Thursday, August 14, 2025

ఇసి.. ఈజీగా తీసుకోవద్దు

- Advertisement -
- Advertisement -

ప్రజాస్వామ్యంలో నిష్పక్ష, స్వతంత్ర ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగకర్తలు కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి)కి ప్రత్యేక హక్కులు, అధికారాలూ కల్పించారు. అధికార పార్టీతో సహా ఎవరి, ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా బాధ్యతలు నిర్వహించేందుకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు. అలాంటి ఎన్నికల సంఘం పై ఇటీవల ఎన్నో ఆరోపణలు, విమర్శలొస్తున్నాయి. ప్రధానంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎన్నికల సంఘ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటూ దాని అధికారాలను దుర్వినియోగ పరుస్తోందని విమర్శలు వినిపిస్తున్న వేళ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రక్రియపై ఢిల్లీలో ఇచ్చిన ప్రజంటేషన్‌తో మరిన్ని సందేహాలు మొదలయ్యాయి. ఈ అంశాలను ఎన్నికల సంఘం కేవలం రాహుల్ గాంధీ సమస్యలుగా పరిగణించకుండా సందేహాలను నివృత్తం చేస్తే కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. లేకపోతే స్వతంత్ర ప్రతిపత్తి గల ఎన్నికల సంస్థ ఒత్తిడికి లొంగుతోందనే అనుమానాలకు తావిచ్చినట్టవుతుంది.

సరైన ఓట్లేనా చెప్పండి: లోక్‌సభలో విపక్షనేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 2024 పార్లమెంట్ ఎన్నికలు మొదలుకొని హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకు పలు సందర్భాల్లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటిని కొట్టివేస్తూ వస్తున్న ఎన్నికల సంఘం ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు ఇపుడైనా బాధ్యతాయుతంగా సరైన సమాధానాలిస్తే జవాబుదారీగా నిలిచినట్టుంటుంది. పాలక బిజెపి, ఎన్నికల సంఘం కూడబలుక్కొని మోసపూరితంగా ఓట్ల చోరీ చేయడంతోనే లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బిజెపి అంచనాలకు మించి గెలిచిందని రాహుల్ గాంధీ కొన్ని ఉదాహరణలతో వివరించారు. ఇందుకు ఆయన బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మహాదేవపురం అసెంబ్లీ సెగ్మెంట్‌ను ఎంపిక చేసుకొని ప్రస్తావించారు. ఈ సెగ్మంట్‌లో ఐదు విధాలుగా నిబంధనలను దుర్వినియోగపరుస్తూ లక్షకు పైగా దొంగ ఓట్లను సృష్టించారని చెప్పారు. వివరాలతో ఆయన చేసిన ఆరోపణల్ని కొట్టిపారేయకుండా ఇసి సమగ్రంగా బదులీయాల్సిన అవసరం ఉంది. రాహుల్ చూపించిన డాక్యుమెంట్లలో కొన్ని అంశాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. వాటిలో మచ్చుకు కొన్నింటిని పరిశీలిస్తే ఒక్క నియోజకవర్గంలో ఒకే ఓటరు పలుమార్లు రిజిస్టర్ చేసుకోవడం, ఒకే ఎపిక్ నెంబరు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉండడం, ఒకే చిరునామాలో అసాధారణంగా అనేక మంది ఓటర్లుగా నమోదు కావడం వంటి అంశాలు తీవ్రమైనవే.

ఒక ఓటరు ఎపిక్ నెంబరు వేర్వేరు రాష్ట్రాల్లోనూ ఉండడం పెద్ద సమస్య కాదంటూ, ఎపిక్ సమస్యను కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది ప్రారంభం నుండి సరిచేసే ప్రక్రియను మొదలెట్టింది. మరోవైపు పార్టీ కార్యకర్తలు బూత్ స్లిప్పులు చూసి, ఒకే వ్యక్తి పేరుతో ఒకే ఎన్నికల కేంద్రంలో చాలా ఓట్లు వేయించినట్టు రాహుల్ గాంధీ చెబుతున్న మాటే నిజమైతే ‘ఒక వ్యక్తి- ఒక ఓటు’ అనే సూత్రానికి తిలోదకాలు ఇచ్చినట్టే. తక్కువ కాలంలో అకస్మాత్తుగా ఓటర్ల నమోదులో అసాధారణ పెరుగుదల బిజెపి గెలుపుకు దోహదం చేసిందనే విమర్శలున్నాయి. ఓట్ల చోరీ ఒక మహాదేవపురానికే పరిమితం కాకుండా, బిజెపి తేలికగా గెలవలేని అనేక చోట్ల కూడా ఆ పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా ఓ పద్ధతి ప్రకారం కుట్రలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇవే తరహా అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నా, ఇందుకు మహాదేవపురంలో చూపినట్టు రుజువులతో కూడిన వివరాలను బహిర్గతం చేయలేదు.

నిజమేమిటో తేలాలి : రాహుల్ గాంధీ ప్రజంటేషన్‌లో పేర్కొన్న లోపాల ద్వారానే బిజెపి పలు ఎన్నికల్లో విజయం సాధిస్తోందని నిందించలేము, నిరూపించలేము. 2023 శాసనసభ ఎన్నికల్లో మహాదేవపురం సెగ్మంట్‌ను బిజెపి అభ్యర్థి మంజుల 44 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ సెగ్మంట్‌లో ఆ పార్టీ 1,14,000 మెజరిటీ సాధించింది. అయితే ఇక్కడ పరిశీలించాల్సిన అంశం సంవత్సర కాలంలో ఓటర్ల జాబితాలో అదనంగా చేరింది 52,600 ఓటర్లు మాత్రమే. ఈ రెండు ఎన్నికల్లో వాస్తవాలను గమనిస్తే ఓటు వేసిన వారి సంఖ్య కేవలం 20,000 మాత్రమే పెరిగింది. కాబట్టి ఈ గణాంకాలనే పరిగణనలోకి తీసుకొని మోసం జరిగిందని నిర్ధారించలేము.

ఎన్నికల ప్రక్రియపై లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఎన్నికల సంఘం స్పందన సందేహాత్మకంగానే ఉంటోంది. ‘మేం ఏ వివరాలూ ఇవ్వనవసరం లేదు, ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు’ వంటి పెలుసు స్పందనలు అనుచితం. ఆరోపణలు తప్పని ఆధారాలతో నిరూపించాల్సిన ఎన్నికల సంఘం రక్షణాత్మక ధోరణితో ఇవన్నీ ‘తప్పుదోవ పట్టించేవి’ అంటూ వ్యాఖ్యానిస్తూ, దాటవేత వైఖరీతో వ్యవహరిస్తోంది. ఓట్ల చోరీ ఆరోపణలు చేసిన రాహుల్, ఆయన వాదన నిజమని నమ్మితే, అఫిడవిట్ పై సంతకం చేసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఎన్నికల సంఘం చెప్పింది. తాను నమ్మింది నిజమనే భావనతోనే రాహుల్ ఆరోపణలు చేశారు. అవన్నీ నిజమని నమ్మితే అఫిడవిట్ ఇవ్వండని చెప్పే బదులు, ఎన్నికల సంఘం చొరవ తీసుకొని ఆ ఆరోపణలు నిరాధారమని నిరూపిస్తే బాగుంటుంది. దీనిపై న్యాయ నిపుణులు స్పందిస్తూ, ఇందుకు అఫిడవిట్ సమర్పించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. మరో పెద్ద సమస్య ఏమంటే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను పిడిఎఫ్ ఇమేజ్ ఫైళ్ల రూపంలో విడుదల చేస్తోంది. ఈ జాబితాల్లో సమాచారం వెతకడం, పరిశీలించడం క్లిష్టమైన ప్రక్రియ. దీనికి బదులు టైప్ చేసిన, వెతకగలిగే సౌకర్యంతో డేటా ఇస్తే రాజకీయ పార్టీలు, రీసెర్చ్ సంస్థలు, పౌర సంస్థలు జాబితాను విశ్లేషించి, లోపాలను గుర్తించడం తేలికవుతుంది. ప్రస్తుతం ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రధానంగా సెల్ఫ్ డిక్లరేషన్లపై ఆధారపడి ఉంది, కానీ వాటిని తనిఖీ చేయడానికి పటిష్ట పద్ధతులు లేవు.

ముమ్మర సవరణ తేల్చేనా? : మహాదేవపురం సెగ్మంట్‌పై వచ్చిన సందేహాలు నివృత్తం చేయడానికి ఇంటింటి పరిశీలనే సరైన మార్గం. బీహార్లో ఎన్నికల సంఘం ఇపుడు జరుపుతున్న ‘ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ’ కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఈ ప్రక్రియను విపక్షాలు గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదు. దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని, ఫేక్ ఓట్లతో గెలుస్తున్నారని ఆరోపిస్తున్న వారు వాటి తొలగింపు ప్రక్రియను అడ్డుకోవద్దు. బెంగళూరులో ‘చెడు’ అయింది పాట్నాలో ‘మంచి’ అవుతుందా? తప్పు ఎక్కడైనా తప్పే! అయితే ఈ సవరణలు, పరిశీలనలు హడావుడిగా చేస్తే మాత్రం అసలైన ఓటర్ల పేర్లు తొలిగిపోయే ప్రమాదాలుంటాయి. బీహార్‌లో ప్రస్తుత ప్రక్రియ డేటాను పరిశీలిస్తే అపోహలకే కాదు అనుమానాలకూ తావుంది. ఒక కేస్ స్టడీ ప్రకారం, అక్కడ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా తొలగించబడ్డారు. వృత్తిరీత్యా మహిళల కంటే పురుషులే అధికంగా వలసలు వెళ్తారు. అధికంగా మహిళల పేర్లు తొలగింపంటే చదువురాని, వెనుకబడిన వర్గాల వారికి అన్యాయం జరిగినట్టు కనిపిస్తోంది. ఎన్‌ఎహెచ్‌ఎస్ అధ్యయన గణాంకాల ప్రకారం బీహార్‌లో 15- 49 మధ్య వయస్కులైన మహిళల అక్షరాస్యత కేవలం 55 శాతమే అనేది ఇక్కడ గమనార్హం. హేతుబద్ధ విమర్శలకు ఇసి తగిన సమాధానమివ్వాలి.

