సాఫ్ట్వేర్ రంగం తన ఉద్యోగులను మరోసారి కాటేయడం మొదలు పెట్టింది. పగలనక, రాత్రనక పనిమీదే ధ్యాసపెట్టే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఇప్పుడు ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అనే బెంగతో బతుకుతున్నారు. ఉద్యోగం పోయినవాళ్లు నడి సంద్రంలో చిక్కుకున్నట్లు విలవిలలాడుతుంటే, పనిచేస్తున్నవారేమో ఎప్పుడు పిడుగులాంటి వార్త వినవస్తుందోనని వణికిపోతున్నారు. చిన్న, పెద్ద కంపెనీలనే భేదం లేదు, సీనియర్, జూనియర్ ఉద్యోగి అన్న పట్టింపులేదు. వరుస పెట్టినట్లు వేలమందిని కంపెనీలు నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపుతున్నాయి. లాభాపేక్షతో పని చేసే ఈ కంపెనీలను తప్పును పట్టేలా లేదు. సాంకేతిక పరిశోధన, నూతన ఆవిష్కారాలను కాదనలేరు. నిన్నటి చదువు నేటి ఉద్యోగానికి పనికి రాదు. నేటి చదువు తలకెక్కేదాకా ఉద్యోగం ఆగదు. ఇదే అదునుగా కంపెనీలు ఉన్న ఉద్యోగులపై పనిభారం పెంచి పీల్చి పిప్పి చేస్తున్నాయి.
ఇంత పని చేయలేను అని చెబితే రేపటి నుంచి రానవసరం లేదని అంటారని నోరు మెదపకుండా వారు ఉండక తప్పడం లేదు. పని చేసి చేసి ఇంటి దాకా పోయే ఓపికలేక ఆఫీసు బయట ఫుట్‌పాత్‌పై పడుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి చిత్రం వార్తల్లో వచ్చింది. ప్రభుత్వ రంగం(Government sector) తన ఉద్యోగికి పదవి విరమణ దాకా భరోసా ఇస్తుంది. ప్రైవేటు వ్యవస్థలు మాత్రం రక్తమాంసాలను, మేధస్సును తూకం వేసి ఉద్యోగాల్లో కొనసాగనిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో కొత్తగా వచ్చిన ఆటోమేషన్, కృత్రిమ మేధ ఇలా వేల ఉద్యోగాలను ఊడ్చేస్తున్నాయి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ డెవలపర్స్ చేసే పనులను ఈ రెండు కొత్త పనిముట్లు వేగంగా, తక్కువ ఖర్చుకు చేసి పెట్టే రోజులు రెండేళ్ల క్రితమే మొదలయ్యాయి.
2023 నుండే వాటి ధాటికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రెప రెపలాడుతున్నాయి. నైపుణ్య లేమి అని మన గ్రాడ్యుయేట్లను ఆడిపోసుకొనే రోజులు పోతున్నాయి. ఐఐటిలో చదివిన వారికి కూడా ఉద్యోగం గ్యారంటీ లేదు. పది, ఇరవై ఏళ్ల అనుభవం, అద్భుత వృత్తి పరిజ్ఞానం ఉన్నా ఉద్యోగాన్ని కాపాడలేకపోతున్నాయి. కొత్త సాంకేతిక ఆవిష్కారాల వల్ల తక్కువ ఉద్యోగులతోపాటు ఖర్చు, సమయం ఆదా అవుతుంటే ఏ కంపెనీ అయినా అటువైపే అడుగులు వేస్తుంది. ఏడాదికేడాది కంప్యూటర్ డెవలపర్ల అవసరాలు తీరిపోతాయని నిపుణులు అంటున్నారు. మనిషి చేసే పనులను యంత్రాలు వేగంగా చేసి పెడుతుంటే వ్యవసాయంతోపాటు నిర్మాణ, ఉత్పత్తి, సేవారంగాల్లో సమూల మార్పులు వచ్చాయి. కొత్తగా వస్తున్న కృత్రిమమేధ కంపెనీలు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల ప్రాజెక్టులపై ప్రభావం చూపి వాటి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తాయని అంటున్నారు.
అంటే రేపటి కాలమంతా ఎఐ కంపెనీలదే అన్నమాట. డాక్టర్లు, యాక్టర్లు, టీచర్లు, ఆర్టిస్టులు, డ్రైవర్లు, వెయిటర్లు ఇలా అన్ని వృత్తులు, పనులు కృత్రిమమేధ తక్కువ ఖర్చుతో చేసి పెడుతుంది. కంప్యూటర్ కోర్సులు చదువుతున్నవారు, వాటిలో చేరబోయేందుకు సిద్ధపడ్డవారు నేటి పరిస్థితులను గమనించి అయోమయంలో పడుతున్నారు. మంచి ఇంజినీరింగ్ కాలేజీలో కంప్యూటర్ కోర్సులో సీటు వస్తే చాలు, జీవితంలో సెటిల్ అయినట్లే అని నమ్మినవారు సైతం ఉద్యోగం వస్తుందో లేదో అనే డైలమాలో పడిపోయారు. ప్లేస్మెంట్ అయినవారికి జాబ్ ఆర్డర్ చేతికి రావడం లేదు. సాఫ్ట్‌వేర్‌ను నమ్ముకుంటే లాభం లేదనే ఆలోచన కూడా ఇప్పుడిప్పుడే మొదలైంది. ఈ సంవత్సరం ఇంజినీరింగ్ సీట్ల ఎంపిక ఈ విషయానికి బలాన్నిస్తోంది. సివిల్, మెకానికల్ సీట్ల వైపు ఆసక్తి పెరిగింది. జెఎన్టియు, క్యాంపస్‌లో కంప్యూటర్ అనుబంధ కోర్సుల్లో 30 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడైనా తొలి కౌన్సిలింగ్‌లోనే చకచకా భర్తీ అయ్యే ఈ సీట్లు ఇలా మిగిలిపోవడం, సివిల్, మెకానికల్ సీట్లు నిండిపోవడం చూస్తుంటే ఓ కొత్త మార్పు రాబోతుందనిపిస్తోంది.
