హైదరాబాద్: సినీ కార్మికుల వేతనాలు పెంచాలని గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫిల్మ్ ఫెడరేషన్ షూటింగ్లను నిలివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkatreddy) స్పందించారు. పని చేస్తూనే తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలి కానీ, షూటింగ్లను నిలిపివేయడం సరైనది కాదని ఆయన అన్నారు. సోమవారం ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు, నిర్మాత, ఎఫ్డిసి ఛైర్మన్ దిల్ రాజుతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో నిర్మాతలు సుప్రియ, జెమిని కిరణ్, దామోదర్ ప్రసాద్ ఉన్నారు. పరిశ్రమలో నెలకొన్న తాజా పరిస్థితులపై సమావేశంలో చర్చించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని మంత్రి (Komatireddy Venkatreddy) అన్నారు. పట్టువిడుపులతో ఉండాలని నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులకు మంత్రి సూచించారు. ఒకరి ఇబ్బందులను మరొకరు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసుకోవాలని.. నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులు మంగళవారం మరోసారి చర్చించుకోవాలని అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దిల్ రాజుకు మంత్రి సూచించారు.