ఇస్లామాబాద్: సింధు జాలాల విషయంలో పాకిస్తాన్ మరోసారి భారత్ కు వార్నింగ్ ఇచ్చింది. అమెరికా పర్యటన సందర్భంగా పాక్ ఆర్మీ చీఫ్ భారత్ పై అణు బెదిరింపు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో భారత్ నుండి తమ దేశం ఉనికికి ముప్పును ఎదురైతే.. పాకిస్తాన్, భారత్ తోపాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని హెచ్చరించాడు. తాజాగా పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా భారత్ ను హెచ్చరించాడు. తమ దేశానికి హక్కుగా చెందిన ఒక్క చుక్క నీటిని కూడా భారత్ ను తీసుకోనివ్వమని ప్రతిజ్ఞ చేశారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాన మంత్రి షరీఫ్ మాట్లాడుతూ.. తమకు దక్కాల్సిన నీటిని ఆపడానికి భారత్ ప్రయత్నిస్తే.. యుద్ధ చర్యగా పరిగణిస్తామని హెచ్చరించాడు. మీరు మా నీటిని నిలిపేస్తామని బెదిరిస్తే, మీరు పాకిస్తాన్ నుండి ఒక్క చుక్కను కూడా లాక్కోలేరని గుర్తుంచుకోండి. భారత్ అలాంటి చర్యకు ప్రయత్నిస్తే.. తగిన గుణపాఠం నేర్పుతాం” అని హెచ్చరించాడు.
కాగా.. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆర్మీ.. పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల శిభిరాలను మిస్సైల్స్ తో ధ్వంసం చేసింది. అలాగే, ఉగ్రవాదులకు పాక్ సహకరిస్తుందని.. సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది.