Wednesday, August 13, 2025

రాష్ట్రంలో రూ.600 కోట్ల కోడిగుడ్ల కుంభకోణం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.600 కోట్ల కోడిగుడ్ల కుంభకోణానికి తెరలేపిందని బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గురుకులాలు ఇతర పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే కోడిగుడ్ల ధరను కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5.50పైసల నుండి 7 రూపాయలకు పెంచిందని, గతంలో ఇచ్చిన కోడిగుడ్ల బరువు 50 నుండి 60 గ్రాములు ఉండగా, ప్రస్తుతం ప్రభుత్వం కోడిగుడ్ల బరువు 42 నుండి 50 గ్రాములకు తగ్గించిందని పేర్కొన్నారు. గతంలో కోడిగుడ్ల కంట్రాక్టు రావాలంటే ఎలాంటి వార్షిక టర్నోవర్ చూపించాల్సిన అవసరం ఉండేది కాదని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం టర్నోవర్ కనీసం 3 కోట్లు ఉన్న వారికే కాంట్రాక్టు ఇచ్చేలా జిఒ 17 తీసుకొచ్చిందని అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో టెండర్ ఫాం కేవలం 500 నుండి 1000 రూపాయలు ఉండేదని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్ ఫాం ధరను రూ. 25000కు పెంచిందని పేర్కొన్నారు.

గతంలో ఎస్‌సి, ఎస్‌టి కాంట్రాక్టర్లకు ఇ.ఎమ్.డిలో 40 శాతం రాయితీ ఉండేదని, కానీ ప్రస్తుత రేవంత్ సర్కార్ ఆ రాయితీని తొలగించిందని ఆందోళన వ్యక్తం చేశారు. పేద వర్గాలు, చిన్న వ్యాపారులు కాంట్రాక్టర్లుగా ఉండకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని, అందుకే టెండర్ నిబంధనలు కొత్తగా బడా కాంట్రాక్టర్లతో కలిసి కఠినంగా రూపొందిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న జానారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మెఘా కృష్ణ రెడ్డి,మాజీ ఎంపి రంజిత్ రెడ్డి, ఆంధ్ర ప్రాంతానికి చెందిన సిఎం రమేష్ వర్గీయులకే టెండర్లు వచ్చేలా రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తుందని అన్నారు. గతంలో స్థానికంగా ఉండే పేదలకు కాంట్రాక్టర్లుగా అవకాశం ఇచ్చేవారని, కానీ ఇప్పుడు మండలాన్ని ఒక యూనిట్‌గా చేసి ఒక్కరికే కాంట్రాక్ట్ ఇచ్చేలా నిబంధనలు మార్చారని చెప్పారు. జిఒ 17 వల్ల సుమారు 20 వేల మంది పేద వర్గాల కాంట్రాక్టర్లు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో క్యాటరింగ్ కాంట్రాక్టుకు కేవలం 75 వేల డిపాజిట్ చేయాల్సి ఉండేది, కానీ ఇప్పుడు సుమారు 5 లక్షల డిపాజిట్,వార్షిక టర్నోవర్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని తెలిపారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో టెండర్ ఆధారంగా అర్హులైన వారికి కాంట్రాక్ట్ లభించేదని, కానీ ఇప్పుడు వైన్ షాపుల మాదిరిగా లాటరీ తీసే పద్ధతిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. గతంలో టెండర్ వెరిఫికేషన్ అధికారం పాఠశాల ప్రిన్సిపల్ చేతిలో ఉండేదని, ఇప్పుడు కలెక్టర్ చేతికి అప్పగించడంతో, కలెక్టర్లు కూడా కమీషన్లు అడుగుతున్నారని తెలుస్తుందని అన్నారు. గతంలో 2 నెలలకు ఒకసారి కాంట్రాక్టర్లకు బిల్లులు వచ్చేవని, కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ 4 నెలలు దాటినా బిల్లులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఎస్‌సి,ఎస్‌టి, బిసి పేద వర్గాలకు చెందిన కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు రాకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. చేవెళ్ల డిక్లరేషన్‌లో ఎస్‌సి,ఎస్‌టిలకు 25 శాతం ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామని చెప్పి, ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. మల్లి ఖార్జున ఖర్గే రేవంత్ రెడ్డిని ఎందుకు నిలదీయడం లేదని అడిగారు. భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో కెసిఆర్ ప్రభుత్వం పేదలను ధనవంతులుగా చేయాలని కాంట్రాక్టులు ఇచ్చి,రాయితీలు ఇచ్చి,టర్నోవర్ సర్టిఫికెట్ అడగకుండా అన్ని అవకాశాలు ఇచ్చిందని తెలిపారు.

అలాగే దళిత బంధు,బిసి బంధు వంటి పథకాలు పెట్టి లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి పారిశ్రామికవేత్తలుగా చేసే ప్రయత్నం చేసిందని అన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను విస్మరించి, కేవలం ధనికులనే ఇంకా ధనవంతులుగా చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 103 మంది విద్యార్థులు మరణించారని, చాలా చోట్ల వందల సంఖ్యలో విషాహార ఘటనలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటేనే కుంభకోణం,కమీషన్లు,కేసులు అని మండిపడ్డారు. 20 వేల మంది పేద కాంట్రాక్టర్ల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిఒ 17 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే అన్ని కలెక్టరేట్ ఆఫీసుల ముందు ధర్నాలు చేపడుతామని హెచ్చరించారు. కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు అడిగే కలెక్టర్లపై ఛీఫ్ సెక్రటరీ,ఎసిబి,విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. జిఒ 17 రద్దు కోసం కోర్టును కూడా ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వం అని, అందుకే మల్లీ కెసిఆర్ సర్కార్ రావాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News