ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా భారతదేశం ఖ్యాతిని పొందింది. లక్షలాది మంది స్వేచ్ఛగా, నిష్పాక్షికమైన ఎన్నికల ద్వారా తమ నాయకులను ఎన్నుకునే శక్తివంతమైన ఎన్నికల ప్రక్రియకు చాలా కాలంగా ప్రశంసలు పొందింది. అయితే, ఓటర్ల జాబితాలో అవకతవకలు, జెర్రీ మాండరింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఇవిఎం) ట్యాంపరింగ్, సామాజిక సంక్షేమ పథకాల దుర్వినియోగం వంటి ఆరోపణలతో ఇటీవల ప్రజాస్వామ్య ఛట్రం సమగ్రతపై నీలినీడలు కమ్మేశాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన ఈ వాదనలు, ఎన్నికల మైదానాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అధికార బిజెపి క్రమబద్ధమైన పద్ధతిలో చేస్తున్న ప్రయత్నాలను సూచిస్తున్నాయి. ఈ వ్యాసం ఈ ఆరోపణలను లోతుగా చర్చించి, భారత ప్రజాస్వామ్యంపై వాటి ప్రభావం, ఎన్నికల ప్రక్రియలో ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు చేయాల్సిన తక్షణ సంస్కరణలను పరిశీలిస్తుంది.
ఈ వివాదానికి కేంద్ర బిందువు. పెద్ద ఎత్తున ఓటర్ల జాబితా తారుమారు జరిగాయనే ఆరోపణలు. 2025 ఆగస్టు 7న రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో (press conference) ప్రత్యేక ఆధారాలు సమర్పించారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌పై దృష్టి సారించిన రాహుల్, కాంగ్రెస్ పార్టీ పరిశీలన బృందం లక్షకు పైగా మోసపూరిత ఓటర్ల నమోదును వెలికితీసినట్లు పేర్కొంది. ఈ ఎంట్రీలను ఐదు రకాలుగా వర్గీకరించారు. నకిలీ ఓటర్లు లేదా చెల్లని చిరునామా గల ఓటర్లు, ఒకే అడ్రస్‌లో నమోదు చేసుకున్న బల్క్ ఓటర్లు, గుర్తించలేని ఫోటోలు ఉన్న ఓటర్లు, నకిలీలు, మొదటిసారి ఓటర్లను నమోదు చేసే ఫారం 6 దుర్వినియోగం. పేర్కొన్న ఉదాహరణలు ఆందోళనకరంగానే ఉన్నాయి. గుర్కీరత్ సింగ్ డాంగ్ అనే వ్యక్తి ఒకే చిరునామాలో ఓటరు జాబితాలో నాలుగు సార్లు కన్పించగా, ఆదిత్య శ్రీవాస్తవ అనే వ్యక్తి ముంబై, లక్నో, బెంగళూరులోని రెండు బూత్‌లతో సహా పలు నగరాలలో ఓటు వేసేందుకు నమోదు చేసుకున్నాడు.
ఒక సందర్భంలో ఒకే గది ఉన్న ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నట్లు జాబితాలో పేర్కొన్నారు. ఒక ఓటరు చిరునామా, తండ్రి పేరులో మిస్టర్ డిఫోజ్ గైడ్స్ అనే అర్థరహితమైన పదం చేర్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటం 70 ఏళ్ల శకున్ రాణి అనే మహిళ కొత్త ఓటర్‌గా నమోదు చేసుకోవడం, రెండుసార్లు ఓటు వేసే అవకాశం లభించడం. ఈ ఆరోపణలు కర్ణాటకకే పరిమితం కాలేదు. తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్), సమాజ్ వాదీ పార్టీ వంటి ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో ఇలాంటి ఆందోళనలు తలెత్తాయి. మహారాష్ట్రలో, 2024 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య కేవలం ఐదు నెలల్లోనే 39 లక్షల మంది అదనపు ఓటర్లను ఓటర్ల జాబితాలో చేరారని కాంగ్రెస్ ఆరోపించింది, ఐదేళ్లలో ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు నమోదు కాలేదు.
