మీ నేపథ్యం గురించి క్లుప్తంగా చెప్తారా?
నేను కటక్ ఒడిస్సాలో పుట్టాను. హైదరాబాద్‌లో మా నాన్నగారు సెటిల్ అయ్యారు. అందుకే నా విద్యాబ్యాసం అంతా హైదరాబాద్ లోనే జరిగింది. ఎప్పటి నుండి రాస్తున్నారు? మీరు ఎంచుకున్న ప్రక్రియలు (కథ, కవిత్వం, వ్యాసాలు) మీ ప్రచురణల గురించి చెప్పండి? మావారు యుకో బ్యాంకు ఉద్యోగి. మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా ఉన్నాను. అక్కడకి తెలుగు మాస, వార పత్రికలు తెప్పించుకుని బాగా చదివేదాన్ని. రాయడం మొదలు పెట్టాక ముందుగా వ్యాసాలు రాసాను. ఆ తరువాత తిరిగి వచ్చి, 2001లో హైదరాబాద్‌లో స్థిరపడ్డాక కథలు, కవిత్వం రాయడం మొదలు పెట్టా ను. అవి అనేక మాసపత్రికల్లో ప్రచురణ అయ్యాయి. ఆ రచనల కు గానూ బహుమతులు కూడా అందుకున్నాను.
నా మొట్టమొదటి కవిత్వ సంపుటి ‘పడవలో చిన్ని దీపం’. నా మొట్టమొదటి కథల సంపుటి ‘రెండూ చందమామలు’. ఆ తరువాత లోపలి స్వరం, ఎర్రమట్టి గాజులు, (Inner voice, red clay glasses) కవిత్వం, రెండు దీర్ఘ కావ్యాలు మూడవ మనిషి, పృథ వచ్చాయి. ఇప్పుడు ‘రవిక’ కవిత్వం సంపుటి వచ్చింది. నా కథల్లో, కవిత్వంలో, వ్యాసాల్లో నేను ఎక్కువగా స్త్రీల మీద జరిగే దాడుల ని, సమాజంలో జరిగే అన్యాయాలని చెప్పడానికే ఇష్టపడ్డాను. ఇటు ప్రకృతి ప్రేమ కవితలు, కథలు కూడా రాసాను. మీ ప్రారంభ రచన నుంచి ఇప్పటివరకు మీ రచనల్లో మీ దృక్పథం, వ్యక్తీకరణలో వచ్చిన మార్పుల గురించి మీరు ఏమనుకుంటున్నారు?
నేను ఒక వాదానికి కట్టుబడలేదు కానీ, నా మొదటి కవి త్వం సంపుటి నుంచి ఎప్పుడూ స్త్రీల సమస్యకి నా గొంతు నా ఆందోళన వినిపిస్తూనే ఉన్నాను. నా ప్రారంభ రచన నుంచి ఇప్పటిదాకా స్త్రీల పక్షపాతిగానే ఉన్నాను. ఇప్పటికీ పరిష్కారం లేని కొత్త కొత్త సమస్యలు స్త్రీలని వెన్నాడుతుంటే బాధపడ్డాను. క్రమంగా కవిత్వ వ్యక్తికరణలో నన్ను నేను మెరుగుపరుచుకున్నాను అనుకుంటాను.మీరు రాసిన దీర్ఘ కావ్యం మూడో మనిషి చాలా ప్రత్యేక మైన కవిత్వం. తెలుగులో ‘ట్రాన్స్‌జెండర్’ మీద వచ్చిన మొదటి దీర్ఘకావ్యం మీదే. ఎవరి అనుభవాల్ని, అస్తిత్వ వేదనలను వాళ్లే రాయాలి అనే దృష్టి కోణం అస్తిత్వ ఉద్యమాల నుంచి ప్రముఖంగా ముందుకు వచ్చింది. ఇలాంటి వాతావర ణం మధ్య మీరు ‘ట్రాన్స్‌జెండర్’ సమస్యలపైన కావ్యాన్ని రాశారు? ఇలాంటి ఆలోచనలకి, రచనకి ప్రేరణ ఏమిటి? దాన్ని ఎలా స్వీకరించింది తెలుగు సాహిత్యం?
ఎవరి అనుభవాలని ఎవరి అస్థిత్వాలని, ఉద్యమాలని వాళ్ళు రాస్తే అనుభవంతో పాటు వాళ్ళ గాయాన్ని సులభంగా చెప్పగలరు. కానీ ఎలాంటి అనుభవం లేని జోనర్‌లోకి అడుగు పెట్టి మూడవ మనిషి ట్రాన్స్‌జండర్ గురించి రాయాలని అనుకున్నప్పుడు నా ముందు పెద్ద ఛాలెంజ్ ఎదురైంది. అది రాయడానికి ప్రేరణ నేను మధ్యప్రదేశ్‌లో ఉన్నప్పుడు కొడుకు పుట్టగా నే వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని, వాళ్ళు రైళ్లల్లో అడుక్కునేటప్పుడు వాళ్ళమీద చేసే వ్యక్తిగత దాడి, వాళ్లతో ప్రవర్తించే తీరు నన్ను కలిచివేసింది. ఆ సంఘర్షణ రాయాలని బలంగా అనుకున్నాను. అది రాయడానికి నన్ను నేను పరకాయ ప్రవేశం చేసుకుంటే గానీ బలంగా రాయలేక పోయాను.
ఏడాదిన్నర పాటు దాని గురించే ఆలోచించేదాన్ని. ట్రాన్స్‌జెండర్ రేవతిని కలిసాను. ఆమె రాసిన పుస్తకాన్ని పి.సత్యవతి గారు తెలుగులోకి అనువాదం చేశారు. ఆ పుస్తకంచదివాను. నేను చూసిన అనుభవాలను జతచేసి రాసుకున్నాను.ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తి, తన లైంగికత గురించి సమాజం అడిగే ప్రశ్నలకు నేను ఎలా ఉంటే అలానే అంగీకరించండి, ప్రశ్నించకండి అని వాళ్ళు అన్నప్పుడు దానిని సమాజం గౌరవించాలని నేను భావిస్తాను. అలాంటి పరిణితి మనుషులలో రావాలని ఇప్పటికీ ఎదురుచూస్తా ను. 2015లో వచ్చిన ఈ దీర్ఘ కావ్యం గురించి ఇప్పుడు కూడా మాట్లాడుతునప్పుడు నా కష్టం వృథా కాలేదు అనిపిస్తుం ది. తెలుగు సాహిత్యం ఆ కావ్యంతోనే నన్ను గుర్తించింది అనుకుంటాను.
మీరు పౌరాణిక పాత్ర కుంతి గురించి ‘పృథ’లో రాసారు. దాన్ని ఏకాంకిక ప్రదర్శ నగా మార్చి, మీరే స్వయంగా ప్రదర్శించారు. ప్రశంసలు అందుకున్నారు? ఆ అనుభవం గురించి చెప్తారా?
పౌరాణిక పాత్ర కుంతి గురించి ‘పర్వ’ తెలుగు అనువాదం ఏడేళ్ల క్రితం చదివాను. అందులో ‘కుంతి’ నన్ను వెంటాడింది అది పౌరాణిక పాత్ర అయినా నేటి సమాజంలో స్త్రీకి, కుంతికి పెద్దగా తేడా కనిపించలేదు. దాన్ని దీర్ఘ కావ్యంగా రాసినా.. ఇంకా ఎదో చెప్పాలని అనిపించి ఇంకా కుంతి ఆవేదన నలుగురిలోకి వెళ్లాలి అనే ఆలోచన కలిగి ‘కుంతి మోనోలాగ్’ చేశాను. నాకు స్టేజ్ అనుభవం లేకపోయినా, కుంతి పాత్రను చేశాను. స్టేజ్ మీద వెనక కొన్ని సీనరీలు, నేపథ్యం సంగీతం ఉంటే బాగుండేది అని కొందరు మిత్రులు అన్నారు. అయినా చాలా ప్రశంసలు అందుకున్నాను.
తెలుగులో స్త్రీవాద సాహిత్యం ప్రారంభమైన నాటికి, నేటికీ సమాజంలో అనేక మార్పులు జరిగాయి. కొత్త సవాళ్లు ముందుకు వచ్చాయి? ఈ స్థితి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఎలాంటి రచనల అవసరం ఉందని భావిస్తున్నారు?
అప్పటికంటే ఇప్పుడే స్త్రీలు ఇంకా వ్యక్తిగత దాడులని మ రింత ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. వ్యక్తుల మధ్య శారీరక, మానసిక, లింగ, జాతి, లైంగిక అభిరుచులు, సామాజిక హోదా వంటి అనేక విభిన్నతలు ఇంకా ఈ విషయాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా స్త్రీ స్వేచ్ఛని పూర్తిగా హరించి వేసింది. వేసుకున్న దుస్తుల దగ్గర నుంచి, వ్యక్తిగత విషయాలు, కుటుంబ వ్యవస్థలో కూడా దూరిపోయి, ఇష్టం వచ్చిన ట్లు తనకు తోచినది తాను స్రీలకు వ్యతిరేకంగా రాయడం మొదలు పెట్టింది. వీటి మీద రచనలు రావాలి, కథలు, కవిత్వం ఈ విషయాలపైన బలమైన వ్యక్తీకరణతో రావాలి. చర్చలు జరగాలి అప్పుడే ఈ స్థితిని స్త్రీలు ఎదుర్కోగలం అనుకుంటాను.
- ప్రముఖ కవి రేణుకా అయోలాతో
విమల సంభాషణ