ఇప్పటి వరకు దేశంలోని వివిధ కంపెనీలు 80 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. వాటిలో మైక్రోసాఫ్ట్, టిసిఎస్, గూగుల్ లాంటి కంపెనీలు పెద్ద సంఖ్యలో సిబ్బందిని తగ్గిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు పోవడం కొత్తేమి కాదు. అయితే గతంలో తగినన్ని ప్రాజెక్టులు రాకపోవడంతో కంపెనీలు పనిలేని ఉద్యోగులను ఇంటికి పంపేవి. కొత్తవారి రాకతో ఖర్చులు తగ్గించుకునేందుకు తగిన సామర్థ్యం లేని సీనియర్లను తీసేసేవారు. ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగం కోల్పోయినవారికి జీతం తక్కువో, ఎక్కువో అయినా మరో కంపెనీలో పని దొరికేది. ఇప్పటి పరిస్థితులు వేరు. కృత్రిమ మేధ ఉధృతికి నిరుద్యోగులైనవారికి మళ్ళీ కొలువు దక్కాలంటే వారు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలపై పట్టుసాధించాలి. నలభై, యాభై ఏళ్ల వారు కుర్ర విద్యార్థులతో పోటీపడాలి. ఇది ఎందరికి సాధ్యం? ఉద్యోగం కోల్పోయినవారి ఆర్థిక పరిస్థితి కుదేలు అవుతుంది.
ఉద్యోగాన్ని నమ్ముకొని బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఇల్లు, కారు కొన్నవారు నెల కిస్తీలు చెల్లించడం ఆగిపోతుంది. బ్యాంకు నిరర్థక ఆస్తుల నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటారు. పరిస్థితి చేయిదాటితే కారు, ఇల్లు వేలం దాకా వెళుతుంది. ఎంత మానసిక క్షోభ కలుగుతుందో అనుభవించేవారికే తెలుసు. ఇంత జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇదంతా మాకు సంబంధం లేని విషయమన్నట్లు వ్యవహరిస్తున్నాయి. వేలమంది ఉద్యోగులు రోడ్డుమీద పడితే దేశ ఆర్థిక పరిస్థితిపై దాని ప్రభావం ఉంటుంది. వందల కోట్ల విలువైన బ్యాంకు అప్పులు నిరర్థక ఆస్తులు అవుతాయి. పరిశ్రమల ఉత్పత్తులు, వ్యాపార, విద్య వైద్య రంగాలు కుదేలు అవుతాయి. విదేశీ మారకం దెబ్బ తింటుంది. దేశవ్యాప్తంగా లక్షల్లో ఉన్న ఈ ఉద్యోగులకు ప్రభుత్వం తరపున ఎలాంటి రక్షణ లేకపోవడం బాధాకరం.
పైగా మరిన్ని ఇలాంటి ప్రైవేట్ ఉద్యోగాలను కల్పించే వ్యవస్థల కోసం సర్కారు అర్రులు చాచడం విచిత్రంగా ఉంది. దేశంలో ఆరంభించే విదేశీ, ప్రైవేట్ కంపెనీలకు కోరినన్ని రాయితీలు ఈయడమే కాదు, అందులో పనిచేసే వారికి ఉద్యోగ భద్రత, పని గంటలు, జీతభత్యాలు తదితర విషయాలపై కూడా కంపెనీలతో చర్చించి రాతపూర్వక ఒప్పందాలు చేసుకోవాలి. తెలంగాణకు వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, వాటి ద్వారా వేల మందికి ఉపాధి కలుగుతుందని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగుల బాగోగుల గురించి కూడా ఇప్పుడే ఆలోచించాలి. ఆకాశ హర్మ్యాలు, అద్దం లాంటి రోడ్లు ఉండే ఫోర్త్ సిటీలో ఎప్పుడు ఊడుతాయో తెలియని ఉద్యోగాలతో రాష్ట్ర ప్రజలకు దక్కేదేమిటి? భారీ పెట్టుబడులతో సంబరపడే ప్రభుత్వ పెద్దలు తెలంగాణ బిడ్డలకు ఇచ్చే హామీలేమిటో స్పష్టం చేయాలి.
- బి. నర్సన్
9440128169