Tuesday, August 12, 2025

పాత పద్ధతిలోనే పది పరీక్షలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పాత పద్ధతిలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. 20 శాతం ఇంటర్నల్ మార్కుల విధానం కొనసాగించాలని నిర్ణయించింది. పదో తరగతి పరీక్ష ల్లో 80 శాతం ఎక్స్‌టర్నల్ మార్కులు, 20 శాతం ఇంటర్నల్ మార్కులు కేటాయించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతిలో ఇంటర్నల్ మార్కులు ఉన్నాయా.. లేవా..? అనే అంశం పై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తె లిసిందే. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ నిర్ణ యం కోసం ఎదురుచూశారు.

ఇంటర్నల్ మార్కులను తొలగిస్తూ గత ఏడాది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి, ఆ తర్వాత సవరించింది. గత విద్యాసంవత్సరానికి కూడా పాత పద్దతిలో 20 ఇంటర్నల్ మార్కులు, 80 మార్కులకు రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అయితే 202526 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కుల విధానం రద్దు చేసి, 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, ఇటీవల ఢిల్లీలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సిఇఆర్‌టి) నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఈ నిర్ణయంపై ప్రశ్నలు తలెత్తడంతో పునరాలోచనలో పడిన పాఠశాల విద్యాశాఖ అధికారులు.. పాత విధానాన్నే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఎందుకీ ఇంటర్నల్ మార్కుల సమస్య..?
విద్యాహక్కు చట్టం- 2005 ప్రకారం పాఠశాల విద్యలో నిరంతర మూల్యాంకన విధానాన్ని ప్రభుత్వం 2011 నుంచి అమలు చేస్తుంది.ఆరు నుంచి పదో తరగతి వరకు ఆరు సబ్జెక్టుల్లో ఇంటర్నల్ పరీక్షలకు 20 చొప్పున మార్కులు కేటాయిస్తున్నారు. అంటే ప్రాజెక్టు, రాత పని, యూనిట్ పరీక్షలు వంటివి పరిగణనలోకి తీసుకుంటారు. మిగిలిన 80 మార్కులకు సబ్జెక్టులలో ప్రశ్నలు ఇచ్చి రాత పరీక్షలు నిర్వహిస్తారు. పదో తరగతిలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధిక శాతం విద్యార్థులకు 20కి 20 మార్కులు వేస్తున్నాయని, అదే సమయంలో ప్రభుత్వ బడుల విద్యార్థులు తక్కువ మార్కుల కారణంగా నష్టపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. దీంతో 202526 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కుల విధానం ఉండవని గత ఏడాది అక్టోబరు 28న విద్యాశాఖ స్పష్టం చేసింది.

గత ఏడాది ఇచ్చిన ఉత్వర్వుల ప్రకారం ఈ సంవత్సరం నుంచి 100 మార్కులకు ప్రశ్నపత్రాలు రూపొందించడంపై కసరత్తు చేస్తుండగా ఇటీవల ఢిల్లీలో అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ తదితర బోర్డులతోపాటు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే పరీక్షల్లో అంతర్గత మార్కులు ఉన్నాయి కదా..? ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం కూడా విద్యార్థులను పరీక్షల మార్కులతోనే అంచనా వేయవద్దని, 360 డిగ్రీల కోణంలో చూడాలని సూచించడంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. అన్ని అంశాలు పరిశీలించి పాత పద్దతిలో పదో తరగతి పరీక్షలు 20 ఇంటర్నల్ మార్కులు, 80 మార్కులకు రాత పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాలలు పునఃప్రారంభమై సుమారు రెండు నెలల అనంతరం పదో తరగతి ప్రశ్నపత్రాల సరళిపై విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News