Monday, August 4, 2025

నిరాశే మిగిల్చాడు.. కరుణ్ నాయర్ కెరీర్ ముగిసినట్టేనా?

- Advertisement -
- Advertisement -

తేలిపోయిన కరుణ్ నాయర్
ఇక కెరీర్ ముగిసినట్టేనా?

లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ టెస్టు సిరీస్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు కరుణ్ నాయర్ (Karun Nair career) పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరిచాడు. సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు రిటైర్మెంట్ ప్రకటించడంతో బ్యాటింగ్‌ను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కరుణ్ నాయర్‌ను ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చేశారు. పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత జట్టుకు నాయర్ పెద్ద దిక్కుగా ఉంటాడని, మెరుగైన బ్యాటింగ్‌తో అలరిస్తాడని టీమ్ యాజమాన్యం భావించింది. కానీ నాయర్ మాత్రం తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమయ్యాడు. నాలుగు టెస్టులు ఆడిన కరుణ్ కేవలం ఒక్కసారి మాత్రం అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మిగతా అన్ని ఇన్నింగ్స్‌లలోనూ నిరాశ పరిచాడు. సహచర ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రాహుల్, శుభ్‌మన్, రిషబ్, జడేజా, వాషింగ్టన్ తదితరులు మెరుగైన ప్రదర్శన చేసిన సిరీస్‌లో ఎంతో అనుభవజ్ఞుడైన నాయర్ మాత్రం పూర్తిగా నిరాశ పరిచాడు.

భారీ ఆశలు పెట్టుకున్న అతను పేలవమైన బ్యాటింగ్‌తో తేలిపోయాడు. నాయర్ వైఫల్యం టీమిండియా బ్యాటింగ్‌పై బాగానే ప్రభావం చూపిందని చెప్పాలి. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి ఔరా అనిపించిన కరుణ్ నాయర్ జాతీయ జట్టు తరఫున మాత్రం ఆ జోరును కొనసాగించలేక పోయాడు. వరుస వైఫల్యాలు చవిచూస్తున్నా అతనిపై కెప్టెన్, ప్రధాన కోచ్‌లు నమ్మకాన్ని ఉంచారు. కానీ నాయర్ మాత్రం వారి అంచనాలను తలకిందులు చేస్తూ పూర్తిగా నిరాశ పరిచాడు. గతంలో ఇంగ్లండ్‌పైన ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టిన నాయర్ ఈ సిరీస్‌లో మాత్రం ఒక్కసారి కూడా మూడెంకెల స్కోరును అందుకోలేక పోయాడు. చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మాత్రమే నాయర్ (Karun Nair career) కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. ఈసారి (53) పరుగులు సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ విఫలమయ్యాడు.

జట్టును ఆదుకుంటాడని భావించగా 17 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ సిరీస్‌లో నాయర్ 8 ఇన్నింగ్స్‌లలో 25.62 సగటుతో కేవలం 205 పరుగులు మాత్రమే చేశాడు. గిల్, యశస్వి, సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ వంటి అనుభవం లేని బ్యాటర్లు కూడా నాయర్ కంటే ఎక్కువ పరుగులు సాధించడం గమనార్హం. దీన్ని బట్టి నాయర్ ప్రదర్శన ఎంత పేలవంగా సాగిందో ఊహించుకోవచ్చు. ఇక ఇంగ్లండ్ సిరీస్‌లో ఘోర వైఫల్యం చవిచూసిన నాయర్‌కు  (Karun Nair career)సెలెక్టర్లు మరోసారి అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నాలుగు టెస్టుల్లో ఛాన్స్ ఇచ్చినా నాయర్ మాత్రం దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో అతనికి రానున్న సిరీస్‌లలో టీమిండియా చోటు దక్కడం దాదాపు అసాధ్యమేనని చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News