తమిళనాడులో 70 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులకు ‘ముఖ్యమంత్రి తాయుమానవర్(తల్లి) పథకం’ కింద ఇంటి వద్దకే రేషన్ సరకులు డెలివరీ చేసే విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. దీనివల్ల 21 లక్షల మంది ప్రయోజనం పొందుతారని, ఇది తన హృదయానికి నచ్చిన పథకం అని ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ అన్నారు. లబ్ధిదారుల ఇంటివద్దకే సరకులు తీసుకెళ్లే వాహనాలకు జెండా ఊపి ఆయన మరీ ఈ పథకాన్ని ప్రారంభించారు. అంతేకాదు ఆయన కొందరు లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి సరకులు అందించారు. వృద్ధులు, వికలాంగులు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకునే ఆయన ఈ పథకాన్ని ఆరంభించారు.
ఈ పథకాన్ని ఆరంభించినందుకు తనకు ఆనందంగా ఉందని స్టాలిన్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ పథకాన్ని తమిళనాడులోని 34,809 ఫెయిర్ ప్రైస్ షాప్స్‌లో అమలుచేస్తున్నారు. దీనివల్ల 21,70,454 మందికి లబ్ధి చేకూరనున్నది. వీరిలో చాలా వరకు వృద్ధులేనని చెప్పాలి. ఈ పథకంలో అదనంగా వచ్చే రూ. 30.16 కోట్లను మేము ఖర్చుగా భావించడంలేదు, ఇంటివద్దకే సరకులు అనే విషయంలో తమిళనాడు ‘మార్గదర్శకం’ అన్నారు. తమిళనాడులో రేషన్ దుకాణాలు మొత్తం 37328 ఉన్నాయి. వీటిలో గత నాలుగేళ్లలో చేర్చిన 2,394 షాపులు డిఎంకె ప్రభుత్వ హయాంలో చేర్చినవేనన్నారు. నేడు తమిళనాడులో ఆకలి చావులు లేవని సగర్వంగా తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ఇంటివద్దనే రేషన్ సరకులను సిబ్బంది అందిస్తారని కూడా స్టాలిన్ స్పష్టం చేశారు.