Thursday, August 14, 2025

కొత్త కూటమితో అమెరికాకు చెక్

- Advertisement -
- Advertisement -

ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక స్నేహితుడని, అమెరికాతో వాణిజ్య సుంకాల ఒప్పందాన్ని కుదుర్చుకునే మొదటి వ్యక్తి కాగలరని మనమంతా నమ్మేటట్లు చేశారు. అయితే, ఇప్పుడు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునే దేశాల వరుసలో చివరకు నెట్టివేసే పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ పై 50 శాతం సుంకాలను విధించడమే కాకుండా ‘సుంకాల కింగ్’, ‘డెడ్ ఎకానమీ’ అంటూ భారత్‌పై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు గమనిస్తే ఓ విధంగా భారత్‌ను భయపెట్టి తన దారికి తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. నేడు సర్వత్రా భావిస్తున్నట్లు మనం రష్యా నుండి చమురు, ఆయుధాలు కొనుగోలు చేయడం మాత్రం అందుకు కారణం కాదు. ట్రంప్ తన మొదటి అధ్యక్ష పదవీ కాలం నాటి సమయంలో ప్రారంభమైన వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడంలో భారత్ జరుపుతున్న జాప్యంతో ఆయన ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

2019లో టెక్సాస్‌లో మోడీని కలిసిన సమయంలోనే ఆ ఒప్పందంపై ఇరువురం సంతకాలు చేయబోతున్నట్లు ట్రంప్ భావించారు. కానీ, ఆ చర్చలు (Discussions) ఆ మరుసటి రోజే న్యూయార్క్ లో విఫలం అయ్యాయి. ఫిబ్రవరి 2020 గుజరాత్‌లో కలిసినప్పుడు వ్యవసాయం, పాల ఉత్పత్తులకు సంబంధించి రెండు దేశాల మధ్య స్పష్టమైన విభేదాలను నిజాయతీతో ఒప్పుకోకుండా ఒప్పందం దాదాపు ఖరారు అయిన్నట్లే రెండు దేశాల అధికారులు చెబుతూ వచ్చారు. దురదృష్టవశాత్తు, ట్రంప్ రిపబ్లికన్ మద్దతుదారులు వ్యవసాయ ప్రాంతం నుండి రావడంతో ఈ రంగంపైనే ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ‘మీరు చాలా పెద్ద దేశం అని చెప్పుకుంటున్నారు. మీరు అమెరికన్ మొక్కజొన్నను అంగీకరించడం లేదు’ ఆగ్రహంతో తన అక్కసును వెళ్లగక్కుకున్నారు.

గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే భారత్, చైనా, రష్యా ఓ కూటమిగా ఏర్పడి అమెరికా ఆధిపత్య ధోరణులను ఎదుర్కొనే అవకాశాకు కనిపిస్తున్నాయి. ఆరేళ్ళ తర్వాత చైనా పర్యటనకు మోడీ బయలుదేరడం, ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్‌లో మాట్లాడటం, ఈ ఏడాది చివరిలో భారత్ రానున్నట్లు ఆయన ప్రకటించడం వేగంగా జరిగిపోయాయి. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో చైనాలోని టియాంజిన్‌ను సందర్శిస్తారని ధ్రువీకరించిన మరుసటి రోజు తర్వాత పుతిన్ భారత్ పర్యటనను ప్రకటించారు. ఈ రెండు పర్యటనలు రష్యా- భారత్ -చైనా (ఆర్‌ఐసి) ట్రోయికా పునరుద్ధరణకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పెరుగుతున్న పాశ్చాత్య ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి 1990లలో ఆర్‌ఐసి త్రైపాక్షిక వ్యూహాత్మక సమూహాన్ని మాజీ రష్యా ప్రధాన మంత్రి యెవ్జెనీ ప్రిమాకోవ్ రూపొందించారు. 90ల నుండి, ఆర్‌ఐసి 20 మంత్రుల స్థాయి సమావేశాలను నిర్వహించింది. అయితే, 2020 గాల్వన్ లోయ ఘర్షణ తర్వాత భారతదేశం, చైనా మధ్య సంబంధాలు క్షీణించడంతో ఆర్‌ఐసి నిష్క్రియంగా ఉంది. ఆర్‌ఐసి దేశాలు ప్రపంచ జిడిపిలో 33 శాతానికి పైగా దోహదం చేస్తాయి. అవి అంతర్జాతీయ వ్యవహారాలలో ఒక్కరే ఆధిపత్య ధోరణి ప్రదర్శించడాన్ని వ్యతిరేకిస్తూ, బహుళ ధ్రువ ప్రపంచాన్ని ప్రోత్సహించాయి.ఈ మూడు దేశాలూ అణుశక్తులు కావడమే కాకుండా ఎస్‌సిఒ, బ్రిక్స్, జి20 వంటి కీలకమైన కూటమిలలో కూడా సభ్యులు.

