విదేశాలకు పారిపోయేందుకు ప్లాన్
ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: యూనివర్సల్ సృష్టి కేసులో మరో వైద్యురాలిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఎయిర్ పోర్టులో సిఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి సరోగసి పేరుతో మోసం చేయడంతో గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టర్ నమ్రతతోపాటు 12మందిని అరెస్టు చేశారు. మరో వైద్యురాలిని అరెస్టు చేయడంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 13కు చేరుకుంది.
యూనివర్సల్ సృష్టి సెంటర్ నిర్వహకురాలు డాక్టర్ నమ్రత నిబంధనలు ఉల్లంఘించడంతో వైద్య శాఖ అధికారులు సృష్టి గుర్తింపును రద్దు చేశారు. దీంతో డాక్టర్ విద్యుల్లత పేరుపై అనుమతులు తీసుకుని యూనివర్సల్ సృష్టి పేరుతో ఐవిఎఫ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో డాక్టర్ నమ్రత, డాక్టర్ విద్యుల్లత కలిసి ఐవిఎఫ్ కోసం వచ్చిన దంపతులకు సరోగసికి వెళ్లలని చెప్పి లక్షలాది రూపాయలు వసూలు చేశారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన దంపతులను సరోగసి పేరుతో వేరే వారి బాలుడిని తీసుకుని వచ్చి ఇవ్వడంతో వారు డిఎన్ఎ టెస్ట్ చేయించగా వారి కుమారుడు కాన్న తేలింది. దీంతో బాధితులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. విచారణ చేసిన పోలీసులు నిందితులను వరుసగా అరెస్టు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే అరెస్టు నుంచి తప్పించుకునేందుకు డాక్టర్ విద్యుల్లత ఆమె భర్త పరారీలో ఉన్నారు. నిందితులు విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు ముందుగానే లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు పరారీలో ఉన్న డాక్టర్ విద్యుల్లత విదేశాలకు పారిపోయేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాగా సిఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. లుక్ఔట్ నోటీసు ఉండడంతో ఆమెను విదేశాలకు వెళ్లకుండా ఆపిన సిఐఎస్ఎఫ్ సిబ్బంది గోపాలపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎయిర్ పోర్టుకు చేరుకున్న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గుజరాత్‌కు చెందిన డోక్ల గ్యాంగ్‌తో డాక్టర్ నమ్రతకు సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. కస్టడీలో ఉన్న డాక్టర్ నమ్రతను విచారిస్తున్న పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. డాక్టర్ నమ్రత పిల్లలను కిడ్నాపింగ్ చేసే గుజరాత్‌కు చెందిన డోక్ల గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. ఈ గ్యాంగ్‌కు చెందిన సిద్దాంత జగత్‌కు ఓ బాలుడిని రూ.3లక్షలకు వియ్రించినట్లు తెలిసింది.