Monday, August 4, 2025

దక్షిణాది భారతీయ భాషల సాహితీ సంరంభం-బుక్ బ్రహ్మ

- Advertisement -
- Advertisement -

కథా, నాటకం, నవల ఈ మూడింటిలో గొప్ప సృజన కన్నడ నేల మీద జరిగింది. అనువాదాలతో భారతీయ భాషల సాహిత్యంలో తన ముద్ర వేసింది. ఈ వారసత్వాన్ని చాటేందు కు కన్నడ సాహిత్యాన్ని, సంస్కృతిని, భాషను కలిపేందుకు ఏర్పడిన వేదికే బుక్ బ్రహ్మ. దాదాపు ఆరువేల మంది రచయితల ప్రొఫైల్స్ తయారు చేసి తన వెబ్‌సైట్‌లో పెట్టింది. అలా కన్నడ సాహిత్యాన్ని ప్రచారం చేసేందుకు మొదలైన బుక్ బ్రహ్మ అనే సంస్థ నేడు మొత్తం దక్షిణాది భారతీయ భాషలను ఉత్సవం చేస్తోంది.

గత ఏడాది ప్రారంభమైన బుక్ బ్రహ్మ సాహి తీ ఉత్సవం ఈ ఏడాది రెండవ ఎడిషన్‌ని జరుపుకుంటోంది. నాలుగు ప్రధాన దక్షిణాది భాషలతో పాటూ లంబాణీ, అరబిక్, దక్కనీ భాషల మీద సెషన్స్ ఉన్నాయి. భారదేశంలో చాలా సాహిత్య ఉత్సవాలు జరుగుతున్నా అవన్నీ ఆంగ్ల సాహిత్య ఉత్సవాలు. (English Literary Festivals) భారతీయ భాషల రచయితల భాగస్వామ్యం అందులో ఉన్నా వారి రచనలు ఆంగ్లం లో అనువాదం అయినందు వల్లే. వాటితో పోల్చినప్పుడు బుక్ బ్రహ్మ భిన్నమైనది. ఇది అచ్చంగా భారతీయ భాషల సాహిత్యం గురించి, సంస్కృతీ గురించి, సాహిత్యంలో వస్తున్న, వచ్చిన మార్పుల గురించి చర్చిస్తోంది.

దక్షిణాది సాహిత్యాన్ని దగ్గర చేసేందుకు వేదికగా, వారధిగా నిలుస్తోంది. సాహిత్య ఉత్సవాల్లో సహజంగా కనబడే అంశం ఏంటంటే దాదాపు అదే వక్తలు రిపీట్ అవ్వడం. కొందరు కొత్తవారు వారికి తోడవ్వడం. అయితే బుక్ బ్రహ్మ ప్రతి భాష ప్రాతినిధ్యానికి ఒక క్యూరేషన్ కమిటీని ఎంచుకున్నది. ఆ కమిటీ గత ఎడిషన్‌లో వచ్చిన వాళ్ళలో దాదాపు రిపీట్ అవ్వకుండా చూసుకుంటుంది. ఇది కొత్త గొంతుకలకు, రచయితలకు మంచి పరిణామం. తమ భాష పరిధిని దాటి తమ సాహిత్యాన్ని విస్త్తరించు కోవాలనుకునే రచయితలకు, ప్రచురణకర్తలకు బుక్ బ్రహ్మ వేదికగా నిలుస్తోంది.

