ్యులపై (కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్) క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యల సిఫారసు పై కూడా మంత్రి మండలి చర్చించి దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలపై కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు అధికార పార్టీ వర్గాల సమాచారం.
అసెంబ్లీ ప్రత్యేక భేటీ కూడా
కాళేశ్వరం ప్రాజెక్టు పై ఏర్పాటు చేసిన జస్టీస్ పిసి ఘోష్ ఇచ్చిన నివేదిక, చేసిన సూచనలు, సిఫారసులను రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయడానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఈ అంశంపై కూడా మంత్రిమండలిలో చర్చించి అసెంబ్లీని ఎప్పుడు సమావేశ పరిచే తేదీలను కూడా ఖరారు చేయనున్నట్టు ఈ వర్గాల సమాచారం.