ప్రాక్టీస్ షురూ చేసిన రోహిత్, కోహ్లి
ముంబై: టీమిండియా సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లి ( Virat kohli ), రోహిత్ శర్మలు (Rohith sharma) ఇప్పటికే టెస్టు, టి20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ సిరీస్‌కు ఆరంభానికి ముందు కోహ్లి, రోహిత్‌లు అనూహ్యంగా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. తొలుత రోహిత్ శర్మ ( (Rohith sharma)) టెస్టులకు గుడ్‌బై చెప్పగా ఆ వెంటనే కోహ్లి కూడా సంప్రదాయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. వీరిద్దరూ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. కానీ టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్ వీరిని వన్డేల్లో ఆడించేందుకు సుముఖంగా లేడని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
దీనికి అలకబూనిన విరాట్, రోహిత్‌లు వన్డేల నుంచి కూడా తప్పుకోనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఊహాగానాలను పటాపంచలు చేస్తూ రోహిత్, కోహ్లిలు ( Virat kohli )() సాధన ప్రారంభించారు. దీంతో వీరు వన్డేల్లో ఆడేందుకు సిద్ధమవుతున్న విషయం స్పష్టమవుతోంది. కోహ్లి ఇంగ్లండ్‌లోని లండన్‌లో సాధన ఆరంభించగా, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith sharma)() ముంబైలో ప్రాక్టీస్ ప్రారంభించాడు. అభిషేక్ నాయర్ పర్యవేక్షణలో రోహిత్ సాధన కొనసాగుతోంది. ఐపిఎల్ తర్వాత ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు మళ్లీ సాధన ప్రారంభించడంతో వారి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. రానున్న వన్డే వరల్డ్‌కప్ వరకు ఇద్దరు ఈ ఫార్మాట్లో కొనసాగాలని భావిస్తున్నారు. విరాట్ కోహ్లి అసాధారణ ఫిట్నెస్ను కలిగి ఉన్నాడు. దీంతో వరల్డ్‌కప్ వరకు అతను ఈ ఫార్మాట్లో కొనసాగేందుకు ఎలాంటి అవరోధాలు ఉండక పోవచ్చు.
ఈ విషయంలో రోహిత్‌కు కొన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. కోహ్లితో పోల్చితే ఫిట్నెస్ విషయంలో రోహిత్ వెనుకబడి ఉండడమే దీనికి కారణంగా చెప్పాలి. మరోవైపు ప్రధాన కోచ్ గంభీర్ ఇటీవల మాట్లాడుతూ జట్టులో చోటు సంపాదించాలంటే పూర్తి ఫిట్నెస్ కలిగి ఉండాల్సిందేనని స్పష్టం చేశాడు. ఫిట్నెస్ లేకుంటే ఎంత పెద్ద ఆటగాడికైనా పక్కన బెట్టేందుకు వెనుకాడబోమని తేల్చి చెప్పాడు. గంభీర్ హెచ్చరికలు రోహిత్, కోహ్లిలకు సంబంధించినవేనని సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. గంభీర్ వ్యాఖ్యలతో కలతకు గురైన కోహ్లి, రోహిత్‌లు వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ కోహ్లి, రోహిత్‌లు తిరిగి సాధన ప్రారంభించడంతో ఇలాంటి వార్తలకు తెరపడిందనే చెప్పాలి.