Tuesday, August 5, 2025

అసెంబ్లీలో చర్చించాకే కాళేశ్వరంపై కార్యాచరణ

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం కమిషన్ నివేదికను తెలంగాణ మంత్రి మండలి ఆమోదించింది
రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా కమిషన్ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చిస్తాం
సభ్యులకు నివేదిక కాపీని అందజేస్తాం
సభ్యుల అభిప్రాయాలు తీసుకుంటాం
అసెంబ్లీలో అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తాం
ఇది ఓ రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వం ఇచ్చిన నివేదిక కాదు..నిపుణుల కమిటీ ఇచ్చింది
రీడిజైనింగ్ పేరుతో ఇష్టానుసారం కెసిఆర్ డిజైన్లు మార్చారు
విలేకరుల సమావేశంలో సిఎం రేవంత్‌రెడ్డి
అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రమేయం, సూచనలే అక్రమాలకు కారణం
కీలకమైన ఆర్థిక నిర్ణయాలు నాకు తెలియవని ఈటల చెప్పడం తప్పు
డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
మేడిగడ్డ లోపాలకు మాజీ సిఎం కెసిఆర్ కారణం
కాళేశ్వరం కోసం తెలంగాణ ప్రజలను కెసిఆర్ తాకట్టు పెట్టారు
అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం కూలింది
ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికను తెలంగాణ మంత్రి మండలి ఆమోదించిందని, త్వరలోనే దీనిపై అసెంబ్లీలో చర్చిస్తామని, అంతకుముందే సభ్యులకు నివేదిక కాపీని అందజేస్తామని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. సభ్యుల అభిప్రాయాలు తీసుకుంటామని, వారి సూచనల ప్రకారమే ముందుకెళతాని సిఎం పేర్కొన్నారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన డిప్యూటీ సిఎం భటి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వాకిటిశ్రీహరిలతో కలిసి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ తప్పులు ఒప్పుకోకుండా మొండివాదన చేసేవారికి ప్రజలే మళ్లీ తగిన విధంగా బుద్ధి చెబుతారని సిఎం రేవంత్ అన్నారు.

పిసి ఘోష్‌ను కాకుండా ఎమ్మెల్సీ కవిత ఘోష్‌తో కమిటీ వేసి ఉంటే బాగుండేదని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా కమిషన్ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చిస్తామని అసెంబ్లీలో అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో అందరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చని ఆయన అన్నారు. ఇది ఓ రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వం ఇచ్చిన నివేదిక కాదని, నిపుణుల కమిటీ ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనిపై ఎవరు ఏ రకంగా మాట్లాడుతారన్నది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

ప్రణాళిక, నిర్మాణ, నిర్వహణ లోపాలపై అధికారుల నివేదిక
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కెసిఆర్ రీ డిజైనింగ్ పేరుతో మార్పులు చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన మూడేళ్లలోనే మేడిగడ్డ కుంగడం, అన్నారం పగిలిందని ఆయన పేర్కొన్నారు. రీడిజైనింగ్ పేరుతో ఇష్టానుసారం కెసిఆర్ డిజైన్లు మార్చారని, అంచనా వ్యయం పెంచారని, అంత గొప్పగా నిర్మించినా మూడేళ్లకే అది కుంగిపోయిందని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ నిర్మాణంలో ప్రణాళిక, నిర్మాణ, నిర్వహణ లోపాలు ఉన్నాయని ఆనాడు కెసిఆర్‌కు నిపుణులు నివేదిక అందించారని ఆయన తెలిపారు.

అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం కూలింది
లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోవడంపై అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ చేపడతామని ప్రజలకు ఆనాడు మాట ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం 14.03.2023 న అపార అనుభవం ఉన్న పిసి ఘోష్‌ను చైర్మన్ గా జ్యుడీషియల్ ఎంక్వైరీ కమిషన్‌కు నియమించామని సిఎం రేవంత్ తెలిపారు. కాళేశ్వరం కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహారించిన వ్యక్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారని ఆయన అన్నారు. ఆయన నిబద్ధత కలిగిన వ్యక్తి అని రేవంత్ చెప్పారు. 16 నెలల తరువాత జూలై 31వ తేదీన 665 పేజీల నివేదికను పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అందించిందని ఆయన పేర్కొన్నారు. నివేదిక సారాంశాన్ని తయారు చేసి కేబినెట్‌కు అందించాలని ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామని సిఎం రేవంత్ తెలిపారు. ఊరు మార్చి, పేరు మార్చి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం కూలిపోయిందని సిఎం రేవంత్ ఆరోపించారు. బిఆర్‌ఎస్ హయాంలోనే కాళేశ్వరం కూలిపోయిందని కమిషన్ నిర్ధారించిందని సిఎం రేవంత్ చెప్పారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్లలో కూడా లోపాలు ఉన్నాయని ఎన్‌డిఎస్‌ఏ రిపోర్ట్ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు.

