సిద్దిపేట: ప్రజా పాలన ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని కొత్త కుటుంబ సభ్యులు పేర్ల మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు చొప్పున 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరుతుందన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయ ఆవరణలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం మంత్రి పొన్నం స్వీకరించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టిసిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని, ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారని ప్రకంటించారు.
9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద పంట పెట్టుబడి సహాయం అందించామని, రైతు రుణమాఫీ పూర్తి చేశామని, రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 నుంచి 10 లక్షాలకు పెంచుకున్నామని, అదనపు చికిత్సలు యాడ్ చేశామని, ధనవంతులకి పరిమితమైన సన్న బియ్యం ప్రతి ఒక్కరికి 6 కిలోల చెప్పిన దేశంలో తెలంగాణ మాత్రమే అందిస్తుందని కొనియాడారు. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, సన్నవడ్లకు 500 బోనస్ మద్దతు ధర కల్పిస్తున్నామని, ఈ నెలలో ఇదే జిల్లాలో ఉన్న నర్మేట వద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించుకుంటున్నామని, రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసి అధిక ఆదాయాన్ని పొందాలని పొన్నం సూచించారు. చెరువుల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారన్నారు.
సోలార్ బస్సులు, ఇందిరా క్యాంటీన్ లకు యజమానులుగా మహిళలు ఉండేలా ఆర్థిక వృద్ధి చెందేలా సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నామని, వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటేలా కార్యక్రమాలు చేపడుతున్నామని, గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసే దిశగా పనులు వేగంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. జిల్లాను రోడ్లు, మౌలిక వసతులు అన్ని రంగాల్లో అగ్రగామిగా ముందుంచుతామని, వైద్య శాఖ తరుపున పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలు ద్వారా చికిత్స అందిస్తున్నామని, హుస్నాబాద్ లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ నిన్ననే తరగతులు ప్రారంభం చేసుకున్నామని, ఎఐ ద్వారా మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్య బోధన జరుగుతుందని పొన్నం వివరించారు.
త్వరలో హుస్నాబాద్ కేంద్రంగా కబడ్డీ అకాడమీ తీసుకొస్తున్నామని, గురుకులాల్లో మెస్ చార్జీలు పెంచుకోవడంతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, మహిళా, శిశు సంక్షేమ శాఖల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సఖి కేంద్రాలు, చేనేత, జౌళి కేంద్రాలు చేనేతలకు ప్రభుత్వం అండగా ఉంటూ చేనేత వస్త్రాలకు ప్రోత్సాహం అందిస్తున్నామని, పట్టణ పెదకరిక నిర్మూలన ద్వారా సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక మండట కేంద్రాలలో ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఈత, 5 లక్షల తాటి మొక్కలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని, గ్రామాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ కు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలన్నారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఎవరైనా మత్తు బానిస అవుతుంటే 1908 కి కాల్ చేయాలని పొన్నం సూచించారు. తెలంగాణ అన్ని రంగాల్లో ముందుండాలనే సంకల్పంతో అభివృద్ది చేస్తున్నామన్నారు. తెలంగాణ భవిష్యత్ బాగుండాలంటే ప్రతి తెలంగాణ బిడ్డ ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమవతి, పోలీస్ కమిషనర్ అనురాధ, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.