హైదరాబాద్: వర్షాలు, వరదలపై మీడియా ద్వారా సమాచారం చేరవేయాలని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సిబ్బందిని అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మంగళవారం సిఎం జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ వర్షాల దృష్ట్యా వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకొని పని చేయాలని తెలిపారు. భారీ వర్షాలు ఉన్న జిల్లాలకు ముందే సిబ్బందిని తరలించాలని అన్నారు. ఆయా జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖల ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలని ఆదేశించారు.
అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేయాలని రేవంత్ (Revanth Reddy) అన్నారు. వైద్యులు అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. హైదరాబాద్‌లో వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా చూడాలని స్పష్టం చేశారు. కంట్రోల్ రూమ్ ద్వారా అధికారులను అప్రమత్తం చేయాలని తెలిపారు. భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో సీనియర్ అధికారులను నియమించాలని అన్నారు.