అందరి సూచనల ప్రకారమే చర్యలు
బిఆర్‌ఎస్ పార్టీ కమిషన్ ఇచ్చిన రిపోర్టును తప్పుపట్టడం సహజమేనని సిఎం రేవంత్ తెలిపారు. నివేదిక వారికి అనుకూలంగా ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాట్లాడటం వారికి అలవాటేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ నివేదికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని, ఇది ఇండిపెండెంట్ జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చిన నివేదిక అని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అందరి సూచనల ప్రకారమే చర్యలు ఉంటాయని, రాజకీయ కక్ష పూరిత చర్యలకు పాల్పడమని ఆయన పేర్కొన్నారు.

ఆ ముగ్గురి వాదనలు కమిషన్ పరిగణలోకి: డిప్యూటీ సిఎం భట్టి 
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వెచ్చించిన ప్రజాధనం దుర్వినియోగం అయినందున స్వతంత్ర కమిషన్ వేశామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మాజీ సిఎం కెసిఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వాదనలను ఘోష్ కమిషన్ విని నివేదిక ఇచ్చిందని డిప్యూటీ సిఎం తెలిపారు. తాము చెప్పే అంశాలు రాజకీయపరమైనవి కావని, ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలు యధాతధంగా మీడియా సమావేశంలో వెల్లడిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణలో అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రమేయం, సూచనలే అక్రమాలకు కారణమయ్యాయని భట్టి విక్రమార్క తెలిపారు. అప్పట్లో మూడు బ్యారేజీలు నిర్మించడం మాజీ సిఎం కెసిఆర్ తీసుకున్న సొంత నిర్ణయమని ఈ విషయాన్ని ఘోష్ కమిషన్ స్పష్టంగా చెప్పిందని డిప్యూటీ సిఎ పేర్కొన్నారు.

కేబినెట్‌లో ఆమోదం జరగలేదని ఈటల కమిషన్‌కు తప్పుగా రిపోర్టు
నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేబినెట్ సబ్ కమిటీలో జరిగిన నిర్ణయం కేబినెట్‌లో ఆమోదం పొందిందని చెప్పడం సరైంది కాదని డిప్యూటీ సిఎం ఆరోపించారు. కేబినెట్‌లో ఆమోదం జరగలేదని ఆయన కమిషన్‌కు తప్పుగా రిపోర్ట్ చేశారని కమిషన్ స్పష్టం చేసిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడడంలో నిబద్ధత సమగ్రత లేకపోవడాన్ని నాటి ఆర్థిక మంత్రి ప్రదర్శించారని డిప్యూటీ సిఎం ఆరోపించారు. కీలకమైన ఆర్థిక నిర్ణయాలు తెలియవని అప్పటి ఆర్థిక మంత్రి చెప్పడం సరైనది కాదని కమిషన్ స్పష్టం చేసిందన్నారు. మార్చబడిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన బ్యాక్ వాటర్ స్టడీస్, జియో ఫిజికల్ ఇన్వేస్టిగేషన్స్ వంటి అధ్యయనాలు జరగలేదని డిప్యూటీ సిఎం భట్టి తెలిపారు.

రాజకీయ జోక్యంతో ప్రజాధనం భారీగా వృధా
క్షేత్ర అధ్యయనాలు జరగకుండా వివరించలేనంత ఆలస్యంతో డిజైన్లు తయారు చేశారని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. తుమ్మిడి హెట్టిలో నీటి లభ్యత లేదని చెప్పడం సరైనది కాదన్నారు. రిటైర్డ్ ఎక్స్‌ఫర్ట్ ఇంజనీర్స్ కమిటీ చెప్పిన ప్రకారం బ్యారేజీ నిర్మాణ స్థలం మార్చామని చెప్పిన విధానం కరెక్ట్ కాదన్నారు. రాష్ట్ర జీవనాడిగా ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యక్తిగత నిర్ణయాలు, రాజకీయ నాయకత్వ అనవసర జోక్యం ప్రభావం, రాజకీయ జోక్యంతో ప్రణాళిక, పాలన, సాంకేతిక పర్యవేక్షణ, ఆర్థిక క్రమశిక్షణ ప్రజాధనాన్ని భారీగా వృధా చేసిందని ఘోష్ కమిషన్ స్పష్టంగా చెప్పిందని డిప్యూటీ సిఎం భట్టి తెలిపారు.

