ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు’గా ఉంది కర్నాటక లోని ధర్మస్థల మంజునాథ స్వామి దర్శనం. భక్తులు అదృశ్యమై అస్థిపంజరాలుగా మారడం అంతుచిక్కని మిస్టరీ, ఇటీవలే సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. సినిమా ఫక్కీలో జరుగుతున్న దేవాలయ ట్రస్టీ బోర్డు దారుణాల గుట్టు రట్టు చేసి మంత్రులైనా, ఎంత పెద్ద హోదాలో ఉండిన వారైనా, వారు చేసిన నేరాలకు తగిన కఠినశిక్ష పడాల్సిందే. ఇది ఒక మతానికే సంబంధించినదిగా భావించకుండా మానవత్వానికి సంబంధించిన అంశంగా పరిగణించాలి. ఈ సంఘటన ప్రభుత్వానికి విసిరిన పెద్ద సవాల్. అసహజ మరణాల గురించి ఆరా తీస్తుంటే అన్ని శక్తులు కలిసి పని చేసి ఉండవచ్చు అన్నసందేహం బలంగా ఉంది.
పుణ్య స్థలానికి వచ్చిన వందలాది మంది పురుషులు, మహిళలు కనపడకుండా పోయి ధర్మస్థల పరిసర ప్రాంతాలలో శవాలుగా మారడం మానవాళి మనుగడకే ముప్పు. ఇదంతా చూస్తుంటే డ్రగ్స్ మత్తుకన్నా మతం మత్తుతో మనిషన్నవాడు మాయమైపోతున్నాడు అన్నది నగ్నసత్యం. ఇది హిందూ సంస్కృతి సంప్రదాయంపై చేసిన విమర్శగా భావించరాదు. మనిషి మనిషిలా బతకాలి అన్నదే మనిషన్నవాడు కోరుకున్నది. భక్తి తొక్కిసలాటలో మానవత్వం నలిగి పోతున్నది. ఆగ్నికి ఆజ్యం పోసినట్లు కాషాయ వస్త్రధారులు కట్టు కథల ప్రవచనాలతో ప్రజలను మోసగించి వ్యాపారాలు చేస్తున్నారు. హిందూ సనాతన ధర్మంపేరిట అశాస్త్రీయ పద్ధతులతో జనాలను తప్పుడు దారిపట్టిస్తున్నారు. దానికి మన పాలకులు వంత పాడుతున్నారు. ధర్మస్థలిలో చాలా కాలం నుండి లెక్కలేనన్ని మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు ఓ పారిశుద్ధ్య కార్మికుడు దక్షిణ కన్నడ జిల్లా ఎస్‌పి అరుణ్‌కు జులై రెండో వారంలో రాసిన ఓ లేఖ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ‘తన చేత ఆ పనులు చేయించిన కొందరు వ్యక్తులు తమ కుటుంబానికి చెందిన యువతి పైనే అఘాయిత్యానికి పాల్పడడంతో బెదిరిపోయి ఆ ప్రాంతం వదిలి పారిపోయినట్టు ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినట్లు వార్తలు వినబడుతున్నాయి.
తనకు రక్షణ కల్పిస్తే అన్ని నిజాలు బయట పెడతా అంటూ అతడు తన లేఖలో స్పష్టంగా రాయడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి జులై 19న నలుగురు సీనియర్ ఐపిఎస్‌లతో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.ఆ కార్మికుడు ఇచ్చిన కొన్ని ఆధారాలతో 13 పాయింట్‌లను గుర్తించి తవ్వడంతో బుధవారం 30 జులై ఒక పాయింట్ వద్ద తవ్వుతుండగా ఒక అస్థిపంజరం అవశేషాలు పాక్షికంగా బయటపడినట్లు సమాచారం. మరోచోట మహిళ అవశేషాలు కనిపించాయని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకు ఆ అపరిచిత వ్యక్తి ఎవరు? కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు నిమ్మకునీరెత్తినట్లు ఎందుకు ఉన్నాయి? తెరవెనుక ఉండి మనుషులను మింగుతున్న ఆ అపరిచిత వ్యక్తి ఎవరు? ఆ మానవ మృగాలను రచ్చ కీడువాలి.
