రెండో టి20లో సౌతాఫ్రికా ఘన విజయం
డ్రావిన్: జూనియర్ ఎబిడిగా పేరు తెచ్చుకున్న సౌతాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో విధ్వంసక సెంచరీతో చెలరేగి పోయాడు. దీంతో ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 53 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో డెవాల్డ్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియా గడ్డపై టి20ల్లో అత్యంత వేగంగా శతకం సాధించిన బ్యాటర్, అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా, అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా బెవాల్డ్ రికార్డులు నెలకొల్పాడు.
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 17.4 ఓవర్లలో కేవలం 165 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన సౌతాఫ్రికా సిరీస్‌ను 11తో సమం చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు ఐడెన్ మార్‌క్రమ్ (18), రికెల్టన్ (14) జట్టుకు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రిటోరియస్ (10) కూడా నిరాశ పరిచాడు. కానీ ట్రిస్టన్ స్టబ్స్ అండతో డెవాల్డ్ బ్రెవిస్ చెలరేగి పోయాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ పరుగుల సునామీ సృష్టించాడు.
అతన్ని కట్టడి చేసేందుకు కంగారూ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జూనియర్ ఎబిడిగా పేరున్న బ్రెవిస్ గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొడుతూ అభిమానులకు 360 డిగ్రీ క్రికెట్ మజా చూపించాడు. అతని విధ్వంసక బ్యాటింగ్‌తో స్టేడియం చప్పట్లతో మారుమ్రోగి పోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన బ్రెవిస్ వరుస ఫోర్లు, సిక్సర్లతో స్కోరును పరిగెత్తించాడు. అతని ధాటికి ఆస్ట్రేలియా బౌలర్లు పూర్తిగా చతికిల పడిపోయారు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన బ్రెవిస్ ఈ మ్యాచ్‌లో ఎన్నో రికార్డులను తిరగరాశాడు. చెలరేగి ఆడిన బ్రెవిస్ 56 బంతుల్లోనే 12 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 125 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి స్టబ్స్ (31) అండగా నిలిచాడు.
ఈ క్రమంలో స్టబ్స్‌తో కలిసి మూడో వికెట్‌కు 125 పరుగులు జోడించాడు. ఇక తర్వాత లక్షఛేదనకు దిగిన ఆతిథ్య టీమ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫారీ బౌలర్లు సమఫలమయ్యారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (5), వన్‌డౌన్‌లో వచ్చిన గ్రీన్ (9) నిరాశ పరిచారు. కెప్టెన్ మిఛెల్ మార్ష్ (22) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. టిమ్ డేవిడ్ ఒక్కడే దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. చెలరేగి ఆడిన డేవిడ్ 24 బంతుల్లోనే 4 సిక్సర్లు, 4 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. కారే (26) తప్ప మిగతా వారు విఫలం కావడంతో ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో క్వెనా, కార్బిన్ బోష్ మూడేసి వికెట్లను పడగొట్టారు.