ఎక్స్‌పర్ట్ కమిటీ నివేదికను కెసిఆర్, హరీష్‌లు తొక్కిపట్టారు:ఉత్తమ్‌
పిసి ఘోష్ కమిషన్ ప్రకారం మేడిగడ్డ లోపాలన్నింటికీ మాజీ సిఎం కెసిఆర్ కారణమని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు అప్పటి ప్రభుత్వం నీటి లభ్యత కోసం ఎక్స్‌పర్ట్ కమిటీని వేసిందని కానీ, ఉద్దేశపూర్వకంగానే అప్పటి సిఎం కెసిఆర్, ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు రిపోర్టును తొక్కిపెట్టారని ఆయన ఆరోపించారు. ఈ రోజు చారిత్రాత్మకమైన రోజుగా మంత్రి ఉత్తమ్ అభివర్ణించారు. పిసి ఘోష్ కమిషన్ 660 పేజీల రిపోర్టు ఇచ్చిందని ఆయన తెలిపారు. కాళేశ్వరం కోసం తెలంగాణ ప్రజలను కెసిఆర్ తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం కూలిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్‌డిఎస్‌ఏ కమిటీ విచారణ
మేడిగడ్డ కుంగిన తర్వాత ప్రాజెక్టును పరిశీలించామని, 2016లో మేడిగడ్డ బ్యారేజ్ అగ్రిమెంట్ జరిగిందని, మేడిగడ్డ కుంగినప్పుడు సిఎం కెసిఆర్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ప్లానింగ్, డిజైన్, కన్ స్ట్రక్షన్ లోపాలున్నాయని రిపోర్టు ఇచ్చిందని, మేడిగడ్డ కుంగడానికి కారణాలు సైతం చెప్పిందని ఆయన తెలిపారు. కెసిఆర్ హయాంలోనే మేడిగడ్డ ప్లానింగ్, నిర్మాణం, మెయింటెనెన్స్ అన్నీ జరిగాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 7 డిసెంబర్ లో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి కమ్యూనికేట్ చేశామని, ఎన్‌డిఎస్‌ఏ (నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ) టెక్నికల్ ఎక్స్ పర్ట్ కమిటీ విచారణ చేసిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం మూడు బ్యారేజీలలో నీళ్లు నిలిపే ఛాన్స్ లేదని నివేదిక ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. 2025 జూలై 31వ తేదీన జస్టిస్ ఘోష్ నివేదిక ఇచ్చిందని ఆయన తెలిపారు. కేబినెట్ ముందు పెట్టి ఆ నివేదిక గురించి వివరించినట్టు మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

కాళేశ్వరం కోసం అధికవడ్డీకి రూ.84 వేల కోట్లు ఖర్చు
కాళేశ్వరం కోసం అధికవడ్డీకి రూ.84 వేల కోట్లు ఖర్చు చేశారని, అధిక వడ్డీలకు ఎన్‌బిఎఫ్‌సిల దగ్గర అప్పు తెచ్చారని,
తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవని, అందుకే మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడం అనే వాదనలో వాస్తవం లేదన్న ఘోష్ కమిషన్ ఆ నివేదికలో తెలిపిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 2015లో ఆనాటి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి తెలంగాణకు లేఖ రాసిందని, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మడిహెట్టి దగ్గరనీళ్లు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 205 టిఎంసీల నీళ్లు ఉన్నాయని, 75 శాతం నీటి లభ్యత ఉందని లేఖలో చెప్పారని, తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేకనే మేడిగడ్డకు షిఫ్ట్ చేస్తున్నామన్నది ఒక సాకు మాత్రమేనని మంత్రి ఆరోపించారు.

మాజీ సిఎం కెసిఆర్ జోక్యం వల్లే బ్యారేజ్‌లు డ్యామేజ్‌లు
బిఆర్‌ఎస్ ప్రభుత్వం 5 మంది రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్‌లతో కమిటీ వేసిందని, వారు వేసిన కమిటీనే మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం సరికాదని రిపోర్టు ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. డబ్బులు వృధా అవుతాయని కూడా చెప్పిందని, ఎక్స్ పర్ట్ కమిటీ రిపోర్టును తొక్కిపెట్టారని, అప్పటి సిఎం కెసిఆర్, నీటిపారుదల మంత్రి హరీష్ రావులు ఉద్దేశపూర్వకంగానే ఆ నివేదికను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ప్రతి చిన్న విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి రాజకీయ జోక్యం చేసుకోవడం కారణంగానే బ్యారేజ్ లు డ్యామేజ్‌కు గురయ్యాయని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. రీ ఇంజనీరింగ్ అనేది ఆనాటి ముఖ్యమంత్రి సొంత నిర్ణయాలేనని మంత్రి ఉత్తమ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News