జైసల్మేర్: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ సమీపంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) గెస్ట్ హౌస్‌లో కాంట్రాక్టు మేనేజర్‌గా పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్‌ను రాజస్థాన్ CID ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. పాకిస్తాన్ నిఘా సంస్థ ISI తరపున గూఢచర్యం చేసినట్లు.. దేశ సరిహద్దు వెంబడి రహస్య, వ్యూహాత్మక జాతీయ సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు రాష్ట్రంలో దేశ వ్యతిరేక, విధ్వంసక కార్యకలాపాలపై CID ఇంటెలిజెన్స్ నిశితంగా గమనిస్తోందని రాజస్థాన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ CID (సెక్యూరిటీ) డాక్టర్ విష్ణుకాంత్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిఘా సమయంలో DRDO కాంట్రాక్టు మేనేజర్ మహేంద్ర ప్రసాద్ సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ నిఘా సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాడని.. క్షిపణి, ఇతర ఆయుధ పరీక్షల కోసం ఫైరింగ్ రేంజ్‌కు వచ్చే DRDO శాస్త్రవేత్తలు, భారత ఆర్మీ అధికారుల కదలికలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్లకు అందిస్తున్నాడని తెలిసిందని ఆయన చెప్పారు. దీంతో మహేంద్ర ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని జైపూర్‌లోని సెంట్రల్ ఇంటరాగేషన్ సెంటర్లో వివిధ నిఘా సంస్థలు సంయుక్తంగా విచారించాయని.. అతని మొబైల్ ఫోన్‌ను పరిశలించారని తెలిపారు. DRDO, భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ హ్యాండ్లర్లకు అందిస్తున్నట్లు గుర్తించారు. దీంతో గూఢచర్యం ఆరోపణలపై అధికారిక రహస్యాల చట్టం 1923 కింద మహేంద్ర ప్రసాద్‌పై కేసు నమోదు చేసి.. రాజస్థాన్‌లోని CID ఇంటెలిజెన్స్ అతన్ని అరెస్టు చేసింది.