ఆర్థిక పరిభాషలో శ్రామిక గమనశీలత (Mobility of Labour) అంటే కార్మికులు వివిధ ఉద్యోగాలు (వృత్తి గమనశీలత) లేదా విభిన్న భౌగోళిక స్థానాల (భౌగోళిక గమనశీలత) మధ్య సులభంగా వెళ్ళగలగడం. ఈ కీలకమైన భావన ఆర్థిక వ్యవస్థలో శ్రమవనరులు ఎంత సమర్థవంతంగా కేటాయించబడుతున్నాయో తెలపడంతోపాటు, ఉత్పాదకత, ఆర్థికవృద్ధి వంటి అంశాలను ప్రభావితం చేస్తుంది. విద్య, శిక్షణ, సామాజిక, కుటుంబ సంబంధాలు, గృహ ఖర్చుల లభ్యత, ప్రభుత్వ విధానాలు మొదలైన అనేక అంశాలు శ్రామిక గమనశీలతను ప్రభావితం చేస్తాయి. తక్కువ శ్రామిక గమనశీలత కొన్ని ప్రాంతాలలో నిరంతర నిరుద్యోగం, ఇతర ప్రాంతాలలో కార్మిక కొరతలకు దారితీస్తుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) 2024 అంచనాల ప్రకారం, 2022లో ప్రపంచవ్యాప్తంగా 167.7 మిలియన్ల అంతర్జాతీయ వలస కార్మికులు ఉన్నారు.
వారు ప్రపంచ శ్రామికశక్తిలో 4.7%. ప్రపంచ అంతర్జాతీయ వలస జనాభాలో 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల కార్మికులు దాదాపు (Workers are approx) 66% ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వృత్తిపరమైన గమనశీలతను ప్రభావితంచేసే అంశాలు చూసినప్పుడు నైపుణ్యాలు, విద్య, వేతన వ్యత్యాసాలు, శిక్షణ అవకాశాలు, బదిలీ నైపుణ్యాలు, వృత్తిపరమైన నిబంధనలు, పని వాతావరణాలకు అనుగుణంగా ఉండే సామర్థ్యం మొదలైనవి. మరోవైపు భౌగోళిక గమనశీలతను వేతన వ్యత్యాసాలు, జీవన వ్యయం, గృహనిర్మాణం, మార్కెట్, సామాజిక, సాంస్కృతిక సంబంధాలు, ప్రభుత్వ విధానాలు, రాజకీయ స్థిరత్వం, పౌరస్వేచ్ఛలు, వాతావరణం, ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక పురోగతి మొదలైనవి ప్రభావితం చేస్తాయి.
విజువల్ క్యాపిటలిస్ట్ ప్రచురించిన డేటా ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో అంతర్జాతీయ వలసదారులు అమెరికాలో 52.4 మిలియన్లకు పైగా ఉన్నారు. దీని వలన అది అధిక గమనశీలత కలిగిన దేశంగా మారింది. మెక్సికో, -అమెరికా వలస కారిడార్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉంది. మెక్సికోలో జన్మించిన 10 మిలియన్లకు పైగా ప్రజలు మైగ్రేషన్ డేటా పోర్టల్ ప్రకారం అమెరికాలో నివసిస్తున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్ కూడా వలస కార్మికుల రాకపోకలలో గణనీయమైన పెరుగుదలను చూసింది. 2023లో 2,83,000 మంది వలస కార్మికులు వచ్చారు. ఇది మునుపటి సంవత్సరం కంటే 48% ఎక్కువ. కెనడా కూడా అధిక స్థాయిలో శ్రామిక గమనశీలత అనుభవిస్తోంది, 2023లో 1,45,000 మంది వలస కార్మికులు వచ్చారు, ఇది 7% ఎక్కువ. ఇతర ముఖ్యమైన దేశాలు జర్మనీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా కూడా వలస కార్మికులను ఆకర్షించడంలో బలమైన ధోరణులను చూపిస్తున్నాయి.
వాస్తవానికి, పోటీతత్వ ప్రపంచ శ్రామికశక్తికి కార్మిక మార్కెట్ సరళత చాలా అవసరం. ఎందుకంటే ఇది ఉద్యోగ సృష్టిని ప్రోత్సహిస్తుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. శ్రామిక శక్తి గమనశీలతను పెంచుతుంది. కార్మిక సంస్కరణలను అమలు చేసిన దేశాలు ఆర్థిక వృద్ధిలో గణనీయమైన మెరుగుదలను చూపిస్తున్నాయి. సౌకర్యవంతమైన కార్మిక విధానాలను కలిగి ఉన్న దేశాలు మార్కెట్ డిమాండ్లకు బాగా సర్దుబాటు చేయగలవు, మాంద్యాలను తగ్గించగలవు. మరింత స్థితిస్థాపక ఆర్థిక వ్యవస్థను పెంపొందించగలవు. పైగా ఈ దేశాలు వేగవంతమైన నియామకం, మెరుగైన పోటీతత్వం, సాంస్కృతిక నిరోధకత, ఆర్థికవృద్ధి, ఉద్యోగసృష్టి వంటి ప్రయోజనాలను కూడా కలిగి ఉన్నాయి. 2025లో ఉద్యోగ సౌలభ్యం, ఉపాధి ఒప్పందాలు, వేతన సరళత ఆధారంగా, మొదటి ఐదు దేశాలు 96/100 స్కోరుతో డెన్మార్క్, 95/100 స్కోరుతో సింగపూర్, 94/100 స్కోరుతో యునైటెడ్ స్టేట్స్, 92/100 స్కోరుతో న్యూజిలాండ్, 80/100 స్కోరుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ). కార్మిక మార్కెట్ సరళత విషయానికి వస్తే ఈ దేశాలు ముందున్నాయి.
ఐక్యరాజ్య సమితి (యుఎన్‌ఒ) వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెకట్స్ 2024 డేటా ఆధారంగా, 2023లో అత్యధిక నికర వలస రేట్లు కలిగిన మొదటి ఐదు దేశాలు, పాకిస్తాన్ -1.62 మిలియన్లు, సూడాన్ -1.35 మిలియన్లు, భారతదేశం -979,000, చైనా 568,000 బంగ్లాదేశ్ 550,000. అనేక దేశాలు తమ పౌరులు ఇతర దేశాలకు వలస వెళ్లడం వల్ల స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో తగ్గుదలని ఎదుర్కొంటున్నాయి. వీటిలో భారతదేశం, చైనా ఎక్కువ జనాభాను కలిగి ప్రభావితమయ్యాయి. ఈ దేశాల పౌరులు గణనీయమైన సంఖ్యలో వలస వెళ్తున్నారు, దీని వలన సమర్థ శ్రామిక శక్తి, మానవ మూలధనం కోల్పోతున్నారు. భారతదేశంలో భౌగోళిక (ప్రాంతాల వారీగా గమనశీలత), వృత్తిపరమైన (ఉద్యోగాలు/ వృత్తుల వారీగా గమనశీలత) రెండూ సాంప్రదాయకంగా చాలా తక్కువగా ఉన్నాయి.
అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ప్రధాన కారణాలు కులవ్యవస్థ, కుటుంబ, సమాజ బంధాలు, భాష, ప్రాంతీయ తేడాలు వంటి సామాజిక, సాంస్కృతిక అంశాలు, తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, వలస ఖర్చు వంటి ఆర్థిక పరిమితులు ఉన్నాయి. దీనికి అదనంగా పట్టణ గృహనిర్మాణం, పట్టణ మురికివాడ పరిస్థితులు, విద్య, నైపుణ్య అడ్డంకులు, నైపుణ్య అసమతుల్యత మొదలైనవి భారతదేశంలో కార్మికుల గమనశీలతను ప్రభావితం చేస్తున్నాయి. అశోక విశ్వవిద్యాలయం స్టాటిస్టా డేటా ప్రకారం, హిమాచల్‌ప్రదేశ్ జనాభాలో 45.7% వలసదారులతో ముందంజలో ఉంది. ఇతర ప్రముఖ రాష్ట్రాలు కేరళ – 38.4%, తెలంగాణ – 37.1%, పంజాబ్ – 35.8%, మహారాష్ట్ర – 35.6% వలస జనాభాతో ఉన్నాయి.
ప్రత్యేకంగా ఉపాధి కోసం కదలికను కొలిస్తే, కొన్ని చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అధిక శాతాన్ని చూపిస్తున్నాయి, అవి అరుణాచల్ ప్రదేశ్ నుండి 31.2% వలసదారులు పని కోసం తరలివెళుతున్నారు, మిజోరం – 30.3%, ఢిల్లీ – 28.6%, నాగాలాండ్ 27.5%. వలస కార్మికుల కోసం ప్రధాన గమ్యస్థాన రాష్ట్రాలను చూసినప్పుడు మహారాష్ట్ర 7.9 మిలియన్ల అంతర్ రాష్ట్ర వలస కార్మికులను కలిగి ఉంది, తమిళనాడు 3.48 మిలియన్ల మంది కార్మికులు కర్ణాటక 2.88 మిలియన్లు గుజరాత్ 3 మిలియన్లు. ఢిల్లీ 2.03 మిలియన్లు, కేరళ 0.7 మిలియన్లకుపైగా అంతర్‌రాష్ట్ర వలస కార్మికులను కలిగి ఉంది. భారతదేశంలో మరిన్ని ఉపాధి అవకాశాల కోసం కార్మిక గమనశీలతను పెంచడానికి చర్యలు తీసుకోవాలి. కార్మికుల గమనశీలతను పెంచడం నిరుద్యోగ భారాన్ని తగ్గిస్తుంది కాబట్టి కార్మికుల గమనశీలతపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి.
- డాక్టర్ పి.ఎస్. చారి 83090 82823