న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం టెర్రరిస్ట్ దాడికి భారతదేశం చూపిన నిర్ణయాత్మక ప్రతిస్పందనను రాష్ట్రపతి ద్రౌప ది ముర్ము గురువారం ఘనంగా కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ విజయం… భారతదేశం రక్షణరంగంలో సాధిస్తున్న స్వావలంబనను ప్రతిబింబించిందని రాష్ట్రపతి అన్నారు. భారతదేశం 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశప్రజల నుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. పహల్గాంలో విహారయాత్రకు వచ్చిన అమాయక టూరిస్ట్‌లను, టెర్రరిస్ట్‌లు దారుణంగా, అమానుషంగా చంపడాన్ని రాష్ట్రపతి ఖండించారు. సరిహద్దుల వెంబడి టెర్రరిస్ట్‌ల మౌలిక స్థావరాలను ఎంపిక చేసి, ఖచ్చితంగా నేలమట్టం చేసిన భారత సైనిక దళాల వ్యూహాత్మక, సాంకేతిక సామర్థ్యాన్ని రాష్ట్రపతి ముర్ము ప్రశంచించారు. టెర్రరిజంపై ప్రపంచ పోరాటంలో ఆపరేషన్ సిందూర్ ఒక మైలురాయివంటిదని రాష్ట్రపతి అన్నారు.
టెర్రిరిజంపై మానవాళి పోరులో ఆపరేషన్ సిందూర్ చరిత్రలో నిలిచిపోతుందని తాను నమ్ముతున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివరించారు. సీమాంతర ఉగ్రవాదంపై భారత వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించడంలో కీలక పాత్రవహించిన బహుళ పార్టీ ఎంపీలు, ప్రతినిధులను గొప్పగా కొనియాడారు. ఇది సమిష్టి సంకల్పానికి అద్దం పట్టిందన్నారు. భారత వైఖరిని ప్రపంచం గమనించిదని రాష్ట్రపతి గుర్తు చేశారు. దేశ పౌరుల రక్షణ కోసం.. అవినీతికి తావులేని సుపరిపాలన ప్రాముఖ్యతను గురించి కూడా మాట్లాడారు. మహాత్మాగాంధీని గుర్తు చేసుకుంటూ, అవినీతి, కపటత్వానికి ప్రజాస్వామ్యంలో తావు ఉండరాదన్న మహాత్ముడి బోధనలను ఉదహరిస్తూ, గాంధీ ఆదర్శాలను గ్రహించి దేశం నుంచి అవినీతిని నిర్మించేందుకు శపథంచేయాలని దేశ పౌరులను రాష్ట్రపతి కోరారు. గత జాతీయ చేనేత దినోత్సవం వేడుకలను రాష్ట్రపతి ప్రస్తావిస్తూ, 1920వ దశకంలో స్వదేశీ ఉద్యమానని గుర్తు చేసిందని రాష్ట్రపతి పేర్కొన్నారు.