Thursday, August 14, 2025

జనచైతన్యంతోనే జవాబుదారీ పాలన

- Advertisement -
- Advertisement -

భారత రాజ్యాంగ ప్రవేశిక (పీఠిక)లో, ప్రాథమిక హక్కులలో, ఆదేశిక సూత్రాలలో విద్య, -వైద్యం,- ఆరోగ్యానికి సంబంధించిన రాజ్యంగ రక్షణలు ఉన్నాయి. 1993 సం॥లో ఉన్ని క్రిష్ణన్ V/S స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీం కోర్టు 14 సంవత్సరాల బాలబాలికలు విద్య పొందటం అనేది భారత రాజ్యాంగంలోని జీవించే హక్కు (21వ, అధికరణం)లో ఇమిడి ఉన్న ప్రాథమిక హక్కుగా పేర్కొన్నది. 86వ రాజ్యాంగ సవరణ చట్టం (2002) ద్వారా విద్యా హక్కును 21 ‘ఎ’ అధికరణంగా ప్రాథమిక హక్కుల జాబితాలో పొందుపరిచారు. ఆదేశిక సూత్రాలలోని 45వ అధికరణం ప్రకారం ఆరు సంవత్సరాలలోపు బాలలకు ప్రారంభ శిశుసంరక్షణ విద్య కల్పించాలి. 350 ‘ఎ’ అధికరణం కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు ప్రాథమిక విద్య కోసం కృషిచేయాలని చెబుతుంది.

11వ షెడ్యూల్ వైద్య విద్య, ప్రాథమిక, ఉన్నత స్థాయి విద్యలు, పేదలకు విద్యా సౌకర్యాలు, వృత్తి విద్య శిక్షణల గురించి వివరిస్తుంది. విద్య-, వైద్యం రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలోని అంశాలు. వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేసి అమలు పర్చడానికి వీలుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య-, వైద్య మంత్రిత్వశాఖలను ఏర్పాటు చేసి గ్రామ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు విద్య-, వైద్య-, ఆరోగ్య సేవలను అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ అంతంత మాత్రంగానే అందుతున్నాయి. సరైన వసతులు లేకపోవడం, కావల్సిన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించకపోవడం, సిబ్బంది కొరత, ఉద్యోగుల నిర్లక్ష్యం, అధికారుల అవినీతి, నిధుల కొరత, తదితర సమస్యలతో ప్రభుత్వ విద్య, -వైద్య రంగాలు/ సంస్థలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాయి.

ప్రైవేట్, కార్పొరేట్ రంగంలో బహుళ అంతస్తులలో నడుస్తున్న విద్య-, వైద్యం కోటాను కోట్ల రూపాయలను సంపాదించే అత్యంత లాభసాటి వ్యాపారంగా, మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. కార్పొరేట్ కాసుల వైద్యాన్ని భరించలేని గ్రామీణ ప్రజలు ఏ దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు అన్నట్లు దేవుడి మీద భారం వేసి రోజులు లెక్కపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. నిరక్షరాస్యులైన దళితులు, గిరిజనులు, బహుజనులకు విద్య-, వైద్య సదుపాయాలు అందకపోవడం మూలంగా దేవుడు రోగాలు నయం చేస్తాడని చెబుతున్న మత బోధకుల మాటలకు ఆకర్షితులై ఎక్కువ మంది ప్రజలు మూఢ నమ్మకాలను, అంధవిశ్వాసాలను బలంగా/ గుడ్డిగా నమ్ముతున్నారు. గిరిజన తండాలు, కోయ గూడాలు, గ్రామీణ ప్రాంతాల పేదప్రజలు అనివార్యంగా ఈ రకమైన చర్యల వైపు నెట్టివేయబడుతున్నారు. ఈ పాపం పాలకులదే. విద్య-, వైద్యం-, ఆరోగ్యం ప్రాథమిక హక్కులలో ఒకటైన జీవించే హక్కు (21వ అధికరణం)లో అంతర్భాగమైనప్పటికీ ఆచరణలో రక్షణ కరువైన ప్రాథమిక హక్కుగానే మిగిలిపోతుందనేది నగ్నసత్యం. విద్య-, వైద్యం-, ఆరోగ్యం ప్రాథమిక హక్కులలోనే కాదు మానవ హక్కులలోను అంతర్భాగమే. సుప్రీం కోర్టు అనేక సందర్భాలలో విద్య-, వైద్యాన్ని సేవలుగానే నిర్వహించాలి తప్ప వ్యాపార ధోరణితో నిర్వహించి తద్వారా వచ్చిన లాభాలతో మరో చోట సంస్థలను నిర్వహించరాదని స్పష్టం చేసింది.

