Tuesday, August 5, 2025

‘కూలీ’ పెద్ద విజయం సాధించాలి

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన క్రేజీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ ‘కూలీ’.(Coolie)కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ఆసియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 14న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ “ఒకరోజు లోకేశ్ నన్ను కలిసి ‘మీరు విలన్‌గా చేస్తానంటే మీకో కథ చెబుతా. లేదంటే కాసిన్ని సినిమా కబుర్లు చెప్పి టీ తాగి వెళ్లిపోతా’ అన్నారు. లోకేష్ తెరకెక్కించిన ఖైదీ, విక్రమ్ నా ఫేవరట్ ఫిలిమ్స్.

ఆ సినిమాలు చూసిన తర్వాత ఎప్పటికైనా ఈ దర్శకుడితో పనిచేయాలని బలంగా అనుకున్నా. ‘కూలీ’ కథ చెప్పిన తర్వాత నాకు చాలా నచ్చింది. ‘రజనీ సర్ ఈ కథ ఒప్పుకొన్నారా’ (Rajni sir accepted story) అని అడిగా. ఎందుకంటే ఈ కథలో ‘సైమన్’ పాత్ర కథలో ఆల్ మోస్ట్ హీరోలాంటిది. లోకేష్ హీరో విలన్స్‌ని సమానంగా చూపిస్తాడు. నా కెరీర్‌లో మొదటిసారి లోకేశ్ కథ చెబుతుంటే రికార్డు చేసుకున్నా. ఇంటికి వెళ్లాక మళ్లీ మళ్లీ విన్నా. నాకు అనిపించిన కొన్ని మార్పులు చెప్పా. నేను చెప్పిన విషయాలు పరిగణనలోకి తీసుకుని ‘సైమన్’ పాత్రను లోకేశ్ తీర్చిదిద్దిన విధానం నాకు నచ్చింది. నాకు మూవీలో నెగెటివ్ రోల్ ఇచ్చినా ఈ పాత్ర చేసిన అనుభూతి పాజిటివ్‌గా ఉంది. సత్యరాజ్, శ్రుతిహాసన్, సౌబిన్, ఉపేంద్ర అందరూ చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు.

ఇక స్పెషల్ వీడియో బైట్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ “కూలీ నా డైమండ్ జూబ్లీ పిక్చర్. తెలుగులో రాజమౌళి ఎలాగో తమిళంలో లోకేశ్ కనగరాజ్ అలా. ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇందులో పలువు స్టార్స్ నటించారు. చాలాఏళ్ల తర్వాత సత్యరాజ్‌తో చేస్తున్నా. ఇక శ్రుతిహాసన్, ఉపేంద్ర, సౌబిన్‌లతో పాటు ఆమిర్‌ఖాన్ నటించారు. ముఖ్యంగా నాగార్జున ఇందులో విలన్‌గా చేస్తున్నారు. సైమన్ పాత్రలో ఆయన నటన చూస్తుంటే, నాకే ఆశ్చర్యమేసింది. బాషాలో- ఆంటోనీ ఎలాగో.. కూలీ-లో సైమన్ పాత్ర అలా ఉంటుంది. సైమన్‌గా నాగార్జున అదరగొట్టేశారు”అని అన్నారు. డైరెక్టర్ లోకేష్ కనకరాజు మాట్లాడుతూ “ఈ సినిమాలో నటించిన రజనీకాంత్‌కి థాంక్ యూ. అమీర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్, ఉపేంద్రలకు ధన్యవాదాలు. నాగార్జునని ఈ సినిమాకి ఒప్పించడం అనేది నాకు పెద్ద ఛాలెంజ్. ఫైనల్‌గా ఆయన ఒప్పుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన ఈ సినిమాలో అద్భుతంగా నటించారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రుతిహాసన్, డి.సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, సత్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News