సరైన జాబితాతోనే సరిపోదు : ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చడం, తొలగించడంలో అవకతవకలు మన ఎన్నికల సమస్యలలో ఒక భాగం మాత్రమే. ఎన్నికల నిర్వహణలో ఇంకా చాలా లోపాలున్నాయి. ఎన్నికల ఖర్చుల నియమ నిబంధనలను, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేయకపోవడం ఇక్కడ పెద్ద లోపం. ఇవిఎంలలో వివిపాట్స్ స్లిప్పులలో కొన్నే శాంపిలుగా తీసుకొని లెక్కించడంతో ఓటింగ్ సంఖ్యపై అనుమానాలొస్తున్నాయి. అంతేకాక వివిపాట్స్ లోడింగ్ లో పటిష్ట టెక్నికల్ భద్రత లేకపోవడం, ఇవిఎం సాఫ్ట్‌వేర్, భద్రతా ప్రక్రియలను స్వతంత్ర నిపుణుల ద్వారా పరిశీలించేందుకు ఎన్నికల సంఘం ముందుకు రాకపోవడం, పోలింగ్ కేంద్రాల్లో సిసిటివి ఫుటేజీలను భద్రపరచడంలో నిర్లక్ష్యం, పోలింగ్ శాతం వివరాలను ప్రకటించడంలో ఆలస్యం, ఎవరైనా విమర్శలు చేస్తే దాన్ని దాడి చేస్తున్నట్టు పరిగణించడంతో ఎన్నికల సంఘంపై, అధికారులపై ఆరోపణలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ పరిణామాల వల్ల ఎన్నికల సంఘంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది.

భారత ఎన్నికల సంఘంపై విశ్వసనీయత పెరగాలంటే కేవలం సాంకేతిక ఘనతకు పరిమితమైతే సరిపోదు. పక్షపాతిరహితంగా, పారదర్శకంగా వ్యవహిరిస్తుందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలి. అంతేకాక ఎన్నికల సంఘంలో అంతర్గతంగా కూడా ప్రక్షాళన జరగాల్సిన ఆవశ్యకత ఉంది. ఎలక్షన్ కమిషన్ కమిషనర్ల నియామకంలో భారత ప్రధాన న్యాయమూర్తిని సెలక్షన్ కమిటీలో చేర్చాలనే సుప్రీం కోర్టు సిఫార్సును ప్రభుత్వం పక్కనపెట్టింది. ఏదైనా పార్టీ, ఎవరైనా నేత ఆరోపణలు చేసినప్పుడు హడావుడి చేయకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకోవాలి.

రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలతో ఎన్నికల ప్రక్రియ మొత్తం మోసమని చెప్పలేం. ఇదే సమయంలో ఆయన చూపించిన కొన్ని రుజువులు ఎన్నికల వ్యవస్థలో లోపాలను బట్టబయలు చేస్తున్నాయి. వీటిని రాజకీయ కోణంలో కొట్టివేయకుండా, స్ఫూర్తిగా తీసుకొని లోపాలున్న చోట్ల దిద్దుబాటుకు, చికిత్సకు ప్రాధాన్యతివ్వాలి. ఎవరో విమర్శించారని కాకుండా ఎన్నికల ప్రక్రియలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇందుకోసం ఓటర్ల జాబితాపై సమగ్ర పరిశీలన, శాస్త్రీయ అధ్యయనం, తగిన సనరణ జరగాలి. పూర్తి డేటాను పారదర్శకంగా అందుబాటులో ఉంచాలి. ఇవిఎం లపై విమర్శలు లేకుండా తిప్పికొట్టేందకు సాంకేతికంగా మరింత బలపడాలి. ఎన్నికల సంఘం తరచూ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతూ వారి సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి. ఇసి తమపై వస్తున్న ఆరోపణలను ‘ఈజీ’గా తీసుకోవద్దు. విమర్శలు, ఆరోపణల్ని సమీక్షించుకుంటూ జవాబుదారీగా ఉండాలి. లేదంటే ఎన్నికల సంఘం ప్రజల్లో నమ్మకం కోల్పోవడమే కాకుండా అది ప్రజాస్వామ్య వ్యవస్థకే తీరని ముప్పుగా పరిణమించే ప్రమాదముంది.

దిలీప్‌రెడ్డి

సమకాలీనం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News