చైనాతో సంబంధాలు దెబ్బతినడంతో భారత్ ఆర్‌ఐసికి దూరంగా ఉంటూ వస్తున్నది. అయితే, మారిన ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో రష్యాతో తన సాన్నిహిత్యాన్ని ప్రశ్నించే రీతిలో ట్రంప్ భారతదేశం పై సుంకాలను విధించడంతో, న్యూఢిల్లీ ఇప్పుడు ఆర్‌ఐసి గురించి తన వ్యూహాన్ని పునరాలోచించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. గత నెలలో, భారతదేశం కూడా ఆర్‌ఐసిని పునరుద్ధరించడానికి సుముఖతను ప్రదర్శించింది. దాని పునరుద్ధరణ గురించి ఏదైనా చర్చను ‘పరస్పర అనుకూలమైన రీతిలో’ తీసుకుంటామని చెప్పింది. ‘ఆర్‌ఐసి అనేది ఒక సంప్రదింపుల ప్రక్రియ. ఇది మూడు దేశాలు తమకు ఆసక్తి ఉన్న ప్రపంచ, ప్రాంతీయ సమస్యలను చర్చించడానికి కలిసి వచ్చే యంత్రాంగం’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ జులైలో పేర్కొన్నారు.

ముఖ్యంగా, రష్యా, చైనా రెండూ ఆర్‌ఐసి పునరుద్ధరణ కోసం ఒత్తిడి తెస్తున్నాయి. గత నెలలో, త్రైపాక్షిక ప్రక్రియ పునరుద్ధరణ కోసం భారతదేశం చైనాతో కూడా చర్చలు జరుపుతున్నట్లు రష్యా తెలిపింది. ‘ఈ మూడు దేశాలు బ్రిక్స్ వ్యవస్థాపకులతోపాటు ముఖ్యమైన భాగస్వాములు కాబట్టి ఈ ప్రక్రియ పని చేసేలా చేయడంలో మేము ఆసక్తి కలిగి ఉన్నాము’ అని రష్యా ఉప విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెకో తెలిపారు. అమెరికా నుండి పదేపదే బెదిరింపులు వచ్చినప్పటికీ, భారతదేశం రష్యాతో తన సంబంధాల నుండి వెనక్కి తగ్గదని పుతిన్ పర్యటన చూపిస్తుంది. ట్రంప్ సుంకాల బెదిరింపులు కూడా మూడు దేశాలను దగ్గర చేస్తున్నాయి. భారతదేశంపై 50% సుంకాలు విధించాలనే ట్రంప్ పరిపాలన నిర్ణయాన్ని రష్యా, చైనా రెండూ విమర్శిస్తున్నాయి.

చైనా పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ, భారత్‌పై ట్రంప్ చూపిస్తున్న పక్షపాతి వైఖరి భవిష్యత్తులో అమెరికాకు నష్టం చేకూర్చే అవకాశం ఉందని పేర్కొంటూ 50 శాతం సుంకాల కారణంగా భారత్- చైనా, రష్యాలతో జట్టు కట్టే అవకాశం ఉందని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ హెచ్చరించడం గమనార్హం. మరో ఆసక్తికరమైన పరిణామంలో చైనా దినపత్రిక గ్లోబల్ టైమ్స్ తన సంపాదకీయంలో ప్రధాని మోడీ, భారతదేశాన్ని ప్రశంసించింది. ప్రధాని మోడీ చైనా పర్యటనను ప్రస్తావిస్తూ ఆ పత్రిక సంపాదకీయం ఇలా చెబుతోంది: ‘హిందూ సామెత చెప్పినట్లుగా, ‘మీ సోదరుడి పడవను దాటడానికి సహాయం చేయండి, మీ పడవ ఒడ్డుకు చేరుకుంటుంది’. ఆరోగ్యకరమైన చైనా- భారతదేశం సంబంధం ఈ ప్రాంతానికి, ప్రపంచానికి సానుకూల ప్రభావాలను తెస్తుంది.