రాజ్యసభ సభ్యుడైన డాక్టర్ వీరేంద్ర హెగ్డే ఐదు దశాబ్దాలుగా ఆలయ ధర్మాధికారిగా ఉంటున్నారని వార్తలు వచ్చినాయి. రాజ్యసభ సభ్యుడై ఉండి కూడా ఎందుకు ఈ ఘోరాలకు కళ్ళెం వేయడం లేదు. గత పదేళ్లలో ధర్మస్థలము చుట్టు పక్కల 450 మందికి పైగా అదృశ్యమైనట్లు పోలీస్ లెక్కలు చెబుతున్నాయి.
అక్కడి స్థానికులు కూడా దీన్ని బలపరిచారు. నేత్రావతి ఇసుక పాయల్లో కలిసిపోయిన శరీరాలు ఎన్నెన్నో. మంజునాథ ఆలయానికి సంబంధించిన వ్యక్తులే ఈ అదృశ్య మరణాల వెనుక ఉన్నారని, అందుకే తాను అక్కడినుండి పారిపోయానని పారిశుద్ధ్య కార్మికుడు చెప్పడంతో అక్కడ ఏమి జరుగుతుందో తెలుసు కోవాలనే ఆరాటం భక్తులలో, స్థానికులలో మెండుగా ఉంది. ఈ అపరిచిత వ్యక్తుల బండారం బయటపడితే గ్రామం నుండి ఢిల్లీ దాకా ట్రస్టీ బోర్డు, వారికి అండగా నిలిచిన ప్రజాప్రతినిధుల పునాదులు కదలనున్నాయి. పాతికేళ్లుగా ఎవరు తొక్కిపెడుతున్నారు? ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు? అన్న విషయం తెలియాలి. అసహజ మరణాలకు సంబంధించిన ఆరోపణలు 2015లో వస్తే రాష్ట్ర ప్రభుత్వం ‘ఉగ్రప్ప’ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ నివేదిక ప్రకారం 300 మంది పురుషులు, మహిళలు, మరికొందరు బాలలు అసహజ మరణాలకు గురి అయినారని కమిటీ తెలియచేసినప్పటికీ చర్యలు మృగ్యం.
దీని వెనుకాల పెద్దల హస్తం ఉందని తెలుస్తున్నది. మరో విషయం ఏమంటే ఈ అసహజ మరణాలలో డాక్టర్లు, జర్నలిస్టులు కూడా ఉండడం విశేషం. సిట్ దర్యాప్తు బృందం కూడా నీరుగారిపోయే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ దారుణాల మిస్టరీ తేలక పోతే ధర్మస్థల చరిత్ర ఆధర్మ స్థలంగా మిగిలిపోయే ప్రమాదం ఉందని భక్తులు వాపోతున్నారు. మిస్టరీ వెనుక అదృశ్యహస్తాన్ని త్వరగా వెలికి తీయాలి. మానవవాదులు, హేతువాదులు, ముక్తకంఠంతో గొంతెత్తి ఆ దేవాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, నేరస్థులను శిక్షించాలని డిమాండ్ చేశారు. 15 సంవత్సరాల కాలంలో జరిగిన అసహజ మరణాలకు సంబంధించిన రికార్డులు కావాలని సమాచార హక్కుల కార్యకర్త జయంత్ ఆర్‌టిఐ ద్వారా కోరగా పత్రాలు, పోస్టుమార్టం నివేదికలు, వాల్ పోస్టర్లు, నోటీసులు, గుర్తు తెలియని గుర్తింపు కోసం తీసిన ఫోటోలు, సాధారణ పరిపాలన ఆదేశాల మేరకు ధ్వంసం చేశామని బెల్తంగాడి పోలీసులు సమాధానం చెప్పడం కలకలం రేపుతుంది. ఈ విషయం జయంత్ సోషల్ మీడియాకు వెల్లడించారు. సమాచారం డిజిటల్ చేయకుండా ధ్వంసం చేయడంలో అంతరార్థం మేమిటని ప్రశ్న? ప్రశ్నగానే ఉండిపోతుందా? ప్రధాని మోడీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన నేతగా పలుమార్లు తొలి స్థానంలో నిలిచారు. ఇది సంతోషించదగిన విషయమే కాని ఇంట గెలిచి రచ్చ గెలవాలి.
పూసాల సత్యనారాయణ
9000792400