వారసత్వంగా వచ్చిన భూమిని విరాసత్ చేయడానికి రెవెన్యూ అధికారులు నిరాకరించడంతో అసహనానికి గురైన ఒక యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా, కుల్కచర్ల మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని ఘనపూర్ గ్రామానికి చెందిన కామునిపల్లి రాములు కుల్కచర్లలో అసైన్మెంట్ భూమి సర్వే నెంబర్ 626/6, 626/1లో 8 ఎకరాలు కలిగి ఉన్నాడు. 2019లో రాములు మరణించాడు. కాగా, అతని వారసత్వంగా రాములు భార్య నర్సమ్మకు విరాసత్ చేసేందుకు 2025 జూన్ 23న భూభారతి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నారు.
విరాసత్ చేయాల్సిందిగా కోర్టు నుండి ఆర్డర్ కాపీ కూడా తెచ్చుకున్నారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. ఎన్నోసార్లు తహశీల్ కార్యాలయం చుట్టూ తిరిగినా తమకు రిజిస్ట్రేషన్ చేయడం లేదని అసహనానికి లోనైన రాములు కొడుకు నందకుమార్ (28) తహశీల్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన చుట్టుపక్కల వారు గమనించి పెట్రోల్ బాటిల్ తీసుకొని అతనిని రక్షించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈ అంశంపై తహసిల్దార్‌ను వివరణ కోరగా ఆ సర్వే నెంబర్లపై పిఓటి ఉందని ఉండడంతో బాధితుల దరఖాస్తును ఆర్‌డిఒకు పంపించామని తెలిపారు.