ద్వైపాక్షిక సంబంధాలను, ఆచరణాత్మక సహకార ప్రణాళికలను మెరుగుపరచడానికి, ‘డ్రాగన్, ఏనుగు కలిసి నృత్యం చేయడం’ అనే కొత్త అధ్యాయాన్ని సంయుక్తంగా ప్రారంభించేందుకు నిజమైన ఉద్దేశ్యాలతో చైనాను సందర్శించాలని మేము ప్రధానమంత్రి మోడీని స్వాగతిస్తున్నాము.’ వీటన్నింటికీ మించి ఇటీవల పాకిస్తాన్‌తో ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా జరిగిన యుద్ధం సందర్భంగా చైనా ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికే వ్యూహాత్మకంగా పాకిస్థాన్‌కు మద్దతుగా ఉంది. ఆయుధాల సరఫరాతో పాటు నిఘా సమాచారం కూడా అందించింది. భారత్ సేనల కదలికలపై పాకిస్థాన్‌కు చైనా నుండి ఖచ్చితమైన సమాచారం ఎప్పటికప్పుడు అందుతూ వచ్చిందని సిడిఎస్ అనిల్ చౌహన్ చెప్పుకొచ్చారు.

అంతేకాదు, పశ్చిమాసియాలో పాకిస్థాన్‌తో చైనా, బంగ్లాదేశ్‌లు భారత్‌కు వ్యతిరేకంగా చేతులు కలిపితే రక్షణ పరంగా సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా చెప్పారు. అందుకనే, ఈ విషయంలో చైనా జోక్యాన్ని పరిమితం చేసేందుకు భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డా. జైశంకర్ ఆ దేశంలో వరుసగా పర్యటనలు జరిపారు. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా జరిపారు.అంతర్జాతీయంగా అమెరికా నుండి ఎదురయ్యే సవాళ్లతో పాటు ప్రాంతీయంగా పాకిస్థాన్‌తో ఎదురయ్యే భద్రతాపరమైన సవాళ్లు ఎదుర్కొనేందుకు సైతం చైనాతో కూటమి పునరుద్ధరణకు భారత్ వ్యూహాత్మకంగా ముందడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ పై సుంకాలు తమ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించగలదని అమెరికాలో సైతం అసమ్మతి వ్యక్తం అవుతుంది.

భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ భారత్ లాంటి బలమైన మిత్రదేశంతో సంబంధాలను తెచ్చుకోకండి అంటూ సున్నితంగా ట్రంప్‌కు మందలించారు. ‘రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకూడదు. కానీ చైనా చేయొచ్చా?’ అని ఆమె ప్రశ్నించారు.రష్యా, ఇరాన్ నుంచి చమురు కొనుగోలుదారులో చైనా నంబర్ వన్‌గా ఉందని ఆమె గుర్తు చేశారు. అలాంటిది చైనాకు మాత్రం 90 రోజుల పాటు ఎలాంటి సుంకాలు విధించకుండా మినహాయింపు ఇవ్వవచ్చా? అని ఆమె నిలదీశారు. చైనాకు మినహాయింపు ఇచ్చి భారత్ లాంటి బలమైన మిత్రదేశంతో సంబంధాలను దూరం చేసుకోవద్దని ఆమె సూచించారు. రష్యా నుంచి చమురు కొనవద్దని ట్రంప్ భారత్‌ను బెదిరిస్తూ, మరోవైపు, చైనాకు రాయితీలు ఇచ్చాడు. కానీ భారత్ ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటుంది. భారతదేశం, రష్యా, చైనా ఉమ్మడిగా వ్యవహరిస్తే వారు ట్రంప్ సుంకాల బెలూన్‌ను బద్దలయ్యేటట్లు చేయవచ్చు.

  • చలసాని నరేంద్ర
    98495 69050
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News