అరుంధతీ నక్షత్ర దర్శనం అయినాక
ఇద్దరం ఒక్క తీపి ముద్దుగ
సంలీనమైనప్పటి నుంచీ
చేను శెల్కల గట్ల మీద
మన జోడుకలలు పైరుపచ్చలు
తొడిగింది నిజమే గద
కాపుర మంతటి పెద్ద చెరకుపాల
కడాయిలో పూబెల్లపు కమ్మని వుడుకు
వాసనలనాస్వాదిస్తూ,(Enjoying smells) రాత్రిళ్ళు
బరువు కళ్ళ నిద్రని
చెరిసగం పంచుకున్న యాది పదిలమే గద
ఎండలో పాటువండ్లకై మామిడి తోటంతా
తిరిగి, తెచ్చిన రెండూ ‘నీకంటే నీకు’
అని కొట్లాడుకున్నదీ గుర్తే గద
కడుపు నిండని రోజుల గురించి
చర్చా ఘర్షణ లో
చివరికి ఇరు చిరునవ్వే సమాధానంగ
సమాధాన పడ్డది గమ్మత్తే గద
ఏకాంతపు గదిలో
నిన్ను నేను, నన్ను నువ్వు
చదువుతూ
జీవిత ఉద్గ్రంధంపై
మెరిసే ఒకే
సంతకమైనం గద
నీకు మల్లెలు ఇవ్వలే నాకు కోపాలు ఇవ్వలే
రుతు, కాలధర్మాలే వెంటేసుకొని మనల్ని నడిపించినయి నీకు ఆశల్ని ఇవ్వలే
నాకు బాధల్ని ఇవ్వలే
వెలుగు చీకట్ల
రంగులరాట్నంలో
పక్కపక్కనే వున్నం
రెండిళ్ళ మధ్య నీ ప్రయాణం
మనిద్దరికీ అమాస పున్నమలను
పరిచయం చేసింది మర్చిపోలేం గద
భక్తి, విప్లవం, సంసారం ఒరలో
ఎంచక్కా ఒదిగినయి
రుచుల అభిరుచులెట్లా ఉన్నా
ఒకరికొకరం తినిపించుకున్నం
ఇగోలు, లోగోలు, వ్యక్తిత్వాలు, అస్తిత్వాలు
వాదాలు, హక్కులు అన్నీ అన్నీ
‘ఇవ్వటమే తెలిసిన ప్రేమలో,
ఎప్పుడో, ఎక్కడో కొట్టుకుపోయినై
‘మన జీవితం’ అంటే
నువ్వూ నేనుల ఏక ప్రియవచనం
‘మనం జీవించాం’ అలా
భూమ్యాకాశాల చుంబిత స్థలి మీద
ఏనాడో ఏ మహాకవో విరచించిన
అసిధారా వ్రత కవితా పంక్తుల్లా, అచ్చంగా
- దాసరాజు రామారావు