విపక్షాల నుంచి సర్‌పై నిరసనలు గందరగోళం నడుమనే లోక్‌సభలో సోమవారం మొత్తం నాలుగు కీలకమైన బిల్లులు ఆమోదం పొందాయి. రెండు ఆదాయపు పన్ను పన్నుల వసూళ్లకు సంబంధించినవి, మరో రెండు క్రీడావిధానాల సంస్కరణల పరిధిలోకి వచ్చేవి. పన్నుల విధింపు సంబంధిత ఇన్‌కం టాక్స్ (నెంబరు 2) ,పన్నుల విధింపునకు సంబంధించిన టాక్సేషన్ లాస్ (సవరణ) బిల్లు ఇప్పుడు సభామోదం దక్కించుకున్నాయి. సోమవారం ఉదయం సభ ఆరంభం కాగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. దేశంలో అమలులో ఉన్న ఆదాయపు పన్ను బిల్లు 1961 నాటి ఆదాయ పన్ను చట్టం నిబంధనలకు అనుగుణంగా ఉంది. ఈ చట్టాన్ని సవరించి , సరైన విధంగా పటిష్టం చేసేందుకు ఈ నూతన ఆదాయపు పన్ను బిల్లు తీసుకువచ్చారు.
ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే పాత చట్టం స్థానంలో కొత్త చట్టం అమలులోకి వస్తుంది. ఆదాయపు పన్ను చట్టం అంశాలను పరిశీలించేందుకు బిజెపి సీనియర్ ఎంపి బైజ్యనాథ్ పాండా సారధ్యంలో ఏర్పాటు అయిన సెలెక్ట్ కమిటీ సిఫార్సులను ఈ బిల్లులో పొందుపర్చారు. ఇక పన్నుల విధింపు సంబంధిత బిల్లు పన్నుల వ్యవస్థీకృత పద్ధతులలో మార్పునకు ఉద్ధేశించింది. ఈ క్రమంలో ఈ ఏడాది తీసుకువచ్చిన ఫైనాన్స్ యాక్ట్‌ను కూడా సవరించడం జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఐటి బిల్లు 2025లో పలు మార్పులు చేర్పులను సెలెక్ట్ కమిటీ సిఫార్సు చేసింది. ఇవి కూడా ఇప్పటి తాజా బిల్లులో చేరాయి. బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్‌పై ప్రతిపక్షాలు సభలో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేయడంతో సభా కార్యక్రమాల దశలో గందరగోళం ఏర్పడిన దశలోనే ఈ రెండు బిల్లులు ఆమోదం పొందినట్లు సభాధ్యక్ష స్థానం నుంచి ప్రకటన వెలువడింది.
ప్రతిపక్షాల ప్రాతినిధ్యం అంతకు ముందటి చర్చ ప్రక్రియ లేకుండానే ఈ బిల్లు ఆమోదం పొందింది.క్రీడా విధానానికి సంబంధించిన అత్యంత కీలకమైన నేషనల్ స్పోర్ట్ గవర్నెస్ బిల్లును , నేషనల్ యాంటీ డోపింగ్ సవరణ బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. సర్‌పై ప్రతిపక్షాల తీవ్ర నిరసనల నడుమనే ఈ బిల్లులు సభా సమ్మతి దక్కించుకుంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో క్రీడా విధాన సంస్కరణల దిశలో తీసుకువచ్చిన బిల్లు ఇదే అని క్రీడల మంత్రి మనుసుఖ్ మాండవీయ తెలిపారు. క్రీడా రంగంలో ఏకైక సంస్కరణల అడుగు అని స్పందించారు. ఈ రెండు క్రీడా బిల్లులతో జవాబుదారి , సరైన న్యాయం, సుపరిపాలనకు వీలేర్పడుతుంది. క్రీడా సమాఖ్యలు సముచితంగా వ్యవహరించేందుకు వీలేర్పడుతుందని మంత్రి తెలిపారు. బిల్లులు సభలో ప్రవేశపెట్టిన సమయంలో సభలో ప్రతిపక్ష నాయకులు ఎవరూ లేరు. దేశ క్రీడా యవనికలో గణనీయ పరిణామానికి దారితీసే ఈ బిల్లుల దశలో ప్రతిపక్షాలు సభలో లేకపోవడం దురదృష్టకరం అని మంత్రి వ్యాఖ్యానించారు.