బీహార్‌లో ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్), ఓట్ల చోరీపై కాంగ్రెస్‌తోసహా ‘ఇండియా’ కూటమి నేతలు నిరంతర పోరాటం సాగిస్తున్నారు. ఈ మేరకు సోమవారం ర్యాలీగా బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకుని ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్, శివసేన నేత సంజయ్ రౌత్ సహా 29 మంది ఎంపిలను అదుపులోకి తీసుకుని తరువాత విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఓట్ల చోరీపై ప్రారంభమైన భారీ ప్రజా ఉద్యమంలో గడచిన 24 గంటల్లోనే 15 లక్షల మంది మద్దతుగా తమ ధ్రువీకరణ పత్రాలను డౌన్లోడ్ చేసుకోవడం, అలాగే 10 లక్షల మిస్ కాల్స్ రావడం ఈ ఉద్యమానికి మద్దతు విశేషంగా పెరుగుతుందనడానికి సంకేతం.
మంగళవారం కూడా ఈ పోరు కొనసాగింది. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడడంతో పార్లమెంట్ వెలుపల కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీతో సహా పలువురు ప్రతిపక్ష నేతలు ‘మింతాదేవి’ అనే బీహార్ ఓటరు ఫోటోతో ఉన్న టీషర్టులు ధరించి నిరసన నిర్వహించారు. బీహార్ ఓటరు మింతాదేవి వయసు 124 ఏళ్లుగా ఓటరు ఐడి కార్డులో ముద్రించి ఉండడం ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా తయారీలో అక్రమాలు జరిగాయనడానికి సాక్షంగా విపక్షాలు నినాదాలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తి వయసు కంటే మింతాదేవి వయసే ఎక్కువని రాహుల్ వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం తన పని తాను సక్రమంగా చేయడం లేదని, దీని తీరు భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఉందని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఒక మనిషి, ఒక ఓటు అనేది రాజ్యాంగానికి భూమిక అని, కానీ ఎన్నికల కమిషన్ దీన్ని తుంగలో తొక్కిందని, ఇది రాజ్యాంగానికి విఘాతమని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. రాజ్యాంగ పరిరక్షణలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. బిజెపి, కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కై ఎన్నికల్లో భారీ మోసానికి పాల్పడ్డాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత కొద్ది రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ‘ప్రజాస్వామ్యం వినాశనమైంది’ అన్న నినాదంతో ఆయన ఇండియా కూటమి నేతలకు ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా ఒక వెబ్ పేజీని ప్రారంభించారు. అవకతవకలు గుర్తిస్తే ఈ వెబ్ పేజీకి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
పార్లమెంట్ వెలుపల మీడియాతో లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ గత ఏడాది కర్ణాటక, మహారాష్ట్రల్లో బిజెపితో కలిసి ఓట్ల చోరీ చేసిన ఎన్నికల కమిషన్ ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓట్ల చోరీకి ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో సన్నద్ధమవుతోందని ఆరోపించారు. ఒకటి రెండు సీట్లలో కాకుండా చాలా సీట్లలో ఓట్ల చోరీ జరుగుతోందని, ఇది ఒక పద్ధతిలో జాతీయ స్థాయిలో జరుగుతోందని విమర్శించారు. ఇదంతా ఎన్నికల కమిషన్‌కు తెలుసనీ, గతంలో దీనికి ఆధారాలు లేవనీ, ఇప్పుడు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ పోరు మరో మలుపు తిరిగింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నందున లోక్‌సభ ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని డిమాండ్ విపక్షాల నుంచి వస్తోంది. తప్పుల ఓటర్ల జాబితా ఆధారంగా బిజెపి అధికారం లోకి వచ్చిందని, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు ఆ విధంగానే ఎన్నికయ్యారని, అందువల్ల లోక్‌సభను రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని మంగళవారం తృణమూల్ కాంగ్రెస్ ఎంపి అభిషేక్ బెనర్జీ డిమాండ్ చేశారు.
గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల్లో ఓటర్ల జాబితాలు సరిగ్గానే ఉన్నాయని, బెంగాల్, బీహార్‌లో మాత్రమే తప్పుగా ఉన్నాయని ఇసి చెప్పడం అనుమానాలను తావిస్తోంది. ఎస్ఐఆర్ను నిర్వహించాలనుకుంటే ముందుగా లోక్‌సభను రద్దు చేయాలని, ఆ తరువాత దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ను నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు మంగళవారం కూడా విచారణ చేపట్టింది. బీహార్‌లో ఓ నియోజక వర్గంలో 12 మంది చనిపోయారని ఇసి పేర్కొందని, కానీ వారు బతికే ఉన్నారని ఆర్జెడి నేత మనోజ్ ఝా తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాదు మరో సందర్భంలో బతికే ఉన్న వ్యక్తులను చనిపోయినట్టు ప్రకటించినట్టు బయటపడింది.
అయితే ఎన్నికల కమిషన్ మాత్రం ఇది కేవలం ముసాయిదా జాబితా కావడం వల్ల ఈ తప్పిదాలను సరిదిద్దవచ్చని చెప్పింది. ఈ సందర్భంగా వాస్తవాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘానికి సుప్రీం ధర్మాసనం సూచించడం గమనార్హం. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఎంతమంది ఓటర్లు ఉన్నారు, గతంలో నమోదైన మరణాల సంఖ్య, ఇప్పుడు నమోదు చేసిన మరణాల సంఖ్య తదితర వివరాలపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ప్రాథమిక పత్రాలుగా ఆధార్, రేషన్ కార్డుతోపాటు స్వయంగా ఓటరు ఐడీ కార్డును పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్‌కు మొదట సూచించిన సంగతి తెలిసిందే. కానీ అప్పటికే సవరణ ప్రక్రియ పూర్తిచేసి ఆగస్టు 1న ముసాయిదా జాబితాను ఎన్నికల కమిషన్ ప్రచురించింది. సవరణ ప్రక్రియకు ముందు బీహార్‌లో మొత్తం నమోదిత ఓటర్ల సంఖ్య 7.9 కోట్లు ఉండగా, ముసాయిదా జాబితాలో 7.24 కోట్లకు సంఖ్య తగ్గింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30 న తుది జాబితా విడుదల కానుంది. మరి ఆ జాబితా ఎంతవరకు సక్రమంగా ఉంటుందో చూడాలి