ఆడుతూ పాడుతూ పెరిగే బాల్యం కసాయిల చేతిలో బలైతే.. అమాయక దళిత, గిరిజనులేమో ఆధిపత్య సమాజం, చట్టాల చేతిలో బలవుతున్న సంఘటనలు కనబడుతున్నారు. పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వారి అమాయకత్వం కారణమైతే.. దళితులపై జరుగుతున్న దాడులకు వారి సామాజిక వెనుకబాటుతనం, అమాయకత్వం, బలహీనతలు కారణమవుతున్నాయి. పగ ప్రతీకారాలు, వ్యక్తిగత కక్షలు, డబ్బులకోసం చిన్నారులను దుండగులు హతమార్చుతున్నా రు. తల్లిదండ్రులకు గుండెకోతను మిగుల్చుతున్నారు. మద్యం మత్తు, అక్రమ సంబంధాలు, కుటుంబ కలహాలతో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులే పిల్లలను చిదిమేస్తున్నారు. కారణాలు ఏవైనా అటు పసి పిల్లలపై, ఇటు దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలు సమాజంలో మాయనిమచ్చలుగా మిగులుతున్నాయి.
ఇటీవల జగిత్యాల జిల్లా, కోరుట్ల పట్టణంలోని స్థానిక ఆదర్శనగర్ కాలనీలో హితీక్ష అనే ఐదు సంవత్సరాల అమ్మాయి హత్యనే ఇందుకు నిదర్శనం. (Murder proof) సాయంత్రం పాఠశాల అనంతరం ఇంటికి వచ్చి ఆడుకునేందుకు బయటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు పాప ఇంటి చుట్టుపక్కల ఇళ్లలో వెతకారు. పక్కనే నివసిస్తున్న విజయ్ అనే దళిత వ్యక్తి ఇంటి ఆవరణలోని స్నానాల గదిలో బాలిక విగతజీవిగా కనిపించింది. ఈ సంఘటనలో మెజార్టీ మీడియా, సామాన్య జనం, రాజకీయ నాయకులు, సామాజిక మాధ్యమాల్లో విజయ్‌ని నిందితుడిగా అనుమానించారు. పోలీసులను సైతం ఈ దారుణ ఘాతుకానికి ఒడిగట్టిన ఆయనను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ హత్య వెనుక అసలు కారణాలను జగిత్యాల ఎస్‌పి ఆధ్వర్యంలోని పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేయగా ఆ పాప సొంత చిన్నమ్మే నేరస్థురాలని తేలింది. ఈ విషయంలో కోర్టు తీర్పులు ఏ రకంగానైనా రావచ్చు కానీ, క్షేత్ర స్థాయిలో సమాజం మాత్రం దళితులను దోషులుగా చిత్రీకరిస్తోంది. దళితుల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యం కారణంగా సమాజం నేరగాళ్లగా చిత్రీకరించినట్లు ఈ కేసులో స్పష్టం అవుతుంది. వాస్తవంగా విజయ్ అనే దళితుడు తాగుడుకు బానిసయ్యాడు. ఇంటికి ఎప్పుడు వస్తాడో తెలియదు. అతడికి పెళ్లయినా భార్య, కుమార్తె వదిలివెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. ఈ నెపంతో అందరు అతడే హత్యకు పాల్పడ్డాడని ఆరోపణ చేశారు. కానీ పోలీసుల దర్యాప్తు అనంతరం బాలిక పిన్ని మమత స్వహస్తాలతో గొంతు కోసి హత్య చేసిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
దీనికి కారణం బెట్టింగ్‌లో ఆమె లక్షల డబ్బులు కోల్పోవడం, చిన్నారి హితీక్ష కుటుంబానికి దక్కుతున్న గౌరవం తమకు దక్కడపోవడమే. దీంతో ఆమె ఒక సైకోగా మారి తల్లిదండ్రులపై కోపంతోనే పాపను పొట్టనపెట్టుకున్నట్లు తేలింది. ఇప్పటికీ ఎక్కడైనా నేరం లేదా హత్య జరిగితే అగ్రవర్ణ సమాజం, పోలీసు వ్యవస్థ మొదట అమాయక దళితులను నేరస్థులుగా చూస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలో పోలీసుల అప్రమత్తత జై భీమ్, వెట్టియన్ సినిమాల హత్యను ఆపగలిగింది. జై భీమ్ సినిమాలో అన్యాయంగా అరెస్టు చేసిన గిరిజన మహిళ భర్త పోలీసుల చిత్రహింసలకు లాకప్ డెత్ అవుతాడు. ఈ చిత్రం కుల వివక్ష, పోలీసుల అకృత్యాలు, న్యాయవ్యవస్థలో ఎదురయ్యే సవాళ్లను వివరిస్తుంది. చివరికి ఆమె న్యాయపోరాటంలో గెలిచిన ఒక నిండు ప్రాణం అప్పటికే బలవుతోంది.