కార్పొరేట్ యాజమాన్యాలు విద్య-, వైద్య రంగాలలో పరిధులు, పరిమితులు దాటి, ఎల్లలులేని వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహిస్తూ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నప్పటికీ చేష్టలుడిగిన ప్రభుత్వాలు ఉద్దేశపూర్వక ఉపేక్షను ప్రదర్శిస్తున్నాయి. సంక్షేమ పథకాల పేరిట ఊదరగొడుతున్న ప్రభుత్వాలు సంపన్నుల జేబులు నింపడానికి పోటీపడుతున్నాయి. ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యా హక్కు చట్టం (2009) పూర్తిగా లోపభూయిష్టమైనది. ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థలను బలహీన పర్చే విధంగా ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం మన దేశంలో 6- 14 సంవత్సరాల వరకు ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందించాలి. దీని ప్రకారం 1 నుండి 8వ తరగతి వరకు మాత్రమే వర్తిస్తుంది. సెకండరీ, మాధ్యమిక, ఉన్నత విద్యను ఈ చట్టం పూర్తిగా వదిలేసింది.

అంతే గాక 1వ తరగతి కన్నా ముందున్న పూర్వ ప్రాథమిక విద్యను కూడా ఈ చట్టంలో పేర్కొన లేదు. ఈ చట్టంలో పేర్కొన్నట్లు 1- 5 తరగతులకు ఇద్దరు ఉపాధ్యాయులు సరైంది కాదు. 1: 30 ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్య సరైంది కాదు. 1- 5 తరగతులలో 5 తరగతుల వరకు 18 సబ్జెక్టులు, 40 పీరియడ్లు ప్రతి రోజు నిర్వహించాలి. అంతేగాక పూర్వ ప్రాథమిక విద్య (ఎల్‌కెజి, యుకెజి) నేర్పించాలి. వ్యాయామం, ఆటలు నేర్పించాలి. ఇదంత ఒక్కరో, ఇద్దరో ఉపాధ్యాయులతోని సాధ్యమయ్యే పనికాదు. కనీసం 7 గురు ఉపాధ్యాయులు ఉంటే కానీ సాధ్యం కాదు. ఈ చట్టం ప్రకారం ప్రతి యేటా 25% మంది ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే పేద విద్యార్థులను ప్రైవేటు విద్యా సంస్థలల్లో చేర్పించాల్సి ఉంది. ఇది కనుక అమలైతే నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వ విద్యార్థుల సంఖ్య సున్నకు చేరుతుంది. దీంతో ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడానికి పాలక వర్గాలకు మార్గం సులువవుతుంది.

ఇదో రకంగా పేద ప్రజలకు విద్యను దూరం చేసే కుట్రలో భాగమే. ఈ చట్ట నిబంధనలతో విద్యారంగాన్ని పూర్తిగా ప్రైవేటు రంగాలకు అప్పజెప్పి ప్రభుత్వాలు చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల కాలంలో అధిక ధనార్జన కలిగిన కార్పొరేట్ విద్య-, వైద్య సంస్థల అధిపతులు, ప్రజాప్రతినిధుల రూపంలో చట్టసభలలోకి ప్రవేశించడం, మంత్రి పదవులు చేపట్టడం సమాజానికి అత్యంత ప్రమాదకరం. ఈ రకమైన పరిణామం రాజ్యంగ స్ఫూర్తిని సమూలంగా దెబ్బతీస్తుంది. ప్రజాస్వామిక, రాజ్యాంగ విలువలపట్ల ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుంది.

విద్య, వైద్యం, ఆరోగ్యం ప్రజల ప్రాథమిక హక్కుగా శాసనాలు రూపొందించడంలో, వాటిని అమలు పరచడంలో పార్లమెంటు ఆయా రాష్ట్రాల శాసన సభలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం, న్యాయ వ్యవస్థలు నిర్లిప్త వైఖరి అవలంబిస్తూ రాజ్యాంగాన్ని, శాసనాలను రాతలకే పరిమితం చేస్తున్నాయి. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల ఈ రకమైన వైఖరి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ప్రాథమిక హక్కుగా పేర్కొంటున్న విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రజలకు చేరేలా ప్రజలను చైతన్యం చేస్తూ, ప్రజాపోరాటాలను ఉధృతం చేయాల్సిన బాధ్యత ప్రజాస్వామికవాదులు, కవులు, కళాకారులు, మేధావులు, పౌర సమాజంపై ఉంది. జనచైతన్యంతోనే జవాబుదారీ పాలన ఏర్పడుతుంది. జవాబుదారీ పాలనలోనే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన, సమానమైన విద్య, వైద్యం, ఆరోగ్యం అందుతుంది.

విశ్వ జంపాల
77939 68907

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News