ఢిల్లీ మాజీమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ నేత సత్యేంద్ర జైన్‌ను ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టు ఆయనపై మోపిన అవినీతి కేసులో ఎలాంటి ఆధారాలు సిబిఐ చూపలేకపోయినందుకు కేసు కొట్టివేసి కేసులో నిర్దోషిగా తేల్చేసింది. ఢిల్లీలో రెండవసారి అత్యధిక మెజారిటీతో కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చిన ఆప్‌నేత, ప్రజా పనుల శాఖామంత్రి సత్యేంద్ర జైన్‌పైనే అవినీతి నేరం మోపి మొదట జైలుపాలు చేశారు. ఒక రకంగా కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం కేజ్రీవాల్‌పై మద్యం కేసు కట్టడానికి ముందు ట్రయల్ రన్ సత్యేంద్ర జైన్ అని చెప్పవచ్చును. ఈయనపై 17 మంది కార్పొరేట్ సిబ్బంది నియామకం విషయంలో అవినీతికి పాల్పడినట్లు బిజెపి ఆరోపించడం, ఆ వెంటనే ఆ ఫైలుపై సంతకం చేసిన లెఫ్టినెంట్ గవర్నర్‌నే సిబిఐ విచారణకు ఆదేశించడం జరిగింది.
అంతేకాదు జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్‌తో ఓ లేఖ రాయించి మనీలాండరింగ్ కేసు కూడా నమోదు చేయించారు. ఇడి విచారణకు ఆదేశించారు. అవినీతి కేసులో (case corruption) సత్యేంద్ర జైన్‌ను రెండు సంవత్సరాలు విచారణ పేరుతో జైలులో నిర్బంధించడం, అనారోగ్యంతో ఉన్న వృద్ధుడు అని కూడా చూడకుండా బెయిల్ నిరాకరించడం చేశారు. చివరకు ఢిల్లీ ఎన్నికల్లో ఈ కేసు అపవాదు మూలంగానే ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇంతవరకు బాగానే ఉంది. బిజెపి పార్టీ ఎన్నికల అవసరం ముగిసిపోయింది. నాలుగు సంవత్సారాల తర్వాత ఢిల్ల్లీ రోస్ అవెన్యూ కోర్టు సత్యేంద్ర జైన్ నిర్దోషిగా తేల్చి కేసు కొట్టివేసింది. 17 మంది నియామకం నిబంధనలు ప్రకారమే, మెరిట్ ప్రకారమే జరిగిందని, ప్రజలు అవసరార్థమే ఉద్యోగ నియామకాలు జరిగాయి.
ఒక్కపైసా అవినీతి జరగలేదని సిబిఐనే తేల్చిచెప్పింది? ఆయన గత నాలుగేళ్ళుగా అనుభవించిన భౌతిక, నైతిక హింసకు ఇప్పుడు జవాబుదారీ ఎవరు? బిజెపినా? లెఫ్టినెంట్ గవర్నరా? సిబిఐ నా? ఎవరు ఆయనపై జరిగిన చట్టబద్ధం హింసకు, ప్రజాస్వామ్య హననానికి బాధ్యత వహించాలి. ప్రాయశ్చిత్తం చేసుకోవాలి? బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటినుండి ప్రత్యర్థులపై కేసులు నిత్యకృత్యమయ్యాయి. అదే బాటన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యర్థులపై కేసులు మీద కేసులు పెడుతున్నా కేంద్రం ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉంది. ఎందుకంటే తాను నేర్పిన విద్యనే కదా నీరజాక్షా! అనే స్థితి తెలుగు రాష్ట్రంలో ఉంది. భీమా కోరెగావ్ కేసు, అర్బన్ నక్సల్స్‌నుంచి మొదలైన ప్రజాస్వామ్య హననం. చివరకు ప్రత్యర్థి పార్టీలు వరకూ విస్తరించింది. స్టాన్ స్వామి లాంటి క్రిస్టియన్ ఫాదర్‌ను సైతం జైలులో కనీసం సౌకర్యాలు కల్పించలేదు.
పక్షవాతంతో కదలలేని స్థితిలో ఆయన ఇబ్బందిపడ్డారు. చివరకు కన్నుమూశారు. అర్బన్ నక్సల్స్ పేరుతో ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబా లాంటి పూర్తి కదలలేని స్థితిలో ఉన్న దివ్యాంగుడిని కూడా దశాబ్దకాలంగా అండా జైలులో నిర్బంధించిన వైనం మనం చూశాం. ఆయన నిర్దోషిగా బయటకు వచ్చిన కొద్దికాలంలోనే ఆయన చనిపోయారు. ఈ మరణాలకు జవాబుదారీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరు? తెలంగాణ రచయిత, విరసం నేత వరవరరావును అండర్ ట్రయల్ ఖైదీగా జైలు నిర్బంధంలో ఉంచారు. కనీసం అనారోగ్యంతో వృద్ధుడుగా ఉన్న ఆయన్ను కనీసం కుటుంబం తో కలిసి ఉండే అవకాశం కల్పించడం లేదు? వీరంతా నేరస్థులేం కాదు? చట్టంలో ఉన్న లొసుగులు ఉపయోగించుకొని వేల పేజీల చార్జిషీట్‌లు వేయడం, అది చదువుకునేలోపు ఆ న్యాయమూర్తి బదిలీ కావడం, తిరిగి మరలా కేసు విచారణ తంతు మొదటికే రావడం ఇలా ఏళ్ళ తరబడి కేసులు సాగదీస్తూ అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్నారు.
ఫలితంగా అండర్ ట్రయల్ ఖైదీలుగా శిక్ష విధించకుండానే శిక్ష అనుభవిస్తున్నారు. ఎమర్జెన్సీ కాలంలో కూడా చవిచూడని నిర్బంధం ప్రస్తుతం దేశంలో అమలు జరుగుతున్నది. భీమా కోరెగావ్ కేసులో అరెస్టు అయిన వారిని విడుదల చేయాలని ఢిల్లీలో ప్రముఖ మేధావులు 50 మంది సంతకాలతో హోం మంత్రి అమిత్ షాకు మెమొరాండం ఇస్తే! మెమొరాండంపై సంతకాలు చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్ చేయమని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. వినతి పత్రం ఇస్తే అరెస్టు చేయండి అని ఆదేశించిన చరిత్ర ఇదే ప్రథమం కావడం విశేషం! దీనిపై దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు నిరసన తెలపడంతో కేంద్ర హోం శాఖ రచయితలపై కేసు విషయంలో వెనకడుగు వేసింది. కానీ, దేశవ్యాప్తంగా నిరసన తెలిపిన ప్రజాస్వామ్యవాదులు పైన మాత్రం కేసులు పెట్టి ఉపసంహరణ చేయలేదు? నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
గత ఆరేడు సంవత్సరాలుగా సంఘ్ పరివార్ ఎజెండాను వ్యతిరేకించే వామపక్షశక్తులు, ప్రతిపక్ష పార్టీలుపై నిర్బంధం అప్రకటిత ఎమర్జెన్సీ రూపంలో కొనసాగుతున్నది.రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సిబిఐ, ఇడి, ఐటి లాంటి సంస్థలపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు 75 ఏళ్ళ స్వర్ణోత్సవం జరుపుకోవాలసిన ఎన్నికల కమిషన్ స్వతంత్రత విషయంలో కూడా బీహార్ స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) అమలు చేయడం సైతం వివాదాస్పదం అయింది. వాస్తవంగా ఢిల్లీ ఎన్నికల సమయంలోనే ఎన్నికల కమిషన్ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అది కాస్తా బీహార్ ఎన్నికల విషయంకు వచ్చేసరికి ఎస్‌ఐఆర్ నిబంధనల రూపంలో ఓటర్ల తొలగింపు రూపం తీసుకుంది. ప్రతిపక్షాలు ఎన్నికల బహిష్కరణ ఆలోచన వరకు వెళ్ళడం అనేది సాధారణ అంశం కానేకాదు. బీహార్ వెనుకబడిన వర్గాలు అధికంగా ఉండడంతో పాటు, రాష్ట్రం నుండి నాలుగైదు నెలలపాటు వలస వెళ్ళే భవన నిర్మాణ కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
బీహార్‌లో సర్వేలు ప్రతిపక్షానికి అనుకూలంగా మారుతున్న దశలో ఇప్పటికిప్పుడు పౌరసత్వం కార్డు బయటకు తీసి (ఎస్‌ఐఆర్) అమలు జరపడం విమర్శలకు తావిస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా రాజ్యాంగంలో స్వతంత్ర ప్రతిపత్తి గల ఎన్నికల కమిషన్ లాంటి సంస్థలపై విమర్శలు రావడం అంత వాంఛనీయం కానేకాదు? ఎన్నికల ముందు ఢిల్లీ, జార్ఖండ్ ముఖ్యమంత్రుల పై కేసులు నమోదు కావడం, అరెస్టులు చేసి జైళ్ళలో నిర్బంధం విధించడం లాంటి చర్యలు పాతవే అయినా కేసులనమోదులో అనేక అనుమానాలు పొడచూపుతున్నాయి. చివరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై సైతం పలు కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలుపై నిర్బంధం పెరిగిన దశ కనపడుతున్నది. అయితే, సిబిఐ, ఇడి పెట్టిన కేసుల్లో 90 శాతం శిక్షలు ఖరారు కాకపోవడం, అనేక ఇబ్బందులు అనంతరం కేసులు సరైన సాక్ష్యం లేక కొట్టివేసిన పరిస్థితుల్లో? జరిగిన నష్టానికి ఎవరు జవాబుదారీ వహిస్తారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి విషయాలు ఎంత మాత్రం అనుసరణీయం, అనుకరణీయం కానీ, కానేకాదు!—-
- ఎన్. తిర్మల్, 94418 64514