అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు లేవు అని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. నిన్న పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన ఘటనలే అందుకు ఉదాహరణగా ఉన్నాయని, వైసిపి సంబంధించిన ఏజెంట్లు లేకుండా పోలింగ్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. తాడిపల్లిలోని వైసిపి పార్టీ కేంద్ర కార్యాలయంలోజగన్ మాట్లాడారు. వైసిపి ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలో కూర్చోనీయలేదని, 15 పోలింగ్ బూత్‌లలో వైసిపి ఏజెంట్లు లేకుండా చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇంత అన్యాయంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదన్నారు.
బందిపోటు దొంగల తరహాలో సిఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలు జరిపించారని దుయ్యబట్టారు. పులివెందుల జడ్ పిటిసి ఉప ఎన్నిక కోసం చంద్రబాబు కుట్రలకు పాల్పడ్డారని, పోలింగ్ బూత్‌లను మార్చేశారని మండిపడ్డారు. చంద్రబాబుది అడ్డగోలు రాజకీయమని, చంబల్‌వ్యాలీలో బందిపోట్లను కూడా మరిపించారని, బందిపోట్ల ముఠానాయకుడు చంద్రబాబు అని జగన్ విమర్శలు గుప్పించారు.
పులివెందుల వైసిపి అభ్యర్థి హేమంత్‌రెడ్డిని ఇంటినుంచి బయటకు ఎందుకు రానీయలేదని అడిగారు. డిఐజి కోయ ప్రవీణ్ పర్యవేక్షణలో ఉప ఎన్నికలు జరిగాయని, చంద్రబాబు పాలనలో మాట వినని పోలీసు అధికారులపై కేసులు పెడుతున్నారని, ఎంతో మంది అధికారులను వేధించి, సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు. కొంత మంది పోలీసు అధికారులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, జడ్ పిటిసి ఉప ఎన్నిక కోసం పోలీసులను ఏరికోరి నియమించుకున్నారని జగన్ చురకలంటించారు.