Sunday, August 10, 2025

స్థానిక ఎన్నిలకు వచ్చే వారం నోటిఫికేషన్ జారీ..?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇటు ఎన్నికల సంఘాన్ని ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేస్తూనే రిజర్వేషన్లపై ఏదో ఒకటి తేల్చి ఎన్నికలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. బిసిల రిజర్వేషన్ అంశం తేలకపోవడంతో సందిగ్ధంలో ఉన్న ప్రభుత్వం హైకోర్టు విధించిన గడువు మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకే సిద్ధపడుతోంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలకు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. వచ్చే వారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిసింది. చట్టబద్దంగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వలేని పరిస్థితి నెలకొనడంతో ఇక ప్రత్యామ్నాయంగా పార్టీపరంగా రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. దాదాపు ప్రభుత్వం ఇదే నిర్ణయానికి వచ్చి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 5,773 ఎంపీటీసీ స్థానాలు, 566 జడ్పీటీసీలు, 31 జిల్లా పరిషత్తులు, 12,778 పంచాయతీలు,1,12, 934 వార్డులను పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే ఖరారు చేసింది. ముందు పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అధికార యంత్రాంగం కూడా ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా మండల, గ్రామ స్థాయి నుంచి ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ రిటర్నింగ్ అధికారులకు సమాచారం అందించింది. ఇదిలావుంటే సోమ, మంగళవారాల్లో ప్రభుత్వం ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకుని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. హైకోర్టు పెట్టిన గడువులోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల సిబ్బందిని సిద్ధం చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వార్డుల వారీగా సిబ్బంది వివరాలు సిద్ధం చేయాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలు, వార్డులు, జడ్పీటీసీ, ఎంపీటీసీల వివరాలు ఇప్పటికే ఎన్నికల సంఘానికి ప్రభుత్వం అందించింది. రిజర్వేషన్ల జాబితా ఇస్తే ఎప్పుడు అవసరమైతే అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేస్తోంది. హైకోర్టు గడువు మేరకే స్థానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితి ఉంది. అయితే హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ 30 నాటికి పూర్తి ప్రణాళికతో ప్రభుత్వం సిద్ధం కాలేకపోతే మరికొన్ని రోజులు గడువు పెంచేవిధంగా ప్రభుత్వం కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆర్డినెన్స్, బిల్లులకు లభించని ఆమోదం
బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ చట్టం తేవాలని ప్రయత్నిస్తే రాష్ట్రపతి వద్ద ఇంకా ఆ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. మరో వైపు ఆర్డినెన్స్‌తో ఎన్నికలు నిర్వహిచేందుకు సిద్దపడితే అందుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. ఈ పరిస్థితిలో రాజకీయంగా బిసి రిజర్వేషన్లు 42 శాతం అమలు చేసేలా పార్టీలపై ఒత్తిడి తేవాలనే నిర్ణయానికి వచ్చింది. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆనాటి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కొన్ని జిల్లాల్లో బిసిలకు రిజర్వు చేసిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ బీసీలు పార్టీపరమైన మద్దతుతో ఎక్కువ మంది గెలిచారు. ఇప్పుడు కూడా అదే పద్దతిలో పాత రిజర్వేషన్లనే అమలు చేస్తూనే చాలా చోట్ల బిసిలకు జనరల్ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వడం ద్వారా ప్రభుత్వపరంగా అనుకున్నది సాధించేందుకు అవకాశం ఉందని యోచిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News