బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై ఢిల్లీ వీధుల్లో విపక్షాల నిరసనల హోరు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం
ప్రధాన కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన ఇండియా కూటమి ఎంపిలు బారికేడ్లు దూకిన ఎస్పినేత అఖిలేశ్,
మరికొందరు మహిళా ఎంపిలు దూసుకొస్తున్న పార్లమెంట్ సభ్యులను అడ్డుకున్న పోలీసులు రోడ్డుపై బైఠాయించిన
ప్రజాప్రతినిధులు రాహుల్, ప్రియాంక సహా పలువురు ఎంపిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు తోపులాటలో
సొమసిల్లి పడిపోయిన మహిళా నేతలు ఇది రాజకీయ పోరు కాదు.. రాజ్యాంగ పరిరక్షణకే నిరసన యాత్ర : రాహుల్
న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) వివాదం ప్రతిపక్షాల నిరసనలతో దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఇం తవరకూ విపక్షాలు కాంగ్రెస్ నాయకత్వంలో సర్‌పై పార్లమెంట్లో, ఆవరణలో నిరసన హోరు సాగించాయి. ఇప్పుడు ఎన్నికల సంఘం కార్యాలయం వరకూ సాగిన విపక్షాల ప్రదర్శన వేడిని రగిలించింది. నిబంధనలనకు విరుద్ధంగా ప్రతిపక్షాల మార్చ్ ఉందని పేర్కొంటూ మా ర్గమధ్యంలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ దశ లో ప్రదర్శనకు సారధ్యం వహిస్తున్న ప్రతిపక్ష నేత రా హుల్ గాంధీని, ప్రియాంకను, మల్లిఖార్జున ఖర్గేను ఇతర విపక్ష అగ్రనేతలను పోలీసు బలగాలు అడ్డగించి అదుపులోకి తీసుకున్నాయి. రాహుల్ ఇతరులు ప్రతిఘటిస్తుండగానే వారిని పోలీసు వాహనాలలోకి ఎక్కించి పోలీసు స్టేషన్లకు తరలించారు. దీనితో కార్యకర్తలు ఇతర నేతల నుంచి నిరసనలు, నినాదాలు హోరెత్తాయి. తీవ్రస్థాయి ఉత్కంఠనడుమ ఈ ఘట్టాలు చోటుచేసుకున్నాయి. పార్లమెంట్ హౌస్ నుంచి ఎన్నికల సంఘం కా ర్యాలయం వరకూ ప్రతిపక్షాలు ప్రదర్శన చేపట్టాయి.
అంతకు ముందు పార్లమెంట్లో సర్‌కు వ్యతిరేకంగా నిరసనలు గందరగోళం మధ్య సభా కార్యక్రమాలు కుంటుతూ సాగాయి. తాము దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు బయలుదేరామని, ఇది రాజకీయ పోరు కాదని పోలీసులు నిర్బంధించిన తరువాత జీపులో రాహుల్ గాంధీ తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ పార్టీలకు అతీతంగా సాగుతుందని చెప్పారు. ఈ నిరసనలు ఆగబోవని ప్రకటించారు. ఒక వ్యక్తి ఒక ఓటు కోసం ప్రతిపక్షాలు ముందుకు వెళ్లుతాయన్నారు. తమ ప్రశ్నలకు ప్రభుత్వం కానీ ఇసి కానీ జవాబు ఇవ్వలేదు. ఎందుకంటే తమ ప్రశ్నలు నిజాయితీతో వాస్తవికతతో ఉన్నాయని రాహుల్ చెప్పారు. సత్యం ముందు వక్రీకరణలకు మాట చెల్లనేరదన్నారు. ప్రజల ఓటు హక్కు రక్షణకు తాము ఉద్యమిస్తున్నామని ఖర్గే చెప్పారు. బిజెపి కుట్రలను ఇండియా కూటమి వెలుగులోకి తీసుకువస్తుంన్నారు. ఈ దశలో వారిని ముందుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు ఠాణాకు తీసుకువెళ్లారు. కొద్ది సేపటి తరువాత విడిచిపెట్టారు.
బారికేడ్లు ఎక్కిన ఎంపిలు, సొమ్మసిల్లిన నేతలు
మార్క్ దశలో బారికేడ్లను ఛేదించుకుంటూ కొందరు మహిళా ఎంపిలు ఇతరులు ముందుకు సాగారు.ఈ క్రమంలో చీర ధరించి ఉన్న టిఎంసి ఎంపి మహువా మొయిత్రా , కాంగ్రెస్ ఎంపి సంజనా జాతవ్, జ్యోతిమణి బారికేడ్లపైకి ఎక్కారు, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలకు దిగారు. ఈ దశలో వారిలో కొందరు సొమ్మసిల్లి పొయ్యారు. సమాజ్ వాది పార్టీ ఎంపి అఖిలేష్ యాదవ్ బారికేడ్లు దూకారు. ఆయనను ఇతరులు అనుసరించారు. ఈ దశలో అఖిలేష్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం అన్ని పరిమితులు దాటిందని, దీనిని ప్రజల దృష్టికి తీసుకువచ్చేందుకు తాము బారికేడ్లు దూకామని తెలిపారు. తనను ముందుగా పోలీసు జీపు ఎక్కించి తరువాత బస్సులో తీసుకువెళ్లారని ఈ దశలో రాహుల్ తెలిపారు. ఇప్పుడు జరిగింది జరుగుతున్నేది పూర్తి స్థాయి ఓట్ల చోరీ అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. మార్చ్‌లో ఎన్‌సిపి నేత శరద్ పవార్, డిఎంకె ఎంపి టిఆర్ బాలు, ఎస్ఎస్ యుబిటి ఎంపి సంజయ్ రౌత్, టిఎంసి నేతలు , వీరికి ముందుగా ప్రియాంక , అఖిలేష్ యాదవ్ , ఆర్జేడీ ఇతర పార్టీల ఎంపిలు కదిలారు. ఇండియా కూటమి సంఘటితం ఈ దశలో స్పష్టం అయింది.
సంతకంతో అఫిడవిట్ ఇస్తా: రాహుల్
తాను త్వరలోనే మొత్తం దేశానికి సంబంధించి ఎన్నికల ఓట్ల చౌర్యంపై కీలక వివరాలు వెలుగులోకి తీసుకువస్తానని రాహుల్ గాంధీ తెలిపారు. ఎన్నికల సంఘం తన నుంచి అఫిడవిట్ అడుగుతోంది. చెప్పినట్లుగానే తన ఆరోపణలతో, అక్రమాలపై తగు సాక్షాధారాలతో పూర్తి స్థాయిలోనే ఎన్నికల సంఘానికి అఫిడవిట్ అందిస్తామని తెలిపారు. ఇప్పుడు కర్నాటకలో బెంగళూరు సెంట్రల్ ఎంపి స్థానం అక్రమాలు ఇచ్చాం. ఇకపై దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో , మొత్తం మీద జరిగిన అధికారిక రిగ్గింగ్ వివరాలు ప్రజల ముందుకు తీసుకువస్తామన్నారు. అక్రమాలపై తన శాంపుల్ డేటా తన వ్యక్తిగతం కాదని, అందుకే సంతకం చేయలేదన్నారు.