మన తెలంగాణ/మేడ్చల్: బైక్ పై వెళ్తున్న వ్యక్తి లారీ కింద పడి దుర్మరణం చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వెనుక నుండి వచ్చిన లారీ బైకును ఢీ కొట్టడంతో అదే లారీ టైర్ల కింద పడి వాహనదారుడు అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలి జిల్లా వేమూరు మండలం చంపాడు గ్రామానికి చెందిన కేసాని మధు(50) బతుకుదెరువు కోసం మేడ్చల్ కు వలస వచ్చాడు. కేఎల్‌ఆర్ వెంచర్ లో నివాసం ఉంటూ మేడ్చల్ పారిశ్రామిక ప్రాంతంలోని సంప్రీ న్యూట్రిషియన్స్ కంపెనీలో పని చేస్తున్నాడు.
సోమవారం రాత్రి విధులకు వెళ్లిన మధు విధులు ముగించుకొని, మంగళవారం ఉదయం 8ః45 గంటలకు ఇంటికి బైక్ పై బయల్దేరాడు. మేడ్చల్ లోని వివేకానంద విగ్రహం వద్దకు రాగానే వెనుక నుంచి అతివేగంగా వస్తున్న లారీ కుడివైపు ఉన్న హ్యాండిల్ కు తగలడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మధు లారీ చక్రాల కిందకు వెళ్లిపోయాడు. ఆయన మీద నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.