గత ఏడాది ఎడిషన్‌కి, ఈ ఏడాది ఎడిషన్‌కి చూసుకుంటే తెలుగు నుండి హాజరయ్యే వాళ్ళలో తొంబై శాతం మంది కొత్తవారే. ఇతర భాషల్లో నూ ఇదే కనిపిస్తోంది. సెషన్స్ కూడా ఆయా భాషలకు తగినట్టుగా డిజైన్ చేశారు. తెలుగు సెషన్స్‌లో యువ రచయితల కోసం ప్రత్యేక సెష న్, ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యం గురించి ఒక సెషన్, తెలుగులో తెలంగాణ సాహిత్య ప్రత్యేకత, సాహిత్యం నుండి సినిమా రచన వైపు గురించిన సెషన్స్ ఉన్నవి. వీటిని మిగతా వాటితో వేరు చేసి చూసినప్పుడు తెలుగు నేలలో తెలుగు కేంద్రంగా ఒక సాహిత్య ఉత్సవం జరిగితే ఏ ఏ అంశాల మీద సెషన్స్ ఉంటాయో అవి బుక్ బ్రహ్మలో ఉన్నాయి. ఒక్క తెలుగుకే కాదు.. తమిళ, మలయాళ, కన్నడ భాషల సెషన్స్ కూడా ఇంతే వైవిధ్యంగా ఉన్నాయి.

ఇవేగాక ఈ నాలుగు భాషల సాహితీ వేత్తలను కలుపుతూ ఉండే సెషన్స్ వేరు. తల్లావజ్ఝల పతంజలి శాస్త్రీ, మధురాంతకం నరేంద్ర, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, మృణాలిని లాంటి సీనియర్లే గాక చైతన్య పింగళి, ఎండపల్లి భారతీ, గౌస్, శీలం సురేంద్ర, వి.మల్లిఖార్జున్, ప్రసాద్ సూరి లాంటి కొత్త గొంతుకలు ఈ బుక్ బ్రహ్మ వేదిక మీద తెలుగు సాహిత్యం గురించి మాట్లాడనున్నారు. కొత్త రచయితలూ, అనువాదకులూ ప్రచురణకర్తలు నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు ఈ సాహిత్య ఉత్సవం జరిగే మూడు రోజుల పాటు వివిధ సెషన్స్‌లలో ఉన్నాయి. ఇప్పటికీ ఆయా రంగాల్లో ఉన్నవాళ్ళు కొత్తగా వస్తున్న మార్పుల ను అందిపుచ్చుకునే అంశాల పట్ల సెషన్స్ ఉన్నాయి.

ఆగస్టు 8, 9, 10వ తేదీల్లో బెంగళూరు సెయింట్ జాన్స్ ఆడిటోరియంలో ఈ సాహిత్య ఉత్సవం జరగనుంది. ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు. 8 వేదికల మీద ఏక కాలంలో సెషన్స్ ఉం టాయి. ఎవరు ఎందులోనైనా పాల్గొని వినొచ్చు. రచయితలతో ముఖాముఖి కోసం ఒక ప్రత్యేక వేదికను కేటాయించారు. నచ్చిన రచయిత మాట్లడుతున్నప్పుడు మీరూ ఆ చర్చలో పాల్గొనవచ్చు. పుస్తకావిష్కరణలకు ఒక వేదిక, ప్రచురణకర్తలకు ఒక వేదిక ప్రత్యేకంగా కేటాయించారు. సాహిత్యం ఉత్సవం అంటే సాహిత్య అమ్మకాలూ కూడా ఉండాలి గనుక ప్రతి భాషకు ఒక స్టాల్‌ని కేటాయించారు.

తెలుగు పుస్తక స్టాల్‌ని ‘ఛాయ పబ్లికేషన్స్’ నిర్వహిస్తోంది. దాదాపు లక్ష టైటిల్స్ పుస్తక ప్రదర్శనలో అమ్మకానికి ఉంటాయని అంటున్నారు నిర్వాహకులు. ఈ ఏడాది అంతర్జాతీయ బుకర్ బహుమతి పొందిన కన్నడ కథల సంపుటి అనువాదం ‘హార్ట్ లాంప్’ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఈ కథల రచయిత్రి బాను ముస్తాక్, అనువాదకురాలు దీప్తి బస్తీ కూడా మూడు రోజుల పాటు వివిధ సెషన్స్‌లో పాల్గొంటారు. వారితో ముఖాముఖి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన పతంజలి శాస్త్రి రామేశ్వరం కాకులు కథల సంపుటిలోని రామేశ్వరం కాకులు కథను నాటకంగా ప్రదర్శించబోతున్నారు.

  • అరుణాంక్ లత
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News