వేట్టయన్ సినిమాలో పాఠశాలలో గంజాయి వ్యవహారం గురించి ఎస్‌పి దృష్టికి తీసుకువచ్చిన శరణ్య అనే యువతి అనూహ్య పరిస్థితుల్లో మృత్యువాతపడుతుంది. ఆమె హత్య ఉదంతంలో దళిత యువకుడునే అనుమానితుడుగా చూస్తూ ఎస్‌పి ఎన్ కౌంటర్ చేస్తాడు. ఈ విషయంలో మానవ హక్కుల కమిషన్ దర్యాప్తులో యువతిని చంపిన స్థలంలో అసలు ఆ దళిత యువకుడు లేడని తేలింది. ఈ విషయం తెలుసుకొని ఎస్‌పి పశ్చత్తాపపడినా అప్పటికే ఒక నిండు ప్రాణం పోతుంది. ఇటీవల విడుదలైన 23 సినిమా సైతం దళితుల పట్ల వివక్ష, అన్యాయాన్ని ఎత్తిచూపుతుంది. వేల సంవత్సరాలనుంచి దళితులను పేదరికం, అస్పృశ్యత, అంటరానితనం వేధిస్తుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ వీరు ఆత్మగౌరవంగా బతకలేపోతున్నారు. కులవివక్షతో కనీస మానవ హక్కులు నిరాకరించిబడుతున్నాయి.
ఇంకా దళితులపై అమానవీయ దాడులు, పరువు హత్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు కుట్రపూరితంగా అగ్రకులాలు మరో కులంపై ఎగదోస్తూ నేరస్థులను చేస్తున్నారు. కొన్నిసార్లు వ్యక్తిగత పగతో మూకదాడులకు పాల్పడుతున్నారు. గ్రామాల్లో ఎలాంటి దాడులు జరిగినా పోలీసులు మొదట దళితుల్ని విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్‌లలో చిత్రహింసలకు గురిచేస్తూ నేరాన్ని ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నారు. ఒకానొక దశలో ఎలాంటి విచారణ లేకుండానే వారిపై నేర ముద్ర వేస్తున్నారు. గతంలో ఆరోపణలు, అనుమానాలతో విచారణ లేకుండా దళితులను ఎన్‌కౌంటర్ లో చంపిన సందర్భాలున్నాయి. ఈ సమాజం కూడా వారినే వేలెత్తి చూపుతుంది. మెజారిటీ పోలీస్ కేసులు, కోర్టు శిక్షలకు దళితులే బలైతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
దేశంలో న్యాయం జరగాలంటే కులం, రాజకీయ నేపథ్యం ప్రధానపాత్ర పోషిస్తుంది. ఇది ఒక రకంగా రాజ్యాంగం కల్పించిన సమానత్వం, సామాజిక న్యాయానికి విరుద్ధం. ఈ క్రమంలో దళితుల పట్ల సమాజం, పోలీసులకు దృక్పథం మారాల్సిన అవసరం. నేరం జరిగినప్పుడు దళితులపై ఆరోపణలువస్తే పోలీసులు చాలా జాగ్రత్తగా దర్యాప్తు చేయాలి. లేదంటే అమాయక దళితులు నేరస్థులయ్యే అవకాశం ఉందని కోరుట్ల బాలిక హత్య ఉదంతం తెలుపుతుంది. ఇక్కడ పోలీసుల అప్రమత్తతమే ఒక దళిత కుటుంబాన్ని కాపాడింది. కావున ప్రజల ఆరోపణలు, భావోద్వేగాలకు, ఒత్తిడికి తావులేకుండా శాస్త్రీయంగా విచారణ జరిపి నిందితులను తేల్చాలి. ఎన్ని చట్టాలు తెచ్చినా దళిత, గిరిజనులకు రక్షణ లేకుండా పోతుంది. తమ హక్కులేంటో తెలియక కునారిల్లుతున్న బాధితులకు రక్షణ కల్పించేవి చట్టాలే, వాటిని చేతిలోకి తీసుకోకూడదు. దళిత, గిరిజనుల పట్ల కొనసాగుతున్న వివక్షపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే వారి సాధికారతకు బీజం పడుతుంది.
- సంపతి రమేష్ మహారాజ్, 79895 78428