Wednesday, August 13, 2025

తెలంగాణపై కేంద్రం శీతకన్ను

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపించింది. కేవలం ఎన్‌డిఎ పాలిత రాష్ట్రాలకు మాత్రమే తాయిలాలు అందిస్తూ ఇండియా కూటమి రాష్ట్రాలకు ఎలాంటి ప్రాజెక్టులు ఇవ్వడం లేదు. తాజాగా మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఏపీ, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలకు సెమీ కండక్టర్ల పరిశ్రమలు మంజూరు చేసింది. అలాగే లక్నో మెట్రో ఫేజ్-1కు కూడా అనుమతులు ఇచ్చింది. అయితే మెట్రో అనుమతులపై తెలంగాణ రాష్ట్రానికి మరోసారి నిరాశే ఎదురైంది. హైదరాబాద్ మెట్రో 2వ దశ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడానికి మొండికేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సహా కాంగ్రెస్ మంత్రులు ఎన్నిసార్లు కేంద్రానికి వినతిపత్రాలు సమర్పించినా పెడచెవిన పెడుతోంది. గత ప్రభుత్వ హయాంలో కూడా మెట్రో రెండో దశ ఫేజ్ పనులకు అనుమతి ఇవ్వాలని ఎన్నోసార్లు కేంద్రానికి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. అలాగే పద్మ పురస్కారాల ఎంపికలో సైతం తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఇది అవమానమని రేవంత్‌రెడ్డి ఏకంగా ప్రధానికి
లేఖ రాయాలని కూడా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

తెలంగాణపై బీజేపీ వివక్ష :
ఒకే దేశం… ఒకే ఎన్నిక’.. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పే నినాదాలు ఎంతో ఆకర్షణగా ఉంటాయి. అయితే ఆచరణలోకి వచ్చేసరికి రాష్ట్రాలకు ఆపన్న హస్తం అందించాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన హక్కులను పదకొండేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రాజెక్టులు, నిధుల కోసం సంప్రదించడం భిక్ష కాదు. అది బాధ్యతాయుతమైన హక్కుగా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక నిధులను కేంద్రం ఇవ్వలేదు. రాష్ట్రంలోని ఏ ఒక్క నీటి ప్రాజెక్టుకూ జాతీయ హోదా దక్కలేదు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఊసే ఎత్తడం లేదు. లక్షలాది ఉద్యోగాల కల్పనకు దోహదపడే ఐటీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్, ఐఐఎం మర్చేపోయారు. పదకొండేళ్ల బీజేపీ ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రతిసారీ అన్యాయమే చేస్తున్నారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఆర్థిక వనరులను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశ జీడీపీలో 5.1 శాతం తెలంగాణ వాటా ఉండగా ఇందులో 2.10 శాతమే తిరిగి తెలంగాణకు వస్తోంది.

సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం నిల్ :
తెలంగాణలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే ఎలక్ట్రానిక్స్ పార్కులను ఏర్పాటు చేయాలని, కొత్త రైలు మార్గాలను మంజూరు చేయడంతో పాటు రీజినల్ రింగ్ రైల్‌కు త్వరగా అనుమతివ్వాలని, కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి వైష్ణవ్‌కు సీఎం రేవంత్ వినతిపత్రాలు అందచేశారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఉందని, ప్రపంచ స్థాయి పరిశోధనలు, అభివృద్ధి కేంద్రాలు రాష్ట్రంలో ఉన్నాయని, వీటిని పరిగణనలోకి తీసుకుని అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ (ఏఎ్‌సఐపీ) ప్రాజెక్టు, మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఫ్యాబ్ ప్రాజెక్టు, క్రిస్టల్ మ్యాట్రిక్స్‌కు ఆమోదం తెలపాలని కోరారు. అలాగే ఈఎమ్‌సీ 2.0 పథకం కింద రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ వినతిని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రీజనల్ రింగు రోడ్డు సమీపంలో నూతన ఎలక్రా్టనిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

రీజనల్ రింగ్ రైల్‌కు అనుమతి ఏదీ :
తెలంగాణలో రైలు మార్గాల అనుసంధానాన్ని మరింత పెంచేందుకు నూతన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కూడా రైల్వే శాఖ మంత్రి కూడా అయిన అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రీజనల్ రింగు రోడ్డుకు సమాంతరంగా రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించామని, రైల్వే బోర్డు ఇప్పటికే తుది లొకేషన్ సర్వేకు అనుమతి ఇచ్చిందని, రూ.8,000 కోట్ల ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ ప్రాజెక్టుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానం పెరగడంతోపాటు నగరంలోని ప్రధాన స్టేషన్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని వివరించారు. హైదరాబాద్ డ్రై పోర్టు నుంచి బందరు ఓడ రేవుకు అనుసంధానంగా రైలు మార్గం మంజూరు చేయాలని కోరారు. ఔషధాలు, ఎలక్రా్టనిక్ పరికరాలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తుల ఎగుమతులకు ఈ మార్గం దోహదపడుతుందని చెప్పారు.

తెలంగాణలో రైల్వే ఆపరేషన్లను మరింత సమర్థంగా నిర్వహించేందుకు కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందుతాయని, అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించడంతోపాటు పారిశ్రామిక, వ్యవసాయ ఎగుమతులు, దిగుమతుల కోసం, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నూతన రైలు మార్గాలు మంజూరు చేయాలని కోరారు. స్మార్ట్ సిటీకి అవసరమైన నీటి సరఫరా విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలకు ఆర్థిక సాయం అందించాలని అడిగారు. హైదరాబాద్ – బెంగూళూరు ఏరో డిఫెన్స్ కారిడార్ మంజూరు చేయాలని కోరారు. అలాగే హైద్రాబాద్ – విజయవాడ పారిశ్రామిక కారిడార్ ఫిజిబిలిటీని అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. అయినప్పటికీ కేంద్రం పట్టించుకోకపోవడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News