క్రికెట్ అంటే జెంటిల్‌మెన్స్ గేమ్ అని అంటారు. ఆటలో ప్రతీ దశలోనూ క్రీడాస్పూర్తిని చూపించాలి. అలా కాదని కొందరు ఓవరాక్షన్ చేస్తుంటారు. అలాంటి వాళ్లకు శిక్షను ఎదురుకోక తప్పదు. తాజాగా టీం ఇండియా ఆటగాడు హర్షిత్ రాణాకు (Harshith Rana) ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. ఈ లీగ్‌లో రాణా నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
సోమవారం రాత్రి నార్త్ ఢిల్లీ.. వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. సార్థక్ రంజన్ 42, అర్జున్ రాప్రియా 40 పరుగులు చేశారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన వెస్ట్ ఢిల్లీ టార్గెట్‌ని చేరుకోవడంలో విఫలమైంది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేసింది. దీంతో నార్త్ ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.
అసలు విషయానికొస్తే.. వెస్ట్ ఢిల్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మూడో ఓవర్లో హర్షిత్ రాణా (Harshith Rana) బౌలింగ్ చేసేందుకు వచ్చి.. ఆయుశ్ దోసాంజేను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే మైదానం నుంచి వెళ్లిపోతున్న ఆయుశ్‌ని చూసి హర్షిత్ ఓవరాక్షన్ చేశాడు. ‘‘వెళ్లు.. వెళ్లు’’ అంటూ వేలితో సైగ చేశాడు. దీన్ని లీగ్ నిర్వాహకులు తీవ్రంగా పరిగణించారు. డిపిఎల్ ప్రవర్తనా నియవావళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం.. ఇలా చేయడం నేరం. ఇందులో లెవల్ 1 తప్పిదం పాల్పడినట్లు హర్షిత్ రిఫరీ ముందు అంగీకరించాడు. దీంతో అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు.