ఆది నుంచీ కాళేశ్వరం ప్రాజెక్టు వివాదాలతో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. బిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ముహూర్తాన శంకుస్థాపన చేశారేమో కానీ ఆదిలోనే హంసపాదు అన్న చందంగా ఆరంభంనుంచే తీవ్రస్థాయిలో వ్యతిరేక ఉద్యమం లేచింది. మా భూములు లాక్కుంటున్నారంటూ, సరైన నష్టపరిహారమూ చెల్లించలేదంటూ రైతులు పెద్దఎత్తున ఉద్యమించారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులతో కలిసి ఉద్యమించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా వ్యవసాయ భూములు కోల్పోతున్న రైతులు తరచూ హైదరాబాద్‌కు రావడం, రేవంత్ రెడ్డిని తదితర కాంగ్రెస్ నాయకులను, ఇతర విపక్షాల నేతలను కలిసి మద్దతు కూడగట్టుకోవడం, ఇంకా ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది.
రైతులకు నష్టపరిహారం చెల్లించే భూములు తీసుకున్నామని, 90 శాతం రైతులు సానుకూలంగా ఉన్నారని ప్రభుత్వం చెబుతూ మొత్తానికి ప్రాజెక్టు నిర్మాణం (Construction project) పూర్తి చేసింది. అప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు కాళేశ్వరం వజ్రాయుధంగా మారిందనే చెప్పవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమి చెందినా, ఎన్నికలకు ముందు విపక్షాల పదునైన విమర్శల, ఆరోపణల బాణాలను ఎదుర్కొన్న ఎన్నికల తర్వాత కూడా వాడి, వేడి బాణాలను ఎదుర్కొనక తప్పడం లేదు. ఫలితాలు వెలువడిన కొన్ని రోజులకే మేడిగడ్డ బ్యారేజీకి పగుళ్ళు రావడంతోనే చిక్కంతా వచ్చింది. దీంతో సర్కారు దృష్టి అటుపడింది. ఎన్నికలకు ముందు రైతులతో ఉవ్వెత్తున ఉద్యమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి అవకాశం చిక్కినట్లు అయింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత పాటించలేదని, లోపభూయిష్టంగా ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, ప్రాజెక్టు నిర్మాణం అంచనాను అమాంతం పెంచేశారని దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిందేనని సిఎం ఎ. రేవంత్ రెడ్డ పట్టుబిగించారు. మంత్రివర్గంలో చర్చించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణకు నిర్ణయం తీసుకుని రిటైర్డ్ జడ్జి పినాకి చంద్ర ఘోష్ ఏకసభ్య కమిషన్‌ను నియమించడం చకచకా జరిగిపోవడంతో మరోసారి రాజకీయ దుమారం రేపింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై త్రిముఖ వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. ఒకవైపు బిఆర్ఎస్ను ఎండగట్టేలా ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతోపాటు జిల్లాలవారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించారు.
రెండో వ్యూహంలో నివేదికను అసెంబ్లీలో ప్రతిపాదించడంతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన కె. చంద్రశేఖర్ రావును అసెంబ్లీకి రప్పించడం. నివేదికపై చర్చ జరుగుతున్నప్పుడు సహజంగానే కెసిఆర్‌పై విమర్శల బాణాలను అధికార కాంగ్రెస్ సభ్యులు ఎక్కుపెడతారు. వాటిని ఎదుర్కొవడానికి, సమాధానాలు చెప్పుకోవడానికి కెసిఆర్‌కు రావాల్సిందేనన్నది రేవంత్ రెడ్డి వ్యూహం. ఒకవేళ కెసిఆర్ అసెంబ్లీకి రాకపోతే సమాధానాలు చెప్పలేకే సభకు రాలేదని మరోసారి దాడి చేసేందుకూ తమకు అవకాశం లభిస్తుందనేది ముఖ్యమంత్రి భావన అయి ఉండవచ్చు. ఇక మూడో వ్యూహం బిజెపిని ఇరకాటంలో పడేయ్యడమే. అసెంబ్లీలో బిజెపి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సానుకూలంగా లేదా వ్యతిరేకంగానైనా మాట్లాడక తప్పదు.
అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనంటూ సభ తీర్మానం చేసినట్లయితే బిజెపి తమ విధానాన్ని చెప్పక తప్పదు. తీర్మానాన్ని వ్యతిరేకిస్తే భవిష్యత్తులో బిజెపి, బిఆర్ఎస్ కలిసి పోటీ చేయనున్నాయన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయని కాంగ్రెస్ దాడి చేసేందుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఇప్పుడు బిజెపి ఎంపిగా ఉన్నారు కాబ్ట బిజెపి చల్లగా జారుకున్నదంటూ విమర్శించేందుకు కాంగ్రెస్‌కు అవకాశం దక్కుతుంది. ఈ రకంగా బిజెపినీ ఇరకాటంలో పడేయ్యవచ్చని ముఖ్యమంత్రి ఎత్తుగడ వేసి ఉంటారని కమలనాథుల అనుమానం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాన్ని ఛేదించేందుకు బిఆర్ఎస్ రంగంలోకి దిగింది. కెసిఆర్, మాజీ మంత్రులు కె. తారక రామారావు, టి. హరీష్ రావుతో మంతనాలు జరిపారు.
తెలంగాణ భవన్లో హరీష్ రావు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంకా జిల్లాల్లోనూ ఈ ప్రక్రియకు మొదలు పెట్టారు. కెటిఆర్ కూడా ఈ నివేదికపై స్పందిస్తూ 655 పేజీల నివేదికను 60 పేజీలకు ఎందుకు కుదించారని, నివేదిక తప్పుల తడకగా, ఏకపక్షంగా ఉందని, దీనిపై తాము ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామంటూ ఎదురు దాడికి దిగారు. అసెంబ్లీలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని, మాట్లాడుతున్నప్పుడు మైక్‌లు కట్ చేయవద్దని గట్టిగా చెప్పారు. అందుకు మంత్రులు స్పందిస్తూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని సభకు వచ్చి మాట్లాడించాలని లేదా కెసిఆర్‌ను ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను తప్పించి ఆ పదవిలోకి రావాలని కెటిఆర్‌కు సూచించారు. జ్యుడిషియరీ (ఘోష్) కమిషన్‌ను తప్పుపడుతూ న్యాయ వ్యవస్థనే అవమానిస్తారా? అని మంత్రులు ఉవ్వెత్తున లేచారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నాడు మంత్రివర్గం ఆమోదం లేదని, మామ- అల్లుడు కూర్చొని డిజైన్ రూపొందించి, సంతకాలు చేశారని ధ్వజమెత్తారు.
కెసిఆర్ ఇంజినీర్, మేస్త్రీ అన్నీ నిర్మాణం జరిపిస్తే మేడిగడ్డ కుంగిందని మంత్రులు ధ్వజమెత్తగా, వీటిని తిప్పికొట్టడంలో బిఆర్ఎస్ బిజీ అయింది. కెసిఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే అధికారపక్షం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని బిఆర్ఎస్ ఎదురు దాడి చేయడంలో నిమగ్నమైంది. అపర భగీరథుడు కెసిఆర్ అని, కాళేశ్వరం వల్ల లక్షలాది ఎకరాలకు నీరు అంది రైతులు సుఖశాంతులతో ఉన్నారని బిఆర్ఎస్ వాదన. ఇలా సవాళ్ళు- ప్రతిసవాళ్ళతో కాళేశ్వరం కలహాల ప్రాజెక్టుగా మారింది. బిఆర్ఎస్ను దోషిగా నిలబెట్టాలని అధికార కాంగ్రెస్ యత్నిస్తుండగా, ప్రజాక్షేత్రంలో కెసిఆర్ ప్రతిష్ఠను తగ్గించేందుకే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ ఎదురు దాడికి దిగింది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వాడి-వేడి వాగ్బాణాలు సంధించుకోవడానికి ఇరు పార్టీల నేతలు సమాయత్తమవుతున్నారు. ప్రజాక్షేత్రంలో ఎవరు, ఎవరిని దోషిగా నిలబెడతారో, అంతిమంగా న్యాయ నిర్ణేతలైన ప్రజలే నిర్ణయించుకుంటారు.
- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి
98499 98086