బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో సినీ నటి మంచు లక్ష్మిబుధవారం ఇడి విచారణకు హాజరైయ్యారు. బషీర్‌బాగ్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ప్రాంతీయ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు విచారణకు వచ్చిన మంచు లక్ష్మిని అధికారులు సుమారు మూడున్నర గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం మంచు లక్ష్మి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు సంబంధించి తీసుకున్న పారితోషకం గురించి ఇడి అధికారుల ఆరా తీసినట్లు తెలిసింది.
ఇడి అధికారులకు మంచు లక్ష్మి తన బ్యాంకు ఖాతాల వివరాలను అందచేసినట్లు సమాచారం. కాగా, మంచు లక్ష్మి వైఓఎల్‌ఓ 247 అనే బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారు. కాగా, బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేశారని సినీ నటులు, టివీ హోస్ట్‌లు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయన్సర్లపై రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఇడి ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్(ఇసిఐఆర్) రిజిస్టర్ చేసింది. ఈ క్రమంలో వరుసగా సినీ నటులను విచారిస్తోంది. ఈ కేసులో ఇడి మరికొంత మందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.