స్టార్ హీరో ఎన్టీఆర్ బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన చిత్రం ‘వార్-2‘. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలయికలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘వార్’కు ఇది సీక్వెల్. హృతిక్ రోషన్‌తో కలిసి తారక్ కలిసి నటించిన ‘వార్ 2’ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘వార్-2’ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో తెలుసుకుందాం.
కథ: ‘రా’లో టాప్ ఏజెంట్ అయిన కబీర్ (హృతిక్ రోషన్).. ఇండియాకు వ్యతిరేకంగా పని చేసే ప్రమాదకర ఖలీల్ నెట్‌వర్క్‌ను నాశనం చేయడం కోసం ‘రా’ చీఫ్ లూత్రా (అశుతోష్ రాణా) ఆదేశాల మేరకు దేశద్రోహిగా ముద్ర వేయించుకుని ఆ నెట్‌వర్క్ లో భాగం అవుతాడు. అయితే ఈ క్రమంలో తన గురువు అయిన లూత్రానే కబీర్ చంపాల్సి వస్తుంది. దీంతో లూత్రా కూతురు కావ్య (కియారా అద్వాణీ) కబీర్ మీద పగబడుతుంది. ఇంతలో ‘రా’లోకి కొత్తగా వచ్చిన విక్రమ్ (ఎన్టీఆర్)తో కలిసి కావ్య కబీర్‌ను టార్గెట్ చేస్తుంది. కానీ కబీర్ వీళ్లకు చిక్కడు. కొన్ని పరిణామాల తర్వాత విక్రమ్ మీద నమ్మకంతో తాను చేస్తున్న మిషన్ వెనుక అసలు నిజాన్ని కబీర్ చెబుతాడు. కానీ అతడికి విక్రమ్ పెద్ద షాక్ ఇస్తాడు. ఆ షాకేంటి.. ఇంతకీ విక్రమ్ నేపథ్యమేంటి.. కబీర్, -విక్రమ్ మధ్య జరిగిన పోరులో చివరికి ఎవరు గెలిచారు.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం, విశ్లేషణ: యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ యాక్షన్ సినిమాల లవర్స్ కి వార్ 2 యాక్షన్ పరంగా ఒక క్రేజీ యాక్షన్ ట్రీట్ అందిస్తుంది. సినిమా ఆరంభం నుంచే ఒకదాన్ని మించి మరొక యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను మైమమరపిస్తాయి. అలాగే సినిమాలో పలు ట్విస్ట్‌లు, టర్నింగ్‌లు సర్‌ప్రైజ్ చేస్తాయి. వీటితో పాటుగా ఎమోషనల్ సీన్ లు కూడా బాగున్నాయి. అంచనాలకి ఏమాత్రం తీసిపోని విధంగా హీరోలు ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లు అదరగొట్టేశారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ కళ్లు చెదిరే యాక్షన్ ఘట్టాలతో ప్రేక్షకులను అలరించారు. సినిమాలో ప్రీతమ్ స్వరాల్లో రూపొందిన ‘ఊపిరి ఊయలగా..’, ‘సలామ్ అనాలి..’ అంటూ సాగే రెండు పాటలు మైమరపించాయి. అయితే ’సలామ్ అనాలి..’ పాటలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తమ అద్భుతమైన డాన్స్‌తో ప్రేక్షకులను అలరించారు. కథానాయిక కియారా అద్వానీకి కథలో కీలకమైన పాత్రే దక్కింది. ఒక పాటలో ఆమె అందాలు ఆరబోసి కుర్రాళ్లను అలరించింది. యాక్షన్ ఘట్టాల్లో ఆమె బాగానే చేసింది. అనిల్ కపూర్, అశుతోష్ రాణా సహాయ పాత్రల్లో ఓకే అనిపించారు. అయాన్ ముఖర్జీ అద్భుత దర్శకత్వంలో ‘వార్ 2’ మెరుపులు మెరిపించి ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఈ సినిమా ప్రేక్షకులకు మరచిపోలేని అనుభూతినిచ్చింది.