పశ్చిమ బెంగాల్లో, 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నకిలీ ఓటర్లను ఎన్నికల జాబితాలో అక్రమంగా చేరుస్తుననారని, ముర్షిదాబాద్ జిల్లాలో 129 మంది ఓటర్లు, ఇతర రాష్ట్రాల ఓటర్లతో నకిలీ ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డు నంబర్లను పంచుకుంటున్నారని టిఎంసి నాయకురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత భారత ఎన్నికల కమిషన్‌దే. (ఇసిఐ) అయితే ఇసి ఈ ఆరోపణలపై స్పందించకపోవడంతో తీవ్రవిమర్శలు ఎదురయ్యాయి. మహదేవపుర విషయంలో ఇసిఐ ప్రతిస్పందన, ఫాస్ట్ చెక్ చేయబడిన ట్వీట్, ఈ ఆరోపణలను పరిష్కరించడంలో విఫలమైంది. ప్రతిగా చర్య ప్రారంభించడానికి గాంధీ సంతకం చేసిన ప్రమాణ పత్రాన్ని సమర్పించాలని డిమాండ్ చేసింది. ఇసిఐ ప్రతిస్పందన పట్ల విమర్శలు వెల్లువెత్తాయి.
ఇది ఎన్నికల కమిషన్ నిష్పాక్షికత, పారదర్శకత పట్ల ప్రశ్నలను లేవనెత్తింది. ఆటోమాటెడ్ విశ్లేషణ ద్వారా లోపాలు గుర్తించడానికి వీలు కల్పించే యంత్రాలతో చదువగలిగే ఓటర్ల జాబితాను అందించేందుకు నిరాకరించడం మరిన్ని అనుమానాలను రేకెత్తించింది. కాంగ్రెస్ మీడియా, ప్రచారవిభాగం చైర్మన్ పవన్ ఖేరా ఇసిఐ పేర్కొన్న నాన్ -మిషన్ రీడబుల్ పేపర్ రోల్స్‌ను ఏడు అడుగుల కాగితంగా అభివర్ణించారు. దాని పరిశీలన దాదాపు అసాధ్యం, కేవలం ఒక నియోజకవర్గం డేటా విశ్లేషణకే నెలలు పడుతుంది. ఓటర్ల జాబితా తారుమారుకి తోడు, గెర్రీమాండరింగ్ ఆరోపణలు ఆందోళనను పెంచాయి. ఒక పార్టీకి అనుకూలంగా నియోజకవర్గ హద్దులను తారుమారు చేసే పద్ధతి గెర్రీమాండరింగ్. ఎన్నికల్లో ప్రయోజనాలను పొందేందుకు అధికార బిజెపి ఈ సాధనాన్ని ఉపయోగిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.
బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఓటర్ల జాబితా అలాంటి అవకతవకలకు తోడ్పడే సాధనంగా గుర్తించారు. తమకు అనుకూలమైన పలితాలు రాబట్టేందుకు నియోజకవర్గాల రూపురేఖలు మార్చేందుకు బిజెపి వ్యూహాత్మకంగా కొత్త ఓటర్లను చేర్చడమో, తొలగించడమో చేస్తుందని ప్రతిపక్షనాయకులు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు, పశ్చిమబెంగాల్లోని బంగ్లాదేశ్ హిందూ శరణార్థులను, భాషా మైనారిటీల పేర్లను తొలగించేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని టిఎంసి పార్టీ ఆరోపిస్తోంది. గెర్రీమాండరింగ్ పార్టీలు పోటీపడే ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది. అక్కడ ఓటర్ల జనాభాలో చిన్నమార్పు ఫలితాలను నిర్ణయించే అవకాశం ఉంటుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి 33 వేల కన్నా తక్కువ ఓట్ల తేడాతో 25 సీట్లు గెలుచుకుందని రాహుల్ హైలైట్ చేశారు. తక్కువ సంఖ్యలో నియోజకవర్గాలను తారు మారు చేయడం ద్వారా పార్లమెంటులో మెజారిటీ పొందవచ్చునని సూచించారు. డీలిమిషన్ ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం, ఈ సమస్య పరిష్కారానికి ఇసిఐ విముఖత చూస్తే, అధికార పార్టీ ఎన్నికల సరిహద్దులు తనకు అనుకూలంగా మార్చి, పాలనా ప్రక్రియపై తన ప్రభావం చూపుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.
