స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్‌లో ఆర్.నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ (పేపర్ లీక్). ఈ చిత్రం ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా వీక్షించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియా తో మాట్లాడారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ “నారాయణమూర్తిని అందరం ఎందుకు గౌరవిస్తారు అంటే వారి అభిప్రాయం నచ్చో నచ్చకో ఈ రెండు కాదు. ఆయన చెప్పే తీరు. మీ అభిప్రాయాన్ని మీరు ముందుకు తీసుకెళ్లడంలో మీకున్న నిబద్ధత, మీకున్న నిజాయితీ దాన్ని మాత్రం ఎవ్వరు ప్రశ్నించలేరు. అది మాత్రం నారాయణ మూర్తి సొంతం. నారాయణమూర్తిలా రాజీ పడకుండా బతకడం అందరి వల్ల కాదు. అలా బ్రతకడం అంత తేలిక కాదు. అర్ధరాత్రి స్వాతంత్య్రం, ఒరేయ్ రిక్షా వంటి చాలా సూపర్ హిట్స్ కొట్టారు నారాయణమూర్తి. ఈ సినిమాలో గద్దర్ పాట నాకు బాగా నచ్చింది. ఆ పాట గద్దర్ రాశారు అని చెప్పిన తరువాత ఇంకా ఆనందం వేసింది. నాకు ఇష్టమైన రచయిత ఆయన. ఆగస్టు 22 న ఈ సినిమాను థియేటర్స్‌లో చూడండి”అని అన్నారు.
పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ “సినిమా నచ్చింది అని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు సంతోషం. విద్యను ప్రైవేట్ మాఫియా కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి విద్యను జాతీయం చేయాలి. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అని చాటి చెప్పేదే ఈ యూనివర్సిటీ పేపర్ లీక్ చిత్రం”అని తెలిపారు.