న్యూఢిల్లీ:మాజీ భారత క్రికెటర్ సురేష్ రైనాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు ఇచ్చింది. 1xBet తో ముడిపడి ఉన్న హై ప్రొఫైల్ అక్రమ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ఇడి.. రైనాను ప్రశ్నించించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో రైనా బుధవారం తన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఏజెన్సీ ముందు హాజరు కానున్నారు. ఈ యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రైనాను, ప్లాట్‌ఫామ్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ ఆరోపణల కింద కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ సమన్లు ఇచ్చింది.
రైనా కొన్ని ఎండార్స్‌మెంట్‌ల ద్వారా యాప్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్‌తో అతని లావాదేవీలు, సంబంధాలపై ED అధికారులు విచారించనున్నారు. కాగా, కేంద్ర దర్యాప్తు సంస్థ 1xBet అక్రమ బెట్టింగ్, గేమింగ్ కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. వినియోగదారులను మోసం చేయడం, డబ్బును లాండరింగ్ చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లపై విస్తృతంగా దర్యాప్తు చేస్తోంది. ఈ యాప్ కు ప్రమోషన్స్ చేసిన పలువురు సినీ, ప్రముఖులను ఇడి విచారిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నటుడు రానా దగ్గుబాటిని ED హైదరాబాద్‌లో విచారించింది. అంతకుముందు జూలైలో నటులు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలను విచారించిన ఇడి.. త్వరలో మంచు లక్ష్మిని కూడా విచారించనుంది.ఆమెకు ఇదివరకే సమన్లు జారీ చేసింది. నివేదికల ప్రకారం హీరోయిన్ నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, యాంకర్ శ్రీముఖితో సహా అనేక మంది ప్రముఖుల ఆర్థిక లావాదేవీలు కూడా ED పరిశీలిస్తోంది.