భారత ఎన్నికలలో ఇవిఎం ట్యాంపరింగ్ ఆరోపణలు ఎంతో కాలంగా వివాదాస్పదంగా మారాయి. ఈ మధ్య ఓటర్ల జాబితా తారుమారు కీలక అంశం అయింది. కాంగ్రెస్‌కు చెందిన ప్రవీణ్ చక్రవర్తి వంటి ప్రతిపక్ష నాయకులు ఇవిఎంల ట్యాంపరింగ్‌కు ఓటర్ల జాబితాలకు మధ్య తేడా గుర్తించారు. ఇవిఎంల ట్యాంపరింగ్‌కు కచ్చితమైన ఆధారాలు లేవు. జాబితా మోసంపై బలమైన ఆధారాలు కన్పిస్తాయి. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇవిఎంల గురించి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అక్కడ మహాయతి కూటమి విజయం ప్రతిపక్షాలు, కార్యకర్తల్లో సందేహాలు రేపింది. సాయంత్రం 5.-30 గంటల నుంచి అకస్మాత్‌గా పెరిగిన ఓటర్లు, ఓటింగ్ డేటాలో తేడాలపై నివేదికలు ఆందోళనను పెంచాయి. పోలింగ్ స్టేషన్లలో సిసిటివి ఫుటేజీని 45 రోజుల తర్వాత తొలగించాలన్న ఇసిఐ నిర్ణయం అక్రమాలకు సంబంధించిన ఆధారాలు నాశనం చేసే యత్నంగా విమర్శలపాలైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ వాదనలను ఖండించారు.
ఇవిఎంలు ఫుల్ ప్రూఫ్ అన్నారు. పోలింగ్ ఏజెంట్లకు ఇచ్చిన ఫామ్ 17సి లోని నిబంధనలవల్ల ఓటర్ల ఓటింగ్‌లో తారుమారు అసాధ్యం అన్నారు. ఇసిఐ తిరస్కార ధోరణి, ధిక్కార స్వరం ప్రజల అనుమానాలను తీర్చలేకపోయింది. ఓట్ల లెక్కింపులో పారదర్శకతను నిర్ధారించే వివి పాట్లను విస్తృతంగా ఉపయోగించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోవడం ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని క్షీణింపజేస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేస్తున్నాదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యక్ష నగదు బదిలీ, సబ్సిడీతో ఆహారం, ఇళ్ల నిర్మాణ పథకాలు, బిజెపి విస్తృత సంక్షేమ కార్యక్రమాలను ఓటర్లను, ముఖ్యంగా గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలను ఆకట్టుకునే సాధనాలుగా విమర్శకులు చూస్తున్నారు.
ఈ పథకాలు పేదల స్థితిగతులను మెరుగుపరచేందుకే అని చెబుతున్నా ప్రతిపక్షపార్టీలు మాత్రం వ్యూహాత్మకంగా ఎన్నికలే లక్ష్యంగా సరైన సమయంలో ప్రవేశపెడుతున్నారని వాదిస్తున్నాయి. ఎన్నికల ప్రకటనకు కొత్త పథకాల ప్రకటన కేవలం ఓటు కొనుగోలు వ్యూహంగా రుజువవుతున్నాయి. ఓటర్ల జాబితా తారుమారు, జెర్రీ మాండరింగ్, ఇవిఎం ఆందోళనలు, సంక్షేమ పథకాల దుర్వినియోగాల ప్రభావం భారత ప్రజాస్వామ్య ప్రక్రియ చట్టబద్ధతకు తీవ్ర ముప్పును కలిగిస్తున్నాయి. రాజ్యాంగం ఆర్టికల్ 326లో పొందుపరచిన సార్వత్రిక వయోజన ఓటుహక్కు సూత్రం నుంచి ఎన్నికల చట్టబద్ధత రూపుదిద్దుకుంది. ఓటర్ల జాబితాలో మోసపూరిత ఎంట్రీలతో కలుషితమైనప్పుడు నియోజకవర్గాల మార్పులు ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రభుత్వ వనరులు ఉపయోగించినప్పుడు ఒకవ్యక్తి, ఒక ఓటు అనే ప్రాథమిక ఆలోచన బలహీనమవుతుంది. రాహుల్ గాంధీ హెచ్చరించినట్లు రిఫరీ తటస్థంగా లేకపోతే క్రీడ లేదు. ఎన్నికల కమిషన్ నిష్పాక్షికంగా లేకపోతే ప్రజాస్వామ్యం లేదు.
ఈ సమస్యలను నేరుగా పరిష్కరించడానికి ఇసిఐ విముఖత చూపడం, ప్రజల అపనమ్మకాన్నిమరింత పెంచింది. ఆరోపిస్తున్నవారిని ప్రమాణ పత్రాలను ఇవ్వాలనడం, లాంఛనాలపై కమిషన్ పట్టుదల, మిషిన్ -రీడబుల్ ఓటర్ల జాబితాలు, సిసిటివి వీడియో రికార్డింగ్లపై 45 రోజుల గడువు విధించడం, పారదర్శక చర్యలను నిరాకరించడం ఎన్నికల వ్యవస్థ పక్షపాత ధోరణితో ఉందన్న ఆరోపణలకు దారితీసింది. బిజెపి ఈ ఆరోపణలను ఓటమి పాలైన ప్రతిపక్షం నిరాశ నిసృ్పహలతో చేసే విమర్శలుగా కొట్టివేస్తే, రవిశంకర్ ప్రసాద్, దేవేంద్ర ఫడ్నవీస్ వంటి వారు ప్రజల తీర్పును కాంగ్రెస్ అవమానిస్తోందని ఆరోపించారు. అయినా బహుళ ప్రతిపక్ష పార్టీలు, పౌరసమాజం, స్వతంత్ర దర్యాప్తు సంస్థలనుంచి ఆందోళనలు పెరుగుతూనే ఉన్నాయి. భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు తక్షణ సంస్కరణలు అవసరం.
మొదట ఇసిఐ యంత్రాలతో చదువగలిగే ఓటర్ల జాబితాలను విడుదల చేయాలి. స్వతంత్ర పరిశీలనకు సిసిటివి ఫుజీలను భద్రపరచడం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వడం, ఓటర్ల నమ్మకాన్ని పెంచేందుకు ట్యాంపర్ ప్రూఫ్ రికార్డులను అందించడం. రెండవది. తటస్థ ఏజెన్సీల ద్వారా ఓటర్ల జాబితా థర్డి పార్టీ ఆడిట్లో లోపాలు గుర్తించి సరిదిద్దడం. మూడవది 1951 నాటి ప్రజాప్రాతినిధ్యం చట్టానికి చట్టపరమైన సంస్కరణలు. ఎన్నికల మోసానికి కఠిన శిక్షలు విధించాలి. చివరిగా టిఎంసి, సమాజ్ వాది పార్టీ వంటివి సూచించిన ప్రజా అవగాహన ప్రచారాలు చేపట్టడం. ఇసిఐ రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా ఎదగాలి. నిష్పాక్షికతకు నిదర్శనంగా నిలవాలి, పౌరులు, జర్నలిస్ట్‌లు, పౌరసమాజం ఈ వాదనల పరిశోధనలో పాల్గొంటున్నందువల్ల ఎన్నికల సమగ్రత కోసం పోరాటం ప్రజల ఉద్యమంగా మారుతోంది. ఎన్నికల కమిషన్ నిర్వహించే ఎన్నికలు ప్రజల సంకల్పానికి నిజమైన ప్రతిబింబంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు భారతదేశం వేగంగా చర్యలు తీసుకోవాలి.
- గీతార్థ పాఠక్ (ఈశాన్యోపనిషత్)
- రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు