Tuesday, August 5, 2025

ఢిల్లీకి చేరిన కాంగ్రెస్ డ్రామా: బిజెపి చీఫ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల డ్రామాను హస్తినకు మార్చిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. బిసి రిజర్వేషన్లలో ముస్లిం మైనారిటీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించకుండా మొత్తం బిసిలకే 42 శాతం కల్పించినట్లయితే తాము మద్దతునిస్తామని ఆయన సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బిసి రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని ఆయన పునరుద్ఘాటించారు. అసెంబ్లీలో బిసి బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు తమ పార్టీ మద్దతునిచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

బిజెపిని బద్నాం చేయడానికి రిజర్వేషన్లను అడ్డుకుంటున్నట్లు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదని ఆయన విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ఏదో రకంగా వాయిదా వేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ ఉన్నదని ఆయన విమర్శించారు. రాష్ట్ర మంత్రివర్గం ఆర్డినెన్స్ (ముసాయిదా)ను ఆమోదించిన తర్వాత గవర్నర్ అవసరమైతే రాష్ట్రపతికి పంపిస్తారని ఆయన తెలిపారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పంపించాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. బిసిల ఓట్ల కోసం ఇంత కాలం ఇక్కడ డ్రామా చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కేంద్రంపై వత్తిడి తేవడానికి అంటూ ఢిల్లీలో డ్రామా చేయడానికి ప్రత్యేక రైలులో వెళ్ళారని రాంచందర్ రావు విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News