Monday, August 11, 2025

తెల్లరేషన్ కార్డుల పంపిణీ నేటితో పూర్తి

- Advertisement -
- Advertisement -

గడువు పెంపుదలపై కొలిక్కిరాని సర్కారు నిర్ణయం
ఇప్పటి వరకు మంజూరు పత్రాలతోనే సరుకులు పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా 5.61 లక్షల కుటుంబాలకు లబ్ధి
రాష్ట్రంలో 95.56 లక్షలకు చేరిన రేషన్ కార్డుల సంఖ్య
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మరింత జాప్యం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఆదివారంతో ముగియనున్నది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డుల పంపిణీ జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును వేగవంతం చేసింది. స్థానిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు అడుగులు వేస్తోంది. నేటితో(ఆగస్టు 10వ తేదీ) లబ్దిదారులకు తెల్ల రేషన్ కార్డులను పంపిణీ పూర్తికానున్నది.

గడువును పొడిగించే అంశంపై సోమవారం నాడు అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం మంజూరు పత్రాలు మాత్రమే పంపిణీ చేస్తుండగా స్మార్ట్ రేషన్ కార్డుల డిజైన్ అంశంపై హైకోర్టులో వివాదం ఉన్న నేపద్యంలో అప్పటి వరకు మంజూరు పత్రాల ఆధారంగానే సరుకుల లభ్యత ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులను ఇచ్చేందుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. పలు సంస్థలు టెండర్లు కూడా దాఖలు చేశాయి. అయితే ప్రభుత్వం నిర్దేశించిన నిబందనలపై ఒక ఏజెన్సీ హైకోర్టును ఆశ్రయించడంతో స్మార్ట్ కార్డుల ముద్రణ విషయంలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. కొత్త కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల స్థానంలో క్యూ ఆర్ కోడ్‌తో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులను అందించే దిశగా పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది.

కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మీసేవా కేంద్రాలు, ప్రజాపాలన కార్యక్రమం, గ్రామసభలు, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వాటిని జిల్లా స్థాయిలో సమీక్షించి, అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసింది. అనంతరం గ్రామసభల ద్వారా అర్హుల గురించి తెలిపి తర్వాత కూడా అభ్యంతరాలు స్వీకరించి తర్వాత ఫైనల్ జాబితాను ప్రకటించింది. కొత్త కార్డులకు సంబంధించిన డిజైన్లు ఇంకా ఖరారు కాకపోవడం, టెండర్ల అంశం కోర్టులో ఉండడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు కార్డులకు బదులుగా మంజూరు పత్రాలను పంపిణీ చేస్తున్నారు. ఓ వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోతో మంజూరు పత్రాలు జారీ చేస్తున్నారు. ఇందులో రేషన్ కార్డు లబ్ధిదారుల పేర్లు, కార్డు నంబరు తదితర వివరాలు ఉన్నాయి. కొత్త కార్డులు వచ్చే వరకు ఈ మంజూరు పత్రాల ఆధారంగానే లబ్ధిదారులకు రేషన్ అందజేస్తామని అధికారులు వెల్లడించారు. అలాగే సంక్షేమ పథకాలకు కూడా వీటిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.

95.56 లక్షలకు చేరిన కార్డుల సంఖ్య
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1న రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించే నాటికి 89,95,282 కార్డులపై 2,81,47,565 మంది లబ్ధిదారులున్నారు. తాజాగా ప్రభుత్వం ఆమోదించిన 5.61 లక్షల కొత్త కార్డులు, పాత కార్డుల్లో అదనపు సభ్యుల చేరికలతో రాష్ట్రంలో మొత్తం కార్డుల సంఖ్య 95.56 లక్షలకు చేరింది. లబ్ధిదారుల సంఖ్య 3.09 కోట్లకు చేరుకుంది. కొత్త రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు సెప్టెంబరు నుంచి రేషన్ విడుదల అవుతుందని అధికారులు తెలిపారు. కార్డులు జారీ అయ్యేవరకు మంజూరు పత్రాలను సంక్షేమ పథకాలకు పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో రేషన్ కార్డుదారులు సంక్షేమ పథకాల కోసం టీఎస్-పీడీఎస్ పోర్టల్‌లో తమ కార్డు వివరాలను ప్రింట్ చేయించి, లామినేట్ చేసి ఉపయోగించేవారు.

ఇప్పుడు ఈ మంజూరు పత్రాల ఆధారంగానే ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తున్న గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్తు), రూ. 500కే గ్యాస్ సిలిండర్, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాలు తదితర పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చని అధికారులు తెలిపారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ, పాత కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చే ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా 7.95 లక్షల కొత్త కార్డులు జారీ అయ్యాయి. 11.37 లక్షల మందిని పాత కార్డుల్లో చేర్చారు. జులై 28 నాటికి తెలంగాణలో 97.9 లక్షల యాక్టివ్ రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 3.15 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. మొత్తంగా కేవలం ఆరు నెలల్లోనే 33.97 లక్షల మంది కొత్త లబ్ధిదారులు ఈ పథకం కింద చేరారు.

త్వరలో ‘గృహజ్యోతి’ పథకానికి నమోదు
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కొత్తగా తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ‘గృహజ్యోతి’ పథకానికి కూడా దరఖాస్తు చేసుకునేందుకు లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఎంపీడీవో, పురపాలక కార్యాలయాల్లో నమోదు ప్రక్రియను ప్రారంభించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదని, ఆదేశాలు రాగానే ప్రజలకు గృహజ్యోతి పథకం కింద అవకాశం కల్పిస్తామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ’గృహజ్యోతి’ పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందడానికి దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు ఫారాన్ని అధికారిక ప్రభుత్వ పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా సమీపంలోని విద్యుత్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, లేదా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పొందవచ్చు.

తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యుత్ బిల్లు కస్టమర్ ఐడీ వివరాలు (ప్రస్తుత లేదా గత నెల కరెంట్ బిల్లు రశీదు), నివాస ధృవీకరణ పత్రం (అవసరమైతే), పూర్తి వివరాలను నింపిన తర్వాత, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్యాలయంలో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయంలో లేదా ఎమ్మార్వో కార్యాలయాల్లో దరఖాస్తును సమర్పించాలి. ఈ పథకం కింద నెలవారీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. ఒక నెలలో వినియోగం 200 యూనిట్లు దాటితే, ఆ నెల మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే సమయంలో ఎలాంటి పెండింగ్ విద్యుత్ బిల్లులు ఉండకూడదు. ఒక కుటుంబానికి ఒక కనెక్షన్‌కు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత, మీ వివరాలను విద్యుత్ శాఖ అధికారులు లేదా స్థానిక అధికారులు పరిశీలిస్తారు. అర్హులైన వారికి త్వరలో ఉచిత విద్యుత్ పథకం వర్తింపచేస్తారని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News