Tuesday, August 12, 2025

బిజెపి, బిఆర్‌ఎస్ మధ్య రహస్య ఒప్పందాలు:మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

బిజెపి, బిఆర్‌ఎస్ మధ్య రహస్య ఒప్పందాలు జరిగాయని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆరోపించారు. కరీంనగర్‌లో సోమవారం ఆయన పర్యటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థలపై తమకు నమ్మకం ఉందని ఉద్ఘాటించారు. 42 శాతం బిసి రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందని అన్నారు. జంతర్ మంతర్ వద్ద తమ పార్టీ ఇటీవల చేపట్టిన నిరసన, ధర్నాకు రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపిలు ఎందుకు మద్దతు పలకలేదని ప్రశ్నించారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ లాంటి సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో రాజకీయ జోక్యం లేదని క్లారిటీ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అధికారులే విచారణ చేస్తున్నారని తెలిపారు. కేంద్రంలో పదేళ్ల నుంచి బిజెపి అధికారంలో ఉన్నా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏం సాధించిందని ప్రశ్నించారు.

తమ మేనిఫెస్టోలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ జ్యుడీషియల్ ఎంక్వైరీ వేస్తామని చెప్పామని..అన్నట్లుగానే వేశామని గుర్తుచేశారు. మేడిగడ్డ విషయంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన సూచనలు మాత్రమే ప్రభుత్వం పాటించి ముందుకు సాగుతోందని అన్నారు. బిసిల గురించి బిఆర్‌ఎస్ నేతలు మాట్లాడితే జనం నమ్ముతారా అని నిలదీశారు. పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎలపై నిర్ణయం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌దే అని పేర్కొన్నారు. బిసిల రిజర్వేషన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న మేరకు శాసనసభలో చట్టాన్ని ప్రవేశపెట్టి ఆర్డినేషన్ తీసుకువచ్చామని అన్నారు. దీనిపై ఆర్డినెన్స్ ఆమోదించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపిలకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఆర్డినెన్స్ ఆమోదింపజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎంఎల్‌ఎలు సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా ఛైర్మన